calender_icon.png 25 March, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండుసున్నా వచ్చిన పార్టీ గురించి ఏం మాట్లాడాలి?

23-03-2025 12:54:59 AM

సమయం వృథా తప్ప తప్ప ప్రయోజనం లేదు

బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని నాశనం చేశారు

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌పై మంత్రి కోమటిరెడ్డి సెటైర్లు

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిన పార్టీ గురించి తాను ఏం మాట్లాడాలని, ఒకవేళ మాట్లాడినా టైమ్ వేస్ట్ అవుతుందని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం అసెంబ్లీలో హ్యామ్ రోడ్లపై జరిగిన చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ సభ్యులు హరీశ్‌రావు,  ప్రశాంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌పై కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. హ్యామ్ రోడ్లను పీపీపీ మోడల్‌లో నిర్మించడం లేదని, దీని మీద తాను సమాధానం చెప్పినా.. బీఆర్‌ఎస్ అర్థం చేసుకోకపోతే తానేమీ చేయలేనన్నారు. హ్యామ్ మోడల్‌ను దేశంలో ప్రస్తుతం 8 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు.

బీఆర్‌ఎస్ సర్కారు పదేండ్లలో నిర్మించిన రోడ్లను.. తాము ఏడాది కాలంలోనే వేసినట్టు చెప్పారు. 2017లో ఉప్పల్ ఎలివేటర్ కారిడార్‌కు గెజిట్ వచ్చినా బీఆర్‌ఎస్ ఎందుకు నిర్మించలేదన్నారు. తాము 18 నెలల్లో ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పూర్తి చేస్తున్నామన్నారు. ఆర్‌అండ్‌బీ మంత్రిగా ఉన్నప్పుడు ప్రశాంత్‌రెడ్డి నల్లగొండకు రూ.200 కోట్ల విలువైన రోడ్లు ఇచ్చామంటున్నారని, నిరూపిస్తే సన్మానం చేస్తానన్నారు.