హైదరాబాద్: గత ప్రభుత్వం కూడా సర్వే చేసి నివేదికను సభలో ప్రవేశపెట్టలేదని తెలంగాణ శాసననభలో ఎమ్ఐఎమ్ పార్టీ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ(MIM party leader Akbaruddin Owaisi) అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కులసర్వే పూర్తి నివేదికను సభలో ప్రవేశపెట్టాలన్నారు. కులసర్వే పూర్తి నివేదికను సభలో పెట్టకుండా ఏం చర్చించాలి..? అని అక్బరుద్దీన్ విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం ప్రకటన చేయాలన్నారు. మున్సిపాలిటీలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టంగా చెప్పాలని, రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని ఇందిరాసహని కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిందన్నారు.
ఆలస్యం చేయకుండా త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అక్బరుద్దీన్ అన్నారు. అలాగే సర్పంచ్(Sarpanch), ఎంపీటీసీ(MPTC), జడ్పీటీసీ(ZPTC) ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నారు. సమాజంలో పేదరికం తగ్గాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పించాలని, ముస్లింలలోనే వెనుకబాటుతనం ఎక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం ముస్లింలకు అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్ మతపరమైంది కాదని, వెనుకబాటుతనం ప్రాతిపదికన ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ అమలవుతుందన్నారు. వెనుకబడిన వారు ఏ కులంలో ఉన్నా.. వారికి ప్రభుత్వ ప్రోత్సాహం అందించాలన్నారు.