టీచర్ల బదిలీల్లో జోక్యం చేసుకోం
అప్పీళ్లను కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో జోక్యం చేసుకోలేమని గురువారం హైకోర్టు స్పష్టం చేసింది. బదిలీలు, పదోన్నతులు అన్నీ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే జరుగుతాయని, మధ్యలో చేపట్టినట్లయితే విద్యార్థులు నష్టపోతారంది. బదిలీలు, పదోన్నతుల వివాదాల్లో విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పింది. బదిలీలు, పదోన్నతులకు అనుమతిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది.
బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాల నుంచి ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్‌లను రంగారెడ్డికి బదిలీ చేయడం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని, దీనివల్ల ఈ జిల్లాలో పనిచేసే తాము నష్టపోతున్నామంటూ రంగారెడ్డికి చెందిన సుమారు 40 మందికిపైగా ఉపాధ్యాయులు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సింగిల్ జడ్జి 40 పోస్టులను రిజర్వు చేసి పదోన్నతులు, బదిలీలు కొనసాగించవచ్చని ఆదేశించారు.
దీన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ సీనియారిటీ జాబితా లేకుండానే చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రతివాదులు, ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఇతర జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లాకు వచ్చినవారందరూ జూనియర్లేనని తెలిపారు. వీరి వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నారు.
న్యాయవాదులకు బీమా రూ.6 లక్షలు
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): న్యాయవాదులకు జీవిత బీమాను రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచుతూ స్టేట్ బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. గత ఏప్రిల్ 6న కౌన్సిల్ భేటీలో అడ్వొకేట్స్ వేల్ఫేర్ ఫండ్ యాక్ట్ లోని సెక్షన్16 (2) ప్రకారం పెంపునకు నిర్ణయం తీసుకున్నట్టు స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి గురువారం వెల్లడించారు. కౌన్సిల్ పరిధిలో దాదాపు 53,220 మంది న్యాయవాదులుగా నమోదు చేసుకున్నారని, జూలై 1 నుంచి ఈ పెంపుదల నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు.