15-03-2025 12:47:09 AM
చేవెళ్ల, మార్చి 14: మొయినాబాద్ మండలం తోలుకట్టలో ఫాంహౌస్‌లో జరిగిన కోడిపందేల కేసు విషయంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ల్యాండ్ యజమాని అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి ఘటన జరిగిన మరునాడు ఫిబ్ర వరి 13న నోటీసులు జారీ చేయగా.. తన కు సంబంధం లేదని అడ్వొకేట్ ద్వారా సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా పోలీసులు గురువారం మాదాపూర్‌లోని ఆయన ఇంటికి వెళ్లి మరో సారి నోటీసులిచ్చారు. దీంతో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఆయన మొయినాబాద్ పీఎస్‌కు వచ్చారు. దాదాపు 4 గంటల పాటు విచారించిన ఏసీపీ కిషన్, సీఐ పవన్‌కుమార్ రెడ్డి పలు వివరాలు సేకరించారు.
సదరు భూఇ ఎప్పుడు కొన్నారు? ఇతరులకు ఎప్పుడు లీజుకిచ్చారు? మీకు తెలియకుండానే కోడి పందేలు జరుగుతున్నాయా? అందులో మీ పాత్ర లేదా? అని తదితర అంశాల మీద ప్రశ్నించారు.
10 ఎకరాల భూమి నాదే..
పోలీసుల విచారణలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలిసింది. తోల్‌కట్ట గ్రామంలోని సర్వే నెంబర్ 165లో 10.01 ఎకరాల భూమిని 2018లో సేల్‌డీడ్ ద్వారా కొన్నానని.. అయితే తాను ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నందున ఆ భూమికి సంబంధించిన అన్ని వ్యవహారాలు తన మేనల్లుడు జ్ఞానదేవ్‌రెడ్డి చూసుకుంటున్నట్టు వెల్లడించారు.
మీడియాలో ప్రచారమవుతున్నట్టు అందులో ఎలాంటి ఫాం హౌస్, గెస్ట్‌హౌస్ లేదని, కేవలం మామిడి, కొబ్బరి తోటతో పాటు వ్యవసాయ పనిముట్లు పెట్టుకునేందుకు, అక్కడి పనిచేసే వారు ఉండేందుకు రెండు గదులు మాత్రమే ఉన్నట్టు తెలిపారు. జ్ఞానదేవ్ రెడ్డి..
వర్రా రమేశ్‌కుమార్ రెడ్డి, ఎం వెంకటపతిరాజుకు కౌలుకు ఇచ్చినట్టు ఘటన జరిగిన తర్వాతే తనకు తెలిసిందని పోచంపల్లి సమాధానమిచ్చినట్టు సమాచారం. భూమిని కౌలుకు తీసుకున్న వ్యక్తులు ఇతరుల ద్వారా కోడి పందేలు నిర్వహించారని, అందులో తనకెలాంటి సంబంధం లేదని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశానని చెప్పినట్టు తెలిసింది.
ఇదీ కేసు..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామ రెవెన్యూలోని ఫాంహౌస్‌లో కోడి పందేలు నిర్వహిస్తున్నారని ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో గతనెల 12వ తేదీ రాత్రి దాడులు నిర్వహించారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్ రెడ్డి తమ 50 మంది సిబ్బందితో కోడి పందేల శిబిరానికి చేరుకొని పందేల నిర్వాహకుడు, ఏపీకి చెందిన భూపతిరాజు, శివ కుమార్‌వర్మతో సహా 61 మంది పందెం రాయుళ్లను పట్టుకున్నారు.
కోడిపందేలు ఆడుతున్న వారి నుంచి 46 కోడికత్తులు, 55 కార్లు, 64 మొబైల్ ఫోన్స్, 84 కోళ్లు, రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వీరందరికీ నోటీసులిచ్చి.. విచారణ కూడా చేశారు. అంతేకాదు పట్టుబడిన 84 కోళ్లలో 3 చనిపోగా మిగతా కోళ్లకు రాజేంద్రనగర్ కోర్టులో బహిరంగ వేలం వేయగా.. రూ.16.60 లక్షలకు అమ్ముడయ్యాయి.