calender_icon.png 8 November, 2024 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల బాండ్లపై ఏది నిజం?

17-04-2024 12:05:00 AM

ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయడం వల్ల దేశం మరోసారి నల్లధనం వైపు నెట్టి వేయబడిందని, దీనిపై భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ పశ్చాత్తాప పడతారని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్నికల్లో నల్లధనం వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఉన్న ఎన్నికల బాండ్లపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. ఓ జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తమ వివరాలు ఏవీ వెల్లడించకుండా వ్యక్తులు, కంపెనీలు  బాండ్లు కొనుగోలు చేయడం ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పిస్తున్న ఈ ఎన్నికల బాండ్ల విధానాన్ని సిజెఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఫిబ్రవరిలో కొట్టివేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఇప్పటిదాకా ఈ విధానం ద్వారా రాజకీయ పార్టీలకు ఇచ్చిన కంపెనీలు, వ్యక్తుల పూర్తి వివరాలను  ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ను న్యాయస్థానం ఆదేశించింది కూడా. ఎలక్టోరల్ బాండ్స్ విధానం వల్ల ఎక్కువ లబ్ధి పొందింది అధికార జీజేపీయేనని, కంపెనీలు, వ్యక్తులు తమ ప్రయోజనాల కోసం ఆ పార్టీకి బాండ్ల కొనుగోలు రూపంలో భారీగా ముడుపులు అందించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తం ఎలక్టోరల్ బాండ్ల విరాళాల్లో సగం  కమలం పార్టీకే దక్కాయని  విపక్షాలు లెక్కలను సైతం బయట పెట్టాయి. ‘దేశంలో ఇప్పటివరకు జరిగిన అన్ని కుంభకోణాలకన్నా కూడా ఇది అతిపెద్ద స్కామ్’ అని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఉన్న ఎలక్టోరల్ బాండ్స్‌పై ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ప్రధాని అంటున్నారు. మనీ లాండరింగ్ కేసుల తర్వాత విరాళాలు ఇచ్చిన 16 కంపెనీల ద్వారా బీజేపీకి లభించింది 37 శాతం మాత్ర మేనని, మిగతా 63 శాతం విరాళాలు బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలకే వెళ్లాయని ఆయన అంటున్నారు. రాజకీయ విరాళాలన్నింటినీ  చెక్కుల రూపం లో తీసుకోవాలని గతంలో బీజేపీ నిర్ణయించిందని అయితే, భవిష్యత్తులో ఇబ్బందులు  తలెత్తుతాయని వ్యాపారులు అందుకు అంగీకరిం చలేదని చెప్పారు. లెక్కల్లో చూపని ధనాన్ని అంటే బ్లాక్ మనీని ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఖర్చు చేస్తారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీక రిస్తారని, దీనికి ఎలా అడ్డుకట్ట వేయాలనే ఆలోచననుంచి పుట్టిందే ఈ ఎలక్టోరల్ బాండ్స్ విధానమని మోడీ అన్నారు. ఇదొక చిన్న ప్రయత్నం మాత్ర మేనని, ఇది పూర్తిగా లోపరహితమని తాను ఎప్పుడూ చెప్పలేదని కూడా ఆయన అంటున్నారు. ఏవయినా లోపాలుంటే చర్చించి మార్పులు చేసుకోవచ్చు కానీ, పూర్తిగా విధానమే తప్పనడం సరి కాదనేది  ప్రధాని వాదన.