calender_icon.png 24 January, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదేమి మాయ..

24-01-2025 01:25:08 AM

  1. అందరి అఫిడవిట్లు ఒకేలా ఉన్నాయెందుకు?
  2. నవయుగ సంస్థపై అసంతృప్తి వ్యక్తంచేసిన కాళేశ్వరం కమిషన్

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): కాళేశ్వరం కమిషన్ విచారణకు గురువారం నవయుగ డైరెక్టర్ రమేష్, నవయుగ సంస్థ ప్రతినిధులు హాజర య్యారు. సుందిళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ సంస్థే చేపట్టడంతో కమిషన్ వారిని విచారించింది. నవయుగ డైరెక్టర్ రమేష్ అఫిడవిట్‌ను పరిశీలించిన కమిషన్.. సంస్థ ప్రతినిధుల అఫిడవిట్లు కాపి, పేస్ట్ చేసినట్టుగా ఒకేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

సుందిళ్ల ప్రాజెక్టు డ్యామేజీ ఎలా జరిగింది? ఎప్పుడు జరిగిందని కమిషన్ ప్రశ్నించగా, భారీ వరదలతో 2022లో ప్రాజెక్టు చాలా భాగం డ్యామేజ్ జరిగిందని నవయుగ డైరెక్టర్ రమేష్ జవాబిచ్చారు. డ్యామేజీ జరిగిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆయనను కమిషన్ ప్రశ్నించింది.

గ్రౌంటింగ్ తోపాటు అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించామని, అధికారులు కూడా సంతృప్తి వ్యక్తంచేసినట్లు రమేష్ సమాధానమిచ్చారు. డిజైన్ ఆధారంగానే డ్యామేజ్ తరువాత మరమ్మతులను చేశామని తెలిపారు. ప్రాజెక్టు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌పై ఒప్పందాలు జరగలేదని కమిషన్‌కు తెలిపారు.

ప్రస్తుతం బ్యారేజీ వద్ద  తమ సంస్థ ప్రతినిధులు ఉన్నారని, అయితే ఎలాంటి యాక్టివిటీ జరగడం లేదని వెల్లడించారు. పనులు పూర్తి చేసినా.. ఫైనల్ బిల్లులు ఇంకా ఇవ్వలేదని ఆయన వాపోయారు. పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్లు ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ డ్యామేజ్ జరగడంతో బిల్లులు ఆపారని కమిషన్‌కు తెలిపారు.  

బద్నాం చేస్తే లీగల్‌గా వెళ్తాం..

అగ్రిమెంట్ 2016లో జరిగిందని, సప్లిమెంటరీ అగ్రిమెంట్లు జరగలేదని కమిషన్‌కు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. డిజైన్ ప్రకారమే నిర్మాణం చేశామని, డ్యామేజీలకు తమకు సంబంధం లేదని తెలిపారు. సుందిళ్ల నిర్మాణంలో సంతృప్తి చెందిన గత ప్రభుత్వం తమకు సిర్టిఫికెట్ కూడా ఇచ్చిందని తెలిపారు.

డిజైన్‌లు ఎవరు చేశారో, ఎలా చేశారో తమకు తెలియదన్నారు. వారిచ్చిన డిజైన్ ప్రకారమే తాము నిర్మాణం చేసి ఇచ్చామని, సుందిళ్ల బరాజ్ నిర్మాణం పూర్తి అయినట్లు కంప్లిషన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారని పేర్కొన్నారు. సుందిళ్ల నిర్మాణంలో తమ సంస్థ నుంచి ఎలాంటి తప్పిదాలు జరగలేదని, బద్నాం చేస్తే లీగల్‌గా వెళ్లి నిరూపించుకుంటామని కమిషన్‌కు తెలిపారు.