calender_icon.png 24 October, 2024 | 3:47 AM

ఈ నగరానికి ఏంది? జ్వరమొచ్చింది

24-10-2024 01:01:35 AM

  1. వణికిస్తున్న విష జ్వరాలతో ప్రజలు విలవిల 
  2. డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియాతో అల్లాడుతున్న జనం  
  3. దోమల నియంత్రణలో అధికారుల చర్యలు నామమాత్రం  
  4. పడకేసిన పారిశుద్ధ్యంతో తప్పని తిప్పలు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరం ప్రస్తుతం విష జ్వరాలకు కేరాఫ్‌గా మారింది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జ్వరాల బారినపడుతున్నారు. ఈ వైరల్ జ్వరాలు ఒకరి నుం చి మరొకరికి వ్యాపిస్తూ మొత్తం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నా యి.

తీవ్రమైన జ్వరం, ఒళ్లు, కీళ్ల నొప్పులు, జలుబు, దగ్గు, నీరసం తదితర లక్షణాలతో ప్రజలంతా ఆసుపత్రుల పాలవుతున్నారు. దీం తో నగరంలోని దవాఖానాలు అన్ని జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఈ తరహా వ్యాధులకు వాతావ రణంలో మా ర్పులు ఒక కారణం అయితే.. గ్రేటర్‌వ్యాప్తం గా పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం, వ్యాధులకు కారణమ వుతున్న దోమ ల నియంత్రణలో బల్దియా చేపడుతున్న చర్యలు నామమాత్రంగానే ఉండటం మరో కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వెంటాడుతున్న విష జ్వరాలు.. 

గ్రేటర్‌లో గత నాలుగు నెలలుగా విష జ్వరాలు వెంటాడుతున్నాయి. ప్రజలంతా జ్వరాలు, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, కీళ్ల నొప్పులు, కాళ్లవాపులు తదితర సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ జ్వరాలు కనీసం వారం నుంచి 10 రోజులకు పైగా పీడిస్తున్నాయి. జ్వర పీడితుల కారణంగా దవాఖానాలో ఓపీల సంఖ్య పెరుగుతోంది.

ముఖ్యం గా నగరంలోని ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, నీలోఫర్ తదితర ప్రభుత్వ దవాఖానాలతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ రోగులు క్యూ కడుతున్నారు. ఫీవర్ ఆసుపత్రిలో ప్రతి రోజూ ఓపీ 500 వరకూ చేరుకుంటోంది. ఇక్కడికొచ్చే ప్రతి పేషెంట్ వైరల్ ఫీవర్‌తోనే బాధపడుతున్నారు.

ఇంట్లో ఒకరికి జ్వరం వచ్చిందంటే వారికి నయం అయ్యే లోగానే మరొకరు జర్వం బారినపడుతున్నారు. దోమ కాటు కారణంగా చికున్‌గున్యా, డెంగ్యూ వ్యాపిస్తున్నా యని, దోమల్లోనూ జెనిటికల్ మ్యుటేషన్ జరుగుతుందని, దీంతో విష జ్వరాలు విజృంభి స్తున్నట్టుగా వైద్యులు తెలియజేస్తున్నారు. ఇటీవలి వరకు డెంగ్యూ కేసులు అత్యధికంగా ఉండగా, తాజాగా చికున్ గున్యా కేసులు పెరుగుతున్నాయి.

పారిశుద్ధ్య నిర్వహణ నామమాత్రమే.. 

గ్రేటర్‌లో పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రమే ఉన్నట్టుగా ప్రజలు, బల్దియా ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. ఇళ్లలో చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోలు ఉన్నప్పటికీ, అన్ని ప్రాంతాల్లోకి ఈ ఆటోలు వెళ్లి చెత్త సేకరించడం లేదు. దీంతో చాలామంది ప్రజలు చెత్తను ఎక్కడిపడితే అక్కడ రోడ్లపైనే వదిలేసి వెళ్లిపోతున్నారు.

ఈ కేంద్రాలను గుర్తించి, స్పెషల్ డ్రైవ్ ద్వారా క్రమేపీ తొలగించాలని నిర్ణయించినా, వీటిని తొలగిం చేందుకు బల్దియా ఇంకా సమాయత్తం కావడం లేదు. దీంతో ఆ చెత్త నుంచి బ్యాక్టీరియా పుట్టుకొచ్చి, దోమలు ఉత్పత్తి అవుతు న్నట్టుగా స్వయంగా బల్దియా వైద్యులే చెబుతున్నారు. దోమల నియంత్రణకు చేపట్టే ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్(ఏఎల్‌వో)ను క్షేత్రస్థాయిలో సక్రమంగా చేపట్టడం లేదనే విమర్శలున్నాయి.

సర్కిళ్లు, జోన్ స్థాయి అధికారులు, సిబ్బందిపై ప్రధాన కార్యాలయం అధికారులు సరైన పర్యవేక్షణ చేయనందునే ఈ దోమల నివారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారవుతుందనే విమర్శలు ఉన్నాయి. గ్రేటర్‌వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణకు ప్రతి నెలా దాదాపు రూ. 100 కోట్లు, దోమల నియంత్రణకు లక్షలాది రూపాయలను బల్దియా వెచ్చిస్తుంది.

అయినా అటు పారిశుద్ధ్య నిర్వహణ, ఇటు దోమల నియంత్రణను సక్రమంగా చేపట్టడంలో బల్దియా విఫలమవుతోంది. దోమల నియంత్రణకు కూల్ ఫాగింగ్ అమలు చేసేందుకు పైలట్ ప్రాజెక్ట్‌గా ఇటీవల ప్రయోగం చేసింది. కానీ, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 

ఆందోళన అవసరం లేదు

ప్రస్తుతం వచ్చే విష జ్వరాలకు ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందు గా ఎన్‌ఎస్ టెస్ట్, తర్వాత ఐజీజీ (ఓల్డ్ ఇన్‌ఫెక్షన్), ఐజీఎం (న్యూ ఇన్‌ఫెక్షన్) టెస్టులతోనే డెంగ్యూ జర్వం నిర్ధారణ అవుతుంది. వీటిలో ఐజీఎం న్యూ ఇన్‌ఫెక్షన్ వస్తేనే జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా ఇన్‌ఫెక్షన్ వస్తే ఎలాం టి భయం అవసరం లేదు. జ్వరం వచ్చిన 24 గంటల తర్వాత మలేరియా గా భావించాలి, 5 రోజులు అయితే డెంగ్యూగా, వారం అయితే టైఫాయిడ్‌గా మారే అవకాశాలుంటాయి. 

 డాక్టర్ ఏ రాంబాబు, 

బల్దియా చీఫ్ ఎంటమాలజిస్ట్

ఎక్కడా ఫాగింగ్ జరగడం లేదు   

నగరంలో ఫాగింగ్ ఎక్కడా జరగడం లేదు. ఫలితంగా దోమలు విజృంభించి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. మురుగునీరు నేరుగా చెరువుల్లో కలుస్తోంది. ఈ మురుగు నీటిని శుద్ధి చేసి చెరువుల్లో కలిపితే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. కానీ, బల్దియా ఆ పని చేయడం లేదు. ఫలితంగా భాగ్యనగరంలో వేలాది మంది వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఇదంతా ప్రభుత్వానికి, బల్దియాకు ముందుచూపు లేకపోవడం కారణంగానే జరుగుతుంది.  నగరంలో దోమల బెడద తగ్గించడానికి బల్దియా ఒక్క చర్య కూడా చేపట్టడం లేదు.  

 శ్రవణ్, 

మల్కాజిగిరి కార్పొరేటర్