calender_icon.png 12 March, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాదులపై ఇదేం దందా?

17-05-2024 01:08:20 AM

ఇష్టారీతిన కాంట్రాక్ట్ రద్దు

అందినకాడికి అంచనాల పెంపు

రూ.322 కోట్లతో మొదలైన  ఫేజ్-3 ప్యాకేజీ-6 పనులు

భూసేకరణకు రూ.100 కోట్లు

రూ.35.87 కోట్ల పనులు జరిగాక.. కాంట్రాక్టు రద్దు.. స్టే ఇచ్చిన హైకోర్టు

అకస్మాత్తుగా అంచనా వ్యయం రూ.286 కోట్లు పెంపుదల

మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగింత

ప్రభుత్వంపై రూ.500 కోట్ల వరకు భారం

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 16 (విజయక్రాంతి) ః తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల తెరచాటు వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగు తుండగా, దేవాదుల ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు, అంచనా వ్యయం పెరుగుదల వెనుక జరిగిన కుట్రలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దేవాదుల ప్రాజెక్టు పనులు జరుగుతుండగానే ఒక్కసారిగా అంచనా వ్యయాన్ని (అదనంగా రూ. 286 కోట్లు) పెంచి టెండర్‌లో కాంట్రాక్టు దక్కించుకున్న క్రాంతి (జేవీ) నిర్మాణ సంస్థ కాంట్రాక్టును రద్దు చేయడంతో పాటు కోర్టును తప్పుదోవ పట్టిస్తూ మరో కాంట్రాక్టర్‌కు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఫేజ్  ప్యాకేజీ నిర్మాణ పనులను అప్పగించారు. ఉత్తర తెలంగాణలోని భూము లను పచ్చని మగాణంగా మార్చాలనే లక్ష్యంతో చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ జరిగిన వ్యవహారంపై కథనం.  

ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలతో పాటు సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో సుమారు 6.21లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో మొదటి దశలో 1.23లక్షల ఎకరాలు, రెండవ దశలో 1.91లక్షల ఎకరాలు, మూడవ దశలో 3.07లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. గోదావరిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 31,383 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 28,793 ఎకరాలను సేకరించారని, మరో 2,590 ఎకరాలు సేకరించాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.  

రూ.322.20 కోట్లతో ... 

ఉమ్మడి రాష్ట్రంలోనే దేవాదుల ప్రాజెక్టు మొదటి,  రెండవ దశ పనులు మొదలవగా, గతంలోనే దేవాదుల ప్రాజెక్టు ఫేజ్ ప్యాకేజీ పనులు మొదలయ్యాయి. ఆ సమయంలో క్రాంతి (జేవీ) నిర్మాణ సంస్థ రూ.322.20 కోట్లకు టెండర్ ద్వారా దేవాదుల కాంట్రాక్టును దక్కించుకుంది. అయితే ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం చెల్లింపులలో ఆలస్యం జరిగిన నేపథ్యంలో అదనంగా మరో రూ.100 కోట్ల (నాలుగు విడుతలుగా)ను ప్రభుత్వం కేటాయించింది. అయితే కాంట్రాక్టు దక్కించుకున్న తాము రూ.15.87కోట్ల విలువైన పనులు పూర్తి చేసినా, బిల్లులు పెండింగ్‌లో ఉంచారని క్రాంతి (జేవీ) నిర్మాణ సంస్థ అధినేత ఎం సురేశ్‌కుమార్ రెడ్డి అరోపించారు. అంతేకాదు మరో రూ.20 కోట్ల పనులు జరిగాయని, రికార్డు కాని ఈ రూ.20 కోట్ల పనులకు కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సి ఉందని ఆయన తెలిపారు. 

ప్రత్యేక రాష్ట్రంలో జీవో జారీ...

తెలంగాణలో కోటి ఎకరాలను సాగులోకి తేవాలనే సంకల్పంతో సాగునీటి ప్రాజెక్టులను పురోగతిలోకి తెవాలని, కాంట్రాక్టర్‌కు అదనంగా 10శాతం లాభం చేకూర్చి అయినా సరే పనులను పూర్తిచేయాలని మాజీ సీఎం కేసీఆర్ భావించారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలనే లక్ష్యంతో జీవోన జారీ చేశారు. ఉన్నతాశయంతో నాటి సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల కోసం నిధుల కేటాయింపులో చూపుతున్న ఉదారతను గ్రహించిన కొంత మంది అధికారులు, మంత్రులు దీనిని అవకాశంగా తీసుకొని ప్రాజెక్టుల అంచనాలను భారీగా పెంచారని క్రాంతి (జేవీ) నిర్మాణ సంస్థ యజమాని సురేశ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. 

కాంట్రాక్టు రద్దు.. రూ.286 కోట్లకు పెరిగిన అంచనా

దేవాదుల ప్రాజెక్టులో పనిచేస్తున్న అధికారులతో జతకట్టిన అప్పటి స్థానిక మంత్రి ఎలాగైనా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచి సొమ్ము చేసుకోవాలని భావించాడని, ఈ క్రమంలోనే తనకు వచ్చిన కాంట్రాక్టును అకారణంగా రద్దు చేయించాడని సురేష్ రెడ్డి ఆరోపించారు. అప్పటికే 35.87 కోట్ల పనులు జరిగాయని, మరో రూ.220 కోట్ల పనులు జరగాల్సి ఉందని సురేష్ రెడ్డి తెలిపారు.

అయితే కాంట్రాక్టు రద్దుపై కోర్టును ఆశ్రయించగా స్టే విధించినప్పటికీ, ఇంజనీరింగ్ అధికారులు నాలుగు నెలల తర్వాత ప్రాజెక్టు పనులు ఇదివరకే మొదలయ్యాయని కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు అప్పటి మంత్రి సూచన మేరకు మిగులు పనుల కోసం అవసరమైన రూ.220కోట్లకు అదనంగా మరో రూ.286 కోట్లు కలిపి అంచనా వ్యయాన్ని రూ.506 కోట్లకు పెంచారని సురేశ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. 

రూ.500 కోట్ల ప్రజాధనం లూటీ...

దేవాదుల ప్రాజెక్టు ఫేజ్ ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని అకస్మాత్తుగా పెంచడం వలన ప్రభుత్వంపై రూ.500 కోట్ల వరకు భారం పడుతుందని సురేష్ రెడ్డి తెలిపారు. గతంలో తనకు వచ్చిన టెండర్ ప్రకారం పనులను పూర్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తమతో చర్చించేందుకు సుముఖంగా లేదన్నారు. భవిష్యత్తులో ఆర్బిట్రేషన్‌కు వెళితే రూ.624 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని, దీనికి బాధ్యులెవరని సురేశ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. కాబట్టి కాంట్రాక్టును రద్దు చేసి హైకోర్టును, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సురేశ్‌కుమార్ రెడ్డి కోరారు. పాత రేట్ల ప్రకారమే తాము మిగిలిన పనులను పూర్తి చేస్తామన్నారు. ఇందులో జీవో 146 ప్రకారం పెరిగిన వ్యయం రూ.624 కోట్లపై సంప్రదింపులకు తాము సిద్ధమేనని తెలిపారు. దీని వలన ప్రభుత్వానికి రూ.500 కోట్ల వరకు ఆదా అవుతుందని ఆయన తెలిపారు. 

అలాంటిదేమీ లేదు: సుధీర్, సీనియర్ సూపరింటిండెంట్ ఇంజినీర్

ఈ వ్యవహారంపై దేవాదుల ప్రాజెక్టు ఫేజ్ సీనియర్ సూపరింటిండెంట్ ఇంజినీర్‌ను వివరణ కోరగా.. తను కొద్ది రోజుల కిందటనే వచ్చానన్నారు. కాంట్రాక్టర్ రద్దు వివరాలు తనకు తెలియవని, దేవాదుల ఫేజ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి కోర్టు వివాదాలు లేవని అన్నారు. -