29-04-2024 12:58:04 AM
కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోను బాగా ప్రచారం చేస్తోంది.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం మొత్తాన్ని స్కాన్ చేస్తామని, మీ బ్యాంకు ఖాతాలను, మీ పొదుపు సొమ్మును కూడా చెక్ చేస్తామని, ఆఖరికి స్త్రీధనం (మహిళల బంగారం) కూడా లాక్కుంటామని చెబుతున్న మ్యానిఫెస్టోను ఇద్దరు అన్నా చెల్లెళ్లు వెనుకేసుకొస్తున్నారు.
మోదీ
ముస్లిం నవాబుల దురాగతాలు కనిపించవా? n హిందూ రాజుల అరాచకాలే కన్పిస్తాయా?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపదను లాక్కుంటారు l ఇలాంటి మ్యానిఫెస్టోకు అన్నాచెల్లెళ్ల సమర్థనా?
దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా కాంగ్రెస్ చర్యలు l ఓటు బ్యాంకు రాజకీయాలతో రక్షణ ఉండదు రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు
బెళగావి, ఏప్రిల్ 28: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. హిందూ రాజుల అరాచకాల గురించి మాట్లాడే కాంగ్రెస్ యువరాజు.. ఔరంగజేబు వంటి ముస్లిం నవాబులు చేసిన దురాగతాల గురించి ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. ఆదివారం కర్ణాటకలోని బెళ గావిలో ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ‘కాంగ్రెస్ రాకుమారుడు తమ ఓటు బ్యాంకును మెప్పించేలా వ్యూహాత్మకంగా మాట్లాడుతుంటారు. నవాబులు, నిజాంలు, సుల్తాన్లు, బాద్‌షాలు చేసిన అరాచకాలపై మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడరు. కొన్ని వేల దేవాలయాలను నేలమట్టం చేసిన ఔరంగజేబు అరాచకాలు మాత్రం కాంగ్రెస్‌కు గుర్తుండవు. పైగా అలాంటి ఔరంగజేబును పొగిడిన పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటారు. మన పర్యాటక క్షేత్రాలను ధ్వంసం చేసి, వాటిని దోచుకుని, మన ప్రజలను, ఆవులను కిరాతకంగా చంపిన వారి గురించి మాత్రం అసలే మాట్లాడరు’ అని ప్రధాని దుయ్యబట్టారు.
బంగారం లాగేసుకుంటారు..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు కూడా దోచుకుంటుందన్న వ్యాఖ్యలపై తగ్గేదే లేదంటూ ప్రధాని మోదీ.. అదే అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని ప్రతి ఇంట్లో సోదాలు చేస్తారంటూ పునరుద్ఘాటించారు. ‘కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోను బాగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం మొత్తాన్ని స్కాన్ చేస్తామని, మీ బ్యాంకు ఖాతాలను, మీ పొదుపు సొమ్మును కూడా చెక్ చేస్తామని, ఆఖరికి స్త్రీధనం (మహిళల బంగారం) కూడా లాక్కుంటామని చెబుతున్న మ్యానిఫెస్టోను ఇద్దరు అన్నా చెల్లెళ్లు వెనుకేసు కొస్తున్నారు’ అంటూ రాహుల్, ప్రియాంక గాంధీపై మోదీ విరుచుకుపడ్డారు.
దేశ ప్రతిష్టకు భంగం..
ప్రతిపక్ష కాంగ్రెస్ తీసుకునే చాలా నిర్ణయాలు దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయంటూ ప్రధాని మోదీ దుయ్యబట్టారు. కోవిడ్ వ్యాక్సిన్ నుంచి ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసి దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసిందని మండిపడ్డారు. దేశ పరువును పోగొట్టేందుకు కాంగ్రెస్ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోదని విమర్శించారు. ‘ఇవాళ భారత్‌ను ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయి. ఇది మన దేశ ప్రజలందరికీ గర్వకారణం. పేదరికం నుంచి ఏకంగా 25 కోట్ల మంది ప్రజలు బయటపడ్డారు. ఇది దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని మోదీ అన్నారు. దేశం అభివృద్ధి చెందుతుంటే.. భారత్ బలమైన దేశంగా మారుతుంటే.. ప్రతి భారతీయుడు సంతోషంగా ఉన్నారని, అయితే కాంగ్రెస్ మాత్రం దేశ ప్రయోజనాలు కాకుండా కుటుంబ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందంటూ దుయ్యబట్టారు. దేశం అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్‌కు నచ్చదంటూ దుయ్యబట్టారు.
మహిళలకు రక్షణ ఉండదు..
కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ ఉండదని ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని హుబ్బళిలో ఓ విద్యార్థినిని పట్టపగలే కత్తితో పొడిచి చంపిన ఘటనను మోదీ ప్రస్తావించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వ్యక్తులకు ఎలాంటి భయం ఉండదని, ఇదంతా కాంగ్రెస్ విధానాల వల్లే సాధ్యమైందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కర్ణాటకలోని ఓ కేఫ్‌లో పేలుడు జరిగితే తొలుత అది గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల జరిగిందని కాంగ్రెస్ ప్రకటించింది. ఆ తర్వాత ఇద్దరు వ్యాపారుల మధ్య గొడవ వల్ల జరిగిందని మాట మార్చింది. కానీ పశ్చిమబెంగాల్‌లో నిందితులను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఈ పేలుడు వెనుక భారీ కుట్ర దాగి ఉందని గుర్తించింది. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు కాంగ్రెస్ చేసే రాజకీయాలు మిమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడవు’ అని కర్ణాటకలోని బళ్లారి సభలో ఆయన విమర్శలు చేశారు.