calender_icon.png 23 November, 2024 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటరు తీర్పు ఎటు?

22-11-2024 12:00:00 AM

గత కొన్ని నెలలుగా యావద్దేశం ఆసక్తిగా ఎదురు చూసిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ఘట్టం ముగిసింది. మరికొద్ది గంటల్లో ఫలితాలు సైతం వెల్లడి కానున్నాయి. కాగా బుధవారం పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో మెజారిటీ సర్వేలు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో  బీజేపీ నేతృత్వంలోని కూటములకే విజయావకాశాలున్నాయని అంచనా వేశాయి.

అయితే బీజేపీ, కాంగ్రెస్ నేతృ త్వంలోని ప్రధాన కూటముల మధ్య తేడా పెద్దగా లేకపోవడం గమనార్హం. మరోవైపు గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి రెండు రాష్ట్రాల్లోను రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైన నేపథ్యంలో హర్యానా, జమ్మూ, కశ్మీర్ తరహాలో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అంచనాలు తల్లకిందులు అయ్యే అవకా శాలు లేకపోలేదనే వార్తలు కూడా వస్తున్నాయి.

మహారాష్ట్రలో ఈ సారి 65 శాతం పోలింగ్ జరగ్గా జార్ఖండ్‌లోని 38 స్థానాలకు జరిగిన మలివిడ త పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 68 శాతం పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో నక్సల్స్ ప్రభావిత జిల్లా గడ్చిరోలిలో గరిష్ఠంగా 74 శాతానికి పైగా పోలింగ్ జరగడం, ఒక్క హింసాత్మక ఘటనా జరక్కపోవడం విశేషం. అయితే దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మాత్రం ఈ సారీ ఓటర్లు ముఖం చాటేశారు.

288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో పట్టు నిలుపుకోవడానికి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కూటములు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. మహాయుతి తరఫున ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఇతర బీజేపీ నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు.

దానికి దీటుగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే సైతం నిర్విరామ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో మరాఠా వాసులు ఏం తీర్పు ఇవ్వనున్నారనేది ఆసక్తిగా మారింది. అధికార కూటమిలో బీజేపీ ఈ సారి అతి పెద్ద పార్టీగా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది.

కూటమిలోని మిగ తా రెండు పార్టీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ ఎన్‌సీపీలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. అసలు శివసేన, ఎన్సీపీలనుంచి చీలి బీజేపీతో చేతులు కలిపి అధికారాన్ని అనుభవి స్తున్న ఈ రెండూ తామే అసలైన పార్టీలని చెప్పుకొంటున్నాయి. ఓటర్ల తీర్పుపైనే ఈ రెండు పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంది.

మరోవైపు ప్రతిపక్ష ఎంవీఏ కూటమిలోనూ ఇదే పరిస్థితి. స్థానిక సమస్యలకన్నా రాజకీయ అంశాలు ప్రాధాన్యత వహించిన ఈ ఎన్నికల ఫలితాలు నాలుగు పార్టీల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా వస్తే ముఖ్యమంత్రి పదవికోసం ఆ పార్టీ పట్టుబడుతుందని, ప్రస్తుతం ఉపముఖ్యమం త్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం అవుతారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

అంతేకాదు శివసేన షిండే వర్గం, అజిత్‌పవార్ ఎన్సీ పీ బలం గణనీయంగా తగ్గవచ్చని, ఆ మేరకు ఉద్ధవ్ థాక్రే, శరద్‌పవార్ నేతృత్వంలోని ప్రత్యర్థివర్గాలు పుంజుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలు వెల్లడయ్యాక మహారాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రావచ్చు.

ఇక జార్ఖండ్‌లో ఎన్నికలు జేఎంఎం అధినేత, ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అవినీతి, గిరిజన నాయకుడిగా ఆయనకున్న చరిష్మా మధ్య జరుగుతున్న పోరుగా మారింది. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరేన్ అరెస్టయి జైలుకెళ్లడం,   జైలునుంచి బైటికి వచ్చాక అప్పటిదాకా సీఎంగద్దెపై తాను కూర్చోబెట్టిన చంపై సోరేన్‌ను తప్పించి మళ్లీ పగ్గాలు చేపట్టడం తో రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.

రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో సోరేన్ అవినీతి, కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా గిరిజన ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రచారమే ప్రధాన అస్త్రాలయ్యాయి. బుధ వారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో సగం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు పట్టం గట్టగా, మిగతా సర్వేలు భిన్నమైన అంచనాలు వెల్లడించాయి.

దీన్నిబట్టి అక్కడ పోటీ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. రెండు రాష్ట్రాల్లో గెలుపుపై అధికార, ప్రతిపక్ష కూటములు ఇప్పటికీ ధీమాగా ఉన్న నేపథ్యంలో ఓటర్ల తీర్పు ఎలా ఉండనుందో చూడాలి.