calender_icon.png 24 December, 2024 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూ కశ్మీర్ ఓటర్ల తీర్పు ఎటు!

20-09-2024 12:00:00 AM

డా. కోలాహలం రామ్ కిశోర్ :

జమ్మూ,కశ్మీర్‌లో దశాబ్దం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా యి. మొత్తం 90 స్థానాల్లో  బుధవారం మొదటి విడతలో ప్రజలు 24 మంది ప్రతినిధులను ఎన్నుకో డానికి ఓటేశారు. తొలి విడత పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో కశ్మీర్‌లో 16, జమ్మూలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. తొలి విడతలో దాదాపు 60 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కిష్టారాలో అత్యధికంగా 77 శాతం, ఫుల్వామాలో అత్య ల్పంగా 46 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు వెల్ల డించారు. గతంతో పోలిసే ఈ సారి ప్రజ లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం. కాగా తొలి విడతలో ఎక్కడా అ వాంఛనీయ సంఘటనలు జరక్క పోవడం గమనార్హం.

సాధారణంగా గతంలో కశ్మీర్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా హిం సాత్మక ఘటనలు చోటు చేసుకునేవి. అం దుకు భిన్నంగా ప్రశాంతంగా పోలింగ్ జరగడం గమనార్హం. ఇందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఎన్నికల కమిషన్‌తో పాటుగా రాష్ట్ర ప్రజలను కూడా అభి నందించాలి. కాగా మిగతా రెండు విడతల పోలింగ్ కూడా ఇదే విధంగా ప్రశాంతంగా జరుగుతుందని ఆశిద్దాం. పీర్ పంజాల్ పర్వత సానువులకు అటూ ఇటూగా జమ్మూలో 3, కశ్మీర్‌లో 4 జిల్లాల్లో విస్తరించి ఉన్న స్థానాల్లో ఉగ్రవాదుల దాడుల ప్రమాదం పొంచి ఉన్నందున, ప్రభుత్వం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు  చేసిం ది.

అయిదేళ్ల క్రితం ఈ ప్రాంతం జన్మతః సిద్ధించిన తన ప్రత్యేక ప్రతిపత్తిని,రాష్ట్ర హో దాను బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో కోల్పోయింది. దేశంలో అతి చిన్నవయ స్సు గల కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిం ది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు పుణ్యాన విధించిన గడువులోగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో జరుగుతాయా లేదా అని యావత్ ప్రపం చం, మీడియా సంస్థలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

 మారిన భౌగోళిక స్వరూపం

గతంలో అక్కడ రెండు పార్టీలు మాత్ర మే ఉండేవి ఒకటి అధికార పక్షం. రెండవ ది ప్రతిపక్షం. ఇప్పుడు అక్కడ పరిస్థితులలో ఎన్నో మార్పులు వచ్చాయి. స్థానికం గా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అక్కడ బీజేపీ నియోజకవర్గాలలో మార్పు, చేర్పులు తన స్వార్థ ప్రయోజనాలకు, ఎన్నికల్లో తమ పార్టీ గెలవటానికి అనుగుణం గా చేసుకుందని స్థానిక పార్టీల నేతలు అనేక విమర్శలు గుప్పించిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి తోడు సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతీయ పార్టీలకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేకుండా, బీజేపీ సైనిక నిర్బంధాలు విధించింది. ఈ పరిస్థితులు కూడా ఎన్నికలలో ఓటర్ల మనోభావాలను  ప్రభావితం చేసి ఫలితాలను తారుమారు చేయవచ్చు. అబ్దుల్లా లు, ముఫ్తీలు తమ ఉనికి చాటుకోవటానికి ఎన్నడూ లేనంతగా కష్టపడవలసి రావచ్చునని విశేషకులు భావిస్తున్నారు.

ఇక బీజేపీ వల్ల కోల్పోయిన జమ్మూకశ్మీర్  ప్రత్యేక ప్రతిపత్తిని తిరిగి తీసుకురా వటం కాంగ్రెస్‌కు సాధ్యం అవుతుందా? అనేది ఇప్పుడే చెప్పలేం. కేంద్రంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గెలిస్తే గానీ, ఈ విషయంలో  ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేం. ఈ విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్,పీడీపీ లు ఒకే అభిప్రాయంతో ఉన్నా అవి ఎన్నికల్లో మాత్రం ఐక్యంగా ఉండక వేరు,వేరు మార్గాల్లోనే ప్రయాణం చేస్తున్నాయి. వీరి మధ్య అనైక్యత బీజేపీకి లాభం చేకూర్చే వకాశం ఉంది. అబ్దుల్లాల పార్టీ  నేషనల్ కాన్ఫరెన్స్‌మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి  దిగింది. ప్రస్తుతం లభిస్తున్న సమాచారం మేరకు ఈ కూటమికి కాస్తంత లబి ్ధచేకూరవచ్చునని ఎన్నికల విశ్లేషకులు అంచనా లు వేస్తున్నారు.

ఈ పార్టీలకంటే బీజేపీకి ఏమేరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందా అని కూడా ఆ పార్టీఅనుకూల వర్గాల  విశ్లేషకులు కూ డా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల అనంతరం రాష్ట్ర హోదా ఇస్తామని బీజేపీ గట్టిగా హామీ ఇస్తున్నది.అంతేకాక జమ్మూ కాశ్మీర్‌కు మళ్లీ ప్రత్యేక ప్రతిపత్తి ఇ స్తామని ఎవరు వాగ్దానాలు చేసినా ప్రజ లు నమ్మవద్దని, అది ఎవరితరం కూడా కా దని  బీజేపీ అంటున్నది. అయితే తమకు ఓటర్లు పట్టం కడితే ప్రత్యేక ప్రతిపత్తిని తిరిగి తెస్తానని నేషనల్ కాన్ఫరెన్స్ చెప్తున్నది. కాంగ్రెస్ మాత్రం నేరుగా ఈ మాట చెప్పటం లేదు. అయితే రాష్ట్ర హోదా విషయంలో మాత్రం గట్టిగా హామీ ఇస్తున్నది. స్థానిక అవసరాలు ఏమిటో తెలుసుకొని కొన్ని స్థానాల్లో మాత్రం ఈ రెండు పార్టీలు ఫ్రెండ్లీ పోటీకి దిగుతున్నాయి.  

అనూహ్య పరిణామాలు

2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.అయితే ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ప్రజలు ఊహించని అనేక పరిణామాలు జరిగాయి. పీడీపీతో పొత్తును బీజేపీ తెగదెంపులు చేసుకొని రాష్ట్రప్రతి పాలన విధించింది. కనీసం రాష్ట్ర గవర్నర్‌కు సైతం చివరి నిముషం వరకు ఏమీ చెప్పకుండానే వేలాదిమంది సైనిక దళాలను జమ్మూకాశ్మీర్ లో మోహరించింది.నిర్దాక్షిణ్యంగా రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది. స్థానిక నేతలందరినీ సుదీర్ఘ కాలం నిర్బంధించింది. ప్రజల మీదా,మీడియా మీదా నెలల తరబడి ఆనేక ఆంక్షలు విధించింది. ఇంటర్నెట్ ను నెలల తరబడి కట్ చేసింది. ప్రజల కదలికలు నిలిపివేశారు. రవాణ స్తంభించింది.

బీజేపీ చెబుతున్న మార్పు నిజమేనా?

ఈ ఆంక్షలు,అణచివేతలు,నిర్బంధాలు కొనసాగుతుండగానే అక్కడ ఏకపక్షంగా అనేక కొత్త దౌర్జన్య నిర్ణయాలు జరిగాయి. కఠిన చట్టాలు వచ్చాయి.అభివృద్ధి పేరిట పెట్టుబడులకు వెలుపలి వ్యక్తులకు ద్వారాలు బార్లా తీశారు.ఆర్టికల్స్ 370, 35లు రద్దయ్యాయి. ఈ నిర్బంధ సమయంలోనే జమ్మూ కశ్మీర్ అన్ని విషయాలలో బాగుపడిందని కేంద్రం చెప్పుకుంటున్నది. అనేక పథకాల ద్వారా వేల కోట్లు కుమ్మరించి కొన్ని రంగాల్లో విస్తృతమైన మార్పు తెచ్చింది. ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పెరిగాయని ప్రభుత్వం అంటున్నది. కానీ స్థానిక  ప్రజలు ఏమనుకుంటున్నారో బయట ప్రపంచానికి తెలియదు.

మీడియాపై ఆంక్షల వల్ల ప్రభుత్వం చెప్పిన మాటలనే నమ్మాల్సి ఉంటుంది. ఇటీవల వరుస ఉగ్రదాడులు జరిగినప్పటికీ గతంతో పోలిస్తే తగ్గినట్లు చెబుతున్నారు. ఒకసారి జమ్మూ, కశ్మీర్‌లో సైనిక దళాల మోహరింపు తొలగిస్తే కానీ అక్కడ నెలకొన్న  వాస్తవ శాంతి భద్రతల పరిస్థితి అవగతం కాదు.తామ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ప్రజల మధ్య  రాకపోకలు పెరిగాయని బీజీపీ నాయకులు ఎన్నికల ప్రచార సభల్లో  చెబుతున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలు సైన్యం పహరాలో ప్రశాంతంగా జరిగాయి.

ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం ఏ మేరకు ఉంటుందో చూడాలి. గత పదేళ్ల బీజేపీ పాలనా పరిణామాలన్నీ అక్కడి ప్రజలు ప్రత్యక్షంగా అనుభవించారు. వారి మనోఫలకం నుండి చెడు జ్ఞాపకాలు చెరిపేసి, సెంటిమెంట్ వదిలేసి, కేవలం అభివృద్ధిని మాత్రమే చూస్తారా అన్నది వచ్చే నెల 8న ఫలితాలు వెల్లడిస్తాయి. గవర్నర్ పాలన పోయి, ప్రజా ప్రతినిధుల పాలన మరింత మంచి పాలనఅందిస్తుందని ఆశిద్దాం. 

వ్యాసకర్త సెల్: 9849328496.