06-03-2025 12:01:23 AM
గత హామీలన్ని బుట్టదాఖలు
నేడు బెల్లంపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ పై నిర్వాసితుల గుర్రు
శాంతిఖని గని 2 లాంగ్ వాల్ ప్రాజెక్ట్ విస్తరణపై టెన్షన్ టెన్షన్
బెల్లంపల్లి, మార్చి 5 (విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం నిర్వాసిత గ్రామాల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీనికి బెల్లంపల్లి లోని శాంతిఖని గని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామాలపై చూపిన సవతి తల్లి ప్రేమనే సజీవ సాక్ష్యంగా కనిపిస్తుంది. తాజాగా యాజమాన్యం ప్రతిపాదించిన శాంతిఖని గని -2 లాంగ్ వాల్ ప్రాజెక్టు విస్తరణకు సర్వం సిద్ధం చేస్తుండడం నిర్వాసితుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. 2004 సంవత్సరం ఏప్రిల్ నెలలో శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు ఏర్పాటు సమయంలో సింగరేణి ఉన్నతాధికారులు బెల్లంపల్లి మండలంలోని బట్వాన్ పల్లి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి గ్రామాల అభివృద్ధికి ఎన్నో హామీలను గుప్పించి అక్కడికక్కడే మరచిపోయారన్న అపవాదును మూటగట్టుకు న్నారు.
23 సంవత్సరాల ప్రాజెక్టు జీవిత కాలం ముగియడంతో పునర్దృవీకరణ, విస్తరణ కోసం శాంతి ఖని గని -2 లాంగ్ వాల్ ప్రాజెక్టు ఏర్పాటు కు ఈనెల 6న ఉదయం 11 గంటలకు శాంతిఖని గని వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. గతంలో లాంగ్ వాల్ ప్రాజెక్టు నిర్వహణ అధికారులు నిర్వాసిత గ్రామాల్లో సింగరేణి యాజమాన్యం ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కడం, సాగునీటి సమస్య జటిలంగా మారడంతో లాంగ్ వాల్-2 ప్రాజెక్టు పట్ల ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమౌతుంది. దీంతో నిర్వాసిత గ్రామాల్లో అనిశ్చిత వాతావరణం నెలకొంది.
శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు ఏర్పాటు ఇలా...
బెల్లంపల్లి ప్రాంతంలో ప్రథమంగా 1954 వ సంవత్సరంలో శాంతిఖని భూగర్భ గని ఏర్పాటైంది. ఈ ప్రాంతానికి పక్కనే ఉన్న బెల్లంపల్లి మండలంలో లింగాపూర్, ఆకెనపల్లి శివారు ప్రాంతంలో 618 హెక్టార్ల విస్తీర్ణంలో రూ 307.84 కోట్ల అంచనా వ్యయంతో సింగరేణి యాజమాన్యం శాంతిఖని గని లాంగ్ వాల్ ప్రాజెక్టు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 821 మంది సిబ్బందితో ప్రారంభించబడి 23 సంవత్సరాల జీవిత కాలంలో 308 మీటర్ల నుండి 596 మీటర్ల లోతులో లాంగ్ వాల్ పద్ధతిలో (షాప్ట్ భూగర్భ గని) బొగ్గు నిక్షేపాల తవ్వకాలను చేపట్టింది. రోడ్ హెడర్, కంటిన్యూయస్ మైనర్ టెక్నాలజీ ద్వారా బోర్డ్, పిల్లర్ పద్ధతిలో సాలీనా 11.67 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పొందింది.
శాంతిఖని గని 2 విస్తరణకు యాజమాన్యం సిద్ధం
బెల్లంపల్లి శాంతిఖని గని 23 ఏళ్ల జీవితకాలం పూర్తిగా ముగియడంతో గనిని మరింతగా విస్తరించి లాంగ్ వాల్ -2 ప్రాజెక్టు ను ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం పూర్తిగా సంసిద్ధమైంది. 681.23 హెక్టార్ల విస్తీర్ణంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం 484.94 హెక్టార్ల అటవీ భూమి,196.29 హెక్టార్ల ప్రభుత్వ భూమిని వినియోగించనుంది. 8 సంవత్సరాల కాల పరిమితి గల ఈ ప్రాజెక్ట్ బోర్డ్, పిల్లర్ మైనింగ్ పద్ధతిలో లాంగ్ వాల్ రోడ్ హెడర్ , కంటిన్యూయస్ టెక్నాలజీతో కొనసాగనుంది.
ఇప్పటికే ప్రభావిత గ్రామాలైన బట్వాన్ పల్లి, పెరిక పల్లి, లింగాపూర్, ఆకెనపల్లి, పాత బెల్లంపల్లి, బుచ్చయ్యపల్లి గ్రామ పంచాయితీలకు ఈనెల 6న శాంతిఖని గని వద్ద నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన నివేదికను సింగరేణి యాజమాన్యం అందజేసింది. డప్పు చాటింపులతో ప్రజలకు పంచాయతీ అధికారులు సమాచారం అందజేశారు.
దుష్ప్రచారంతో నిర్వాసితుల్లో టెన్షన్
సింగరేణి లో ఒక ఉన్నత స్థాయి అధికారి నోటి వెంట దొర్లిన ఓపెన్ కాస్ట్ బూచీ తో నిర్వాసితుల్లో టెన్షన్ నెలకొంది. శాంతిఖని గని-2 లాంగ్ వాల్ ప్రాజెక్టు విస్తరణ పేరుతో నమ్మించి తమ ప్రాంతాలను ఎడారిగా మారుస్తారేమోనన్న భయం లో రైతాంగం ఉంది. కేవలం వ్యవసాయ ఆధారిత పద్ధతులపైనే ఆధారపడ్డ రైతు కుటుంబాలు కంటి నిండా కునుకు కూడా తీయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నిర్వాసిత గ్రామాల్లో బోరు బావుల్లో వ్యవసాయానికి సరిపడా నిరందని పరిస్థితి ఉంది.
కుంటలు, చెరువుల్లో చుక్కనీరు లేక భూగర్భ జలాలు ఇంకిపోతున్న పరిస్థితులను ఇక్కడి రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సింగరేణి ఉన్నతాధికారి నోటి వెంట దొర్లిన పదం బెల్లంపల్లి రీజియన్ లో కార్మిక వర్గాలతో పాటు, ప్రభావిత ప్రాంతాల ప్రజలను నివ్వెరపాటుకు గురిచేసింది. శాంతిఖని గని-2 పూర్తిగా భూగర్భగని మాత్రమే అని అదే అధికారి స్పష్టత ఇచ్చినప్పటికీ నిర్వాసిత గ్రామాల ప్రజలు టెన్షన్ నుండి తేరుకోవడం లేదు.
నిర్వాసిత గ్రామాలపై అంతులేని నిర్లక్ష్యం
సింగరేణి యాజమాన్యం నిర్వాసిత గ్రామాలపై అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. శాంతిఖని గని లాంగ్ వాల్ ప్రాజెక్టు విస్తరణకు ముందు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఎన్నో హామీలను ఇచ్చి మరిచిపోయింది. గ్రామాల్లో లైబ్రరీలు, డిస్పెన్సరీలు, పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు , క్రీడా మైదానాలు నిర్మిస్తామని ఇచ్చిన హామీలు బుట్ట దాఖలయ్యాయి. ఇంటర్నల్ రోడ్లు, త్రాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరుస్తామన్న హామీని పట్టించుకోలేదు.
రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తకుండా బట్వాన్ పల్లి పెద్ద చెరువు కు, లింగాపూర్ శంకర్ చెరువుకు ప్రాజెక్ట్ నీళ్లను మళ్లించి చెరువులను నీళ్లతో నింపుతామని ఇచ్చిన హామీని యాజమాన్యం పెడచెవిన పెట్టింది. ఆకెనపల్లిలో ప్రజలకు గోదావరి నీళ్లను అందిస్తామని మోసం చేసింది. ఇప్పటికైనా శాంతిఖని గని -2 లాంగ్ వాల్ ప్రాజెక్ట్ విస్తరణ విషయంలో సింగరేణి యాజమాన్యం నిర్వాసిత గ్రామాల్లో త్రాగునీటి, సాగునీటి వసతుల కల్పనలు స్పష్టమైన హామీలను నిలబెట్టుకోగలిగితే నిర్వాసితుల నుండి సానుకూలత చేకూరనుంది.