జిడ్డు కృష్ణమూర్తి :
నిజమైన మతమంటే ఏమిటో మీకు తెలుసా? అది స్తోత్రాలు చేయడంలో లేదు. పూజా విధానంలో లేదు. మరే ఇతర కర్మకాండలోను లేదు. డబ్బారేకు దేవుళ్ళనో, రాతి విగ్రహాలనో ఆరాధించడంలో లేదు. గుడులలో లేదు, చర్చిలలో లేదు. బైబిలునో, భగవద్గీతనో చదవడంలో లేదు. ఏదో పవిత్రనామం అనబడే దానిని పదేపదే పలకడంలో లేదు. మానవుడు కల్పించుకొన్న మరే మూఢ విశ్వాసాన్నైనా సరే పాటించడంలో లేదు. ఇదేదీ నిజమైన మతం కాదు.
నిజమైన మతమంటే నదివలె సజీవమై నిరంతరం ప్రవహించెడి ప్రేమభావం లేదా కరుణ. ఈ స్థితిలో అన్ని ప్రయత్నాలూ ఆగిపోయే క్షణం, అన్ని విధాలైన అన్వేషణలు నిలిచిపోయే క్షణం ఒకటి వస్తుంది. ఇలా అన్వేషణ అంతమవడమే అనూహ్యమైన మ రొక దానికి ఆరంభం. నిజమైన మతమంటే దేవుని కోసం, సత్యం కోసం అన్వేషణ, వెలితి లేని కారుణ్య భావం.- కారుణ్య భావా న్ని, వినమ్రతా భావాన్ని ప్రయత్నంతో సా ధించడమూ కాదు. మన స్సు కల్పించుకొనే వాటికి, దాని చమత్కారాలకు అతీతంగా ఉన్నదేదో దాని కో సం అన్వేషణ సాగించడం, దానిలోనే రమించడం, దానిలోనే జీవించడం, తద్రూపమై పోవడం. ఇదీ నిజమైన మతమంటే.
అది మీరు చేయవలెనంటే మీరు మీకోసం తవ్వుకొన్న నీటి పడియను వదలిపెట్టి జీవిత ప్రవాహంలోకి ప్రవేశించ వలసి వుంటుంది. అప్పుడు అద్భుతంగా మీ రక్షణ బాధ్యతను జీవితమే తీసుకొంటుంది. ఎందువల్లనంటే, అప్పుడు మీ రక్షణ బాధ్యతను మీరు తీసుకోవడమంటూ వుండదు గదా! అప్పుడు జీవితం మిమ్మల్ని తన ఇష్టం వచ్చిన చోటికి తీసికొని పోతుంది. అసలప్పుడు మీరు జీవితం కంటే భిన్నం కాదు. మీరు కూడా ఆ జీవిత ప్రవాహంలో ఒక భాగమే. అందువల్ల, అప్పుడిక మీకు భద్రత ఎలాగో, ప్రజలు ఏమంటారో, ఏమనరో ఇటువంటి సమస్యలేవీ వుండవు. అదే జీవితంలోని సౌందర్యం.
(‘ఈ విషయమై
ఆలోచించండి’ నుంచి..)