దేశ ప్రజలు ఈ పార్టీల మేనిఫెస్టోలను నమ్మి ఎవరికి ఓటేస్తారు? తమ వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోవడం పార్టీలకు పరిపాటేనన్న భావనతో తాము ముందుగా ఎంచుకున్న పార్టీకి ఓటేస్తారా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికారం కోసం పోటీ పడుతున్న రెండు ప్రధాన పార్టీలు (భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ) ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి వస్తే ప్రజలకోసం ఏం చేయాలనుకుంటున్నాయో, దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలపై తమ విధానాలు ఏమిటో తెలియజేస్తూ మేనిఫెస్టోలను కొద్ది రోజుల క్రితం విడుదల చేశాయి.
కాంగ్రెస్ తన మేనిఫెస్టోను ‘న్యా య్ పత్’్ర పేరుతో విడుదల చేయగా, బీజేపీ ‘సంకల్ప్ పత్’్ర పేరున విడుదల చేసింది. రెండు పార్టీలు కూడా త మ కీలక హామీలు, ప్రాధాన్యాలను ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నాయి కూడా. ‘మోడీ కీ గ్యారంటీ’ పేరిట విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో సమాజంలోని నాలుగు ప్ర ధాన మూల స్తంభాలయిన మహిళలు, యువత, అట్టడుగు వర్గాలు, రైతుల అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధిని సా ధించను న్నట్లు స్పష్టంచేసింది.
మరోవైపు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ స్ఫూర్తితో రూపొందించిన తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ యువత, మహిళలు, రైతులు, కార్మికులు, సమానత్వం అనే అయిదు ప్రధాన స్తంభాలకు న్యాయం చేయడంపై ముఖ్యంగా దృష్టిపెట్టింది. పేరు ఏదైనప్పటికీ రెండు పార్టీలు కూడా దాదాపుగా ఒకే తరహా ప్రాధాన్యతా రంగాలను ఎంచుకోవడం గమనార్హం. వీరి కోసం ఆయా పార్టీలు ఎలాంటి పరిష్కారాలు, పథకాలు చేపట్టనున్నాయో ఓసారి చూద్దాం.
యువతకు ఉపాధి అవకాశాలు
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్న యువ ఓటర్లకు సంబంధించిన ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడం కోసం రెండు పార్టీలూ తమ మేనిఫెస్టోలలో ప్రత్యేక విభాగాలను కేటాయించాయి. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్న ఓటర్లు కోటీ 85 లక్షల మంది ఉన్నారు. వీరంతా ఉద్యోగాలు, ఉపాధి కోసం ‘ఏ పార్టీ ప్రభుత్వం తమ ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చడానికి ముందుకు వస్తుందా?’ అని ఎదురు చూస్తున్న వారే. ఇప్పటిదాకా ఏ ప్రభుతాలూ తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి కూడా దేశ యువతలో గూడు కట్టుకొని ఉంది. అందుకే, వీరి సమస్యలపట్ల అవగాహనతో వాటి పరిష్కారం కోసం తామేం చేయనున్నాయో పై రెండు పార్టీలు వివరించాయి.
ప్రశ్న పత్రాల లీక్‌లకు వ్యతిరేకంగా చట్టాలను కఠినంగా అమలు చేస్తామని, ప్రభుత్వోద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి కృషి చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. స్టార్టప్‌లు, పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి కృషి చేస్తామని, ఉపాధి అవకాశాలను పెంచడానికి భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా చేయడంపై దృష్టిపెడతామని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం కోసం ముద్రా రుణాలు వంటి రుణ కార్యక్రమాలను విస్తరించడంతోసహా వాటిని రెట్టింపు చేస్తామని ఆ పార్టీ పేర్కొంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడం కోసం ‘యువ న్యాయ్’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు హామీ ఇచ్చింది. 25 ఏళ్ల వయసుగల డిప్లొమో హోల్డర్లు, కాలేజీ పట్టభద్రులకు పరిశ్రమలలో ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్‌ను కల్పించడం, అందుకుగాను కొత్త అప్రెంటిస్‌షిప్ హక్కు చట్టాన్ని తీసుకువస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోని దాదాపు 30 లక్షల ఖాళీలను భర్తీ చేయడానికి కట్టుబడి ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. మరోవైపు కోవిడ్-- 19 కారణంగా రాయలేక పోయిన అర్హతా పరీక్షలను రాయడానికి దరఖాస్తుదారులకు ఒకసారి అవకాశం (వన్‌టైమ్ రిలీఫ్) ఇస్తామనీ హామీ ఇచ్చింది.
వయోవృద్ధుల శ్రేయస్సు కోసం..
సీనియర్ సిటిజన్స్ (వయో వృద్ధుల)కు సంబంధించిన అవసరాలు, సమస్యలు ముఖ్యంగా ఆరోగ్యపరమైన వాటి పరిష్కారానికి రెండు పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలలో పలు పథకాలను చేర్చాయి. 70 ఏళ్ల పైబడిన వృయోవృద్ధులకు కూడా ఆయుష్మాన్ భారత్‌ను వర్తింప చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వాలతో కలిసి సీనియర్ సిటిజన్స్ పవిత్ర యాత్రలు నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేస్తామనీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ అయితే, ‘వికలాంగుల హక్కుల చట్టం 2016’ను కఠినంగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ‘జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం’ కింద సీనియర్ సిటిజన్స్, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ల కంట్రిబ్యూషన్లను రూ.1000కి పెంచుతామని కూడా హామీ ఇచ్చింది. రైళ్లు, ప్రభుత్వ రవాణా సర్వీసుల్లో ఈ వర్గాలకు గతంలో ఉన్న ప్రయాణ రాయితీలను పునరుద్ధరిస్తామని కూడా ఆ పార్టీ హామీ ఇచ్చింది. కానీ, భాజపా ఈ ప్రస్తావన చేయకపోవడం గమనార్హం.
రైతులపట్ల ప్రత్యేక దృష్టి
రైతులను కీలకమైన ఓటు బ్యాంకుగా గుర్తించిన రెండు ప్రధాన పార్టీలు వారికోసం పలు హామీలు గుప్పించాయి. సాంకేతిక జోక్యాలద్వారా ‘ఫసల్ బీమా యోజన’ (పంటల బీమా పథకం)ను మరింత బలోపేతం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. రాబోయే రోజుల్లోనూ కనీస మద్దతు ధరల పెంపును కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అయితే ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ఆధారంగా ఏటా కనీస మద్దతు ధరలకు చట్టపరమైన గ్యారంటీ కల్పిస్తామని భరోసా ఇచ్చింది. వ్యవసాయ రుణాలు, అవసరాలు, పంపిణీలను అంచన వేయడానికి ‘శాశ్వత వ్యవసాయ ఆర్థిక కమిషన్’ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది.
మహిళలపై వరాల వర్షం
సుమారు మూడు కోట్ల గ్రామీణ మహిళలను ‘లఖ్‌పత్ దీదీ’లుగా చేయడానికి వారికి సాధికారికత కల్పిస్తామని కమలం పార్టీ హామీ ఇచ్చింది. మహిళల ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా రక్తహీనత, గర్భిణీల అవసరాలు, గర్భాశయ క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలల్లో మహిళా ప్రాతినిధ్యానికి మహిళా రిజర్వేషన్ బిల్లును తు.చ. తప్పకుండా అమలు చేస్తామనీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అయితే మహిళలకు కర్నాటక, తెలంగాణలలో హామీ ఇచ్చినట్లుగా మహాలక్ష్మి పథకాన్ని తెస్తామని, ఎలాంటి షరతులు లేని నగదు బదిలీ కింద ప్రతి పేద మహిళలకు 2025 నుంచి ప్రభుత్వోద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా హస్తం పార్టీ హామీ ఇచ్చింది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని, ప్రతి జిల్లాలో కనీసం ఒక సావిత్రీబాయి ఫూలే హాస్టల్ ఉండేలా చూస్తామనీ ఆ పార్టీ పేర్కొంది.
వైద్య చికిత్సకు అధిక ప్రాధాన్యం
రెండు పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలో వైద్య చికిత్స అంశానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. నాణ్యమైన వైద్యానికి ఎయిమ్స్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తామని బీజేపీ పేర్కొంది. అందుబాటు ధరల్లో మందులు లభించేలా జన ఔషధి కేంద్రాల నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తామని, ట్రాన్స్‌జెండర్లకు కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. అందరికీ వైద్యం లభించేలా రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రూ.25 లక్షల నగదు రహిత బీమా సదుపాయాన్ని దేశమంతటా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రజా ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు, చికిత్స, మందులు, చికిత్సానంతర పునరావాసం సహా అన్ని రకాల వైద్యసేవలు అందరికీ ఉచితంగా లభించేలా చూస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. 2028 నాటికి మొత్తం బడ్జెట్ వ్యయంలో వైద్యరంగానికి 4 శాతం నిధుల లక్ష్యాన్ని సాధించడానికి ఏటా కేటాయింపులను పెంచుతామని చెప్పింది.
అయితే, ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలలో ఓ తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తాము మూడోసారి అధికారంలోకి వస్తామన్న బీజేపీ ధీమా దాని మేనిఫెస్టోలో కనిపిస్తున్నది. అందుకే, అది తాయిలాల జోలికి పెద్దగా వెళ్లలేదు. ఇప్పటికే తాము అమలు చేస్తున్న పథకాలను మరింతగా విస్తరిస్తామనో, బలోపేతం చేస్తామనో మాత్రమే హామీ ఇచ్చింది. కానీ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మాత్రం ఆయా వర్గాలకు న్యాయం చేస్తామన్న పేరుతో పలు హామీలు కనిపిస్తాయి. రెండు పార్టీలూ పన్నులు చెల్లించడం ద్వారా దేశాభివృద్ధికి దోహదపడుతున్న మధ్యతరగతి ఆదాయ వర్గాల గురించి పట్టించుకోకపోవడం గమనార్హం.