- అభాసుపాలవుతున్న విద్యాహక్కు చట్టం
- అమలుకు నోచుకోని ప్రైవేటు పాఠశాలల రిజర్వేషన్లు
- విద్యాహక్కు చట్టం అమలుపై పెద్దగా దృష్టి పెట్టని అధికారులు
వికారాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): చట్టాల అమలులో పాలకుల చిత్తశుద్ధి లోపంతో పేదలకు కనీస హక్కులు అందకుండా పోతున్నాయి. సామాన్యుడి కష్టాలు కష్టాలుగానే మిగిలిపోతున్నాయి. వేలకు వేలు ఫీజు చెల్లించి ప్రైవేటు పాఠశాలల్లో చదువు‘కొన’లేని పిల్లల కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వం 2005లో విద్యాహక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలి. చట్టం అమల్లోకి వచ్చి సుమారు 19 ఏళ్లు గడుస్తున్నా మచ్చుకు కూడా అమలు కావ డం లేదు. సుప్రీంకోర్టు సైతం అదే తీర్పు ఇచ్చింది. అయినా చట్టం అమలుకు నోచుకోవడం లేదు. పేద విద్యార్థికి ప్రైవేటు విద్య అందరి ద్రాక్షగానే మిగిలి పోతోంది.
ఏటా ఎదురుచూపులే
విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా విద్యాహక్కు చట్టం అమలు విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదనేది తల్లిదండ్రుల భావన. కేజీ టూ ఫీజీ వరకు ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే బాల, బాలికలకు వేరు వేరుగా గురుకులాలు, మోడల్ స్కూ ల్స్ ప్రారంభిస్తున్నారే తప్పితే ప్రైవేటులో కేటాయించాల్సిన సీట్ల గురించి ఆలోచించ డం లేదు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని స్వచ్చంద సంస్థలు, విద్యావేతలు కోరుతున్నారు. విద్యా సంవత్స రం ప్రారంభమైనా 25 శాతం రిజర్వేషన్‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
అమలుకు నోచుకోని సుప్రీం తీర్పు
విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలని సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చింది. ఏటా ఆ తీర్పు అమలవుతుందని పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. తీర్పు అమలుకు నోచుకోక పోవడంతో పేద విద్యార్థులు ప్రైవేటు చదువులకు దూరమవుతున్నారు. ఇప్పటికైనా ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫీజులు ప్రభుత్వం భరిస్తుందా?
ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు కేటాయించేందుకు యాజమాన్యాలు సుముఖం గా లేవు. ఒకవేల సీట్లు కేటాయించినా ప్రభు త్వం ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న వేలకు వేలు ఫీజులు భరిస్తుందా అనే అనుమానం తల్లిదండ్రుల్లోను, పాఠశాల యాజమాన్యంలో ఉంది. బచ్‌పన్, అలోకా, సెయింట్ ఆంథోనీ, సంకల్ప్ విద్యాపీఠ్ వంటి కొన్ని పాఠశాలలు సీబీఎస్ పేరు చెప్పుకొని అడ్మిషన్లతో వేలకు వేలు దండుకుంటున్నాయి.
ప్రైవేటు స్కూళ్లలో రిజర్వేషన్‌ల శాతం ఇలా
అనాథలు, ఎయిడ్స్ బాధితుల పిల్లలు 05
ఎస్సీలు 10
ఎస్టీలు 04
బీసీలు 06
విద్యాహక్కు చట్టం అమలు చేయాలి
2005 విద్యా హక్కు చట్టాన్ని ప్రతి ప్రైవేటు పాఠశాల అమలు చేయాలి. ఈ చట్టం అమలు చేస్తే ఎంతో మంది పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది. కార్పొరేట్ పేర్లు చెప్పుకొని వేల కొద్ది ఫీజులు తీసుకుంటున్న పాఠశాలలు పేద పిల్లలకు ఉచితంగా అడ్మిషన్ ఇస్తే వచ్చే నష్టమేమీలేదు. ఈ విషయంలో విద్యాశాఖ అధికారుల కూడా కఠినంగా వ్యవహరించాలి. చట్టం పూర్తి స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి.
హరీశ్, ఏబీవీపీ,
జిల్లా కన్వీనర్, వికారాబాద్
అమలు చేయాలని చెబుతున్నాం
ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ప్రకా రం 1వ తరగతిలో సీట్లు కేటాయించాలని చెబుతున్నాం. అందుకు సంబం ధించిన మార్గదర్శకాలు కూడా ఏటా అన్నీ ప్రైవేటు పాఠశాలలకు అందిస్తు న్నాం. అయితే అత్యధిక పాఠశాలలు ఈ చట్టం ప్రకారం సీట్లు ఇవ్వడం లేద నే విమర్శలు ఉన్నాయి. ఈ విషయా న్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం.
రేణుకాదేవి,
జిల్లా విద్యాధికారి, వికారాబాద్