25-02-2025 12:00:00 AM
ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండానే ఫార్మ్ ల్యాండ్ పేరిట విక్రయం
నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న పంచాయతీ రాజ్ అధికారులు
షాబాద్ మండం తాళ్లపల్లి రెవెన్యూ పరిధిలో భూ మాయ
చేవెళ్ల, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరించడంతో ప్లాటు కొనాలంటే కోట్లలో వెచ్చించాల్సిన పరిస్థితి తెలిసిందే. అయితే దీన్ని ఆసరాగా చేసుకున్న కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు నగర శివారులో తక్కువ ధరకే ల్యాండ్స్ కొనుకోవచ్చని.. ఫామ్స్ ల్యాండ్ పేరిట వెంచర్లు చేస్తున్నాయి.
సాధారణంగా గ్రామాల్లోని రైతుల నుంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కొని జీపీ పర్మిషన్ల పేరిట ఈ దందా కొనసాగిస్తుంటారు. జీపీ పర్మిషన్లు లీగల్ గా కరెక్ట్ కాకపోయినా.... మేనేజ్ చేసో, మచ్చిక చేసుకొనో ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తుంటారు. కానీ, కొన్ని కంపెనీలు మాత్రం ఎలాంటి పర్మిషన్లు తీసుకోకపోవడమే కాదు...
ఇరిగేషన్, ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న భూములను కూడా తమ వెంచర్ లో కలిపేసి విక్రయాలు చేయడం వివాదాస్పదంగా మారుతోంది. అదికూడా గజాలు పేరిట మార్కెటింగ్ చేసుకొని గుంటల్లో రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్న వీరికి...
అధికారులు రూల్స్ పాటించడం లేదని నోటీసులు ఇస్తున్నా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఈ కోవకు చెందిందే షాబాద్ మండలం తాళ్లపల్లి రెవెన్యూ పరిధిలోని మైరాన్ చెరుబిక్ ఫామ్స్. అయితే ఇందులో ఏదో మతలబు ఉందని, అందుకే ఫామ్స్లో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు .
భూదాన్‌గా పలు సర్వే నంబర్లు
తాళ్లపల్లి రెవెన్యూ తిమ్మారెడ్డి గూడెం పరిధిలోని 450, 453, 464, 466, 467,468,469 సర్వే నెంబర్లలో దాదాపు 32 ఎకరాల్లో మైరాన్ చెరుబిక్ ఫామ్స్ పేరు మీద ఈ వెంచర్ చేశారు. మధ్యలో భారీ రోడ్లు పోసి... చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించి... రోడ్ల పక్కన మొక్కలు నాటి అమయకులైన కస్టమర్లకు విక్రమాలు చేశారు.
కాగా, ఇందులో కొన్ని సర్వే నెంబర్లు చెరువు పరిధిలో ఉండడం, మరికొన్ని భూదాన్ బోర్డు పరిధిలో ఉండడం వివాదానికి తావిచ్చింది. సర్వే నెం. 646లో 15.33 ఎకరాలు, సర్వే నెం. 469 లో 16.1 ఎకరాల భూమి రికార్డులో భూదాన్ గా ఉంది. దీన్ని రిజిస్ట్రేషన్, స్టాంప్స్ ప్రొహిబిటెడ్ లిస్టులోనూ క్లియర్గా చూపించారు. 453 సర్వే నెంబర్ కూడా రికార్డులో భూదాన్ గా చూపిస్తోంది.
అయితే ఇందులో కొందరు రైతులు 1977లోనే ఓఆర్ సీలు తీసుకున్నట్లు తెలిసింది. అయిన్నప్పటికీ చాలావరకు ప్రొహిబిటెడ్ జాబితాలోనే కనిపిస్తోంది. కానీ, ఎలా మేనేజ్ చేశారో ఏమో గాని, ఈ సర్వే నెంబర్లలోని భూమిని బై నెంబర్లతో రైతుల నుంచి కొనుగోలు చేసి... వెంచర్ ఏర్పాటు చేశారు.
ఇరిగేషన్ భూములూ వదల్లేదు
ఈ వెంచర్ లే అవుట్ మ్యాప్లో చూపిస్తున్న 464, 466 సర్వే నెంబర్లులో కొంత భూమి కోమటి కుంటకు చెరువుకు సంబంధించినది చూపిస్తోంది. 464లో 4 .21 ఎకరాల ఎఫ్టీఎల్తో పాటు 29 గుంటల బఫర్ జోన్ ఉంది. 466 సర్వే నెంబర్లో 2.6 ఎకరాల ఎఫ్టీఎల్, 19 గుంటల బఫర్ జోన్ ఉంది. అంతేకాదు సర్వే నెంబర్లు 450, 453లో లింగారెడ్డి చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ ఉంది.
ఇవన్నీ హెచ్‌ఎండీఏ అఫీషియల్ వెబ్ సైట్లో లేక్స్ బ్లాగ్లో మ్యాప్ లు, సర్వే నెంబర్లతో సహా పొందుపరిచారు. ఇవేవీ పట్టించుకోకుండా.. కేవలం రైతులకు ఉన్న పట్టాలను ఆసరా తీసుకొని యథేచ్చగా వెంచర్ ఏర్పాటు చేశారు. అంతేకాదు శిఖంలో ఉన్న కొందరి రైతుల భూములను అదిలి బదిలి చేసుకున్నట్లు తెలిసింది.
పంచాయతీ రాజ్ శాఖ నోటీసులు
నగర శివారులో రియల్ ఎస్టేట్ కంపెనీలు వెంచర్ చేయాలంటే హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు పొందాలి. కనీసం డీటీసీపీ లేఅవుట్ అయినా ఏర్పాటు చేయాలి. కానీ, ఎలాంటి అనుమతులు లేకుండా ఫామ్ ల్యాండ్ పేరిట వెంచర్ ఏర్పాటు చేశారు. దీనిపై కొందరు స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో పంచాయతీరాజ్ అధికారులు ఏడాది కిందే నోటీసులు ఇచ్చారు.
హెచ్‌ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ ఏర్పాటు చేయడమే కాదు నిర్మాణాలు కూడా చేపట్టారని అందులో పేర్కొన్నారు. మూడు రోజుల్లో అనుమతులు పొందాలని లేదంటే పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం నిర్మాణాలు కూల్చివేస్తామని కూడా హెచ్చరించారు. కానీ, ఏడాది దాటినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు.