calender_icon.png 26 March, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ జీడీపీకి, డీలిమిటేషన్‌కు ఏం సంబంధం?

24-03-2025 12:24:03 AM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్

కరీంనగర్, మార్చి 23 (విజయ క్రాంతి): దేశ జీడీపీకి, డీలిమిటేషన్ కు సంబంధం ఏమిటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్ లోని శుభం గార్డెన్లో తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డిలను ఘనంగా సన్మానించారు.

ముఖ్య అతిధిగా హాజరైన బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ లిక్కర్ దొంగలంతా ఒకే చోట సమావేశమై డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. స్టాలిన్ ప్రభుత్వం వెయ్యి కోట్ల లిక్కర్ స్కాం చేసిందని, కేరళలోనూ లిక్కర్ స్కాం బయటపడిందని, ఆప్, బీఆర్‌ఎస్ నేతలు లిక్కర్ స్కాం చేసి జైలుకు పోయారని అన్నారు.

వీళ్లంతా కలిసి డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతూ మోదీ ప్రభుత్వంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. చెన్నైలో స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లిక్కర్ దొంగల ముఠా ఒకేచోట సమావేశమై విచిత్రమైన తీర్మానం చేశారని అన్నారు. దేశ జీడీపీలో దక్షిణాది వాటా 36 శాతం ఉన్నందున పార్లమెంట్లో కూడా దక్షిణాదికి 36 శాతం వాటా ఇవ్వాలని అడుగుతున్నారని, ఇదేం విచిత్రమని ప్రశ్నించారు.

తెలంగాణ జీడీపీలో వెనుకబడ్డ అసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు వంటి జిల్లాల ప్రాతినిధ్యం చాలా తక్కువ అని, అంత మాత్రాన అసెంబ్లీలో వాటికి ప్రాతినిధ్యం ఉందకూడదా, ఇదెక్కడి దిక్కుమాలిన ప్రతిపాదన, దక్షిణాది పేరుతో రాజకీయాలు చేస్తూ డీలిమిటేషన్ను అడ్డుకునే కుట్రలు చేయడమేంటని ప్రశ్నించారు.

మోదీ ప్రభుత్వంపై విషం కక్కడం తప్ప ప్రజలకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నాడని, కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ కుమార్ తెలిపారు.