18-04-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్,ఏప్రిల్ 17(విజ యక్రాంతి): జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న శ్రీ కేశవనాథ ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఆసిఫాబాద్ మండలం జనకాపూర్ శివారు సర్వేనెంబర్ 80/a,80/b, 81,82, 83, 84, 85, 94 లలో 89.13 ఎకరాల భూమి దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. గోవింద్ పూర్ గ్రామానికి ఆనుకొని ఉన్న 83 సర్వే నెంబర్ లోనీ భూమి ఆక్రమణకు గురవుతుంది.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భూములను ప్రతి సంవత్సరం కౌవులు నిమిత్తం వేలం నిర్వహించి తద్వారా వచ్చిన సొమ్మును దేవాదాయ శాఖ , ఆలయ కమిటీ ఖాతాలో జమ చేస్తారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్న వేలం ద్వారా ఆలయానికి సుమారుగా 20 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తున్నప్పటికీ ఆలయ భూముల రక్షణకు తీసుకో వాల్సిన చర్యలు మాత్రం సంబంధిత అధికారులు తీసుకోవడం లేదన్న విమర్శలు లేకపోలేదు.
తాత్కాలిక నిర్మాణానికి అనుమతులు... ఆపై పక్కా భవనాలు
శ్రీ కేశవనాథ ఆలయానికి సంబంధించిన 83 సర్వే నెంబర్‌లో 8.22 ఎకరాలు ఉండగా గోవింద్‌పూర్ గ్రామంలోని కొంతమంది 1.18 ఎకరం భూమిలో షెడ్లను ఏర్పాటు చేసుకోగా దేవాదాయ అధికారులు గతంలో భూమి సర్వే చేయించగా భూమి ఆక్రమించిన వారికి నోటీసులు సైతం అందజేశారు. దీంతో పలువురు రాజకీయ నాయకులను ఆశ్రయించారు.
2001లో 1.18 ఎకరంలో తాత్కాలికంగా షెడ్లు నిర్మించుకున్న వారితో ప్రతి ఏటా భూమికి రెంటు చెల్లించే విధంగా ఒప్పందం రాసుకున్నారు. ఒప్పందం ప్రకా రం ఎవరు కూడా ప్రతి ఏటా రెంటు కట్టడం లేదు.తాత్కాలిక షెడ్ల నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకున్న పలువురు పక్కా భవనా ల నిర్మాణం చేపట్టడంతో సంబంధిత అధికారులు వాటిని అడ్డుకున్నారు. అక్రమ నిర్మాణాలపై దేవాదాయశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల కు నివేదికను అందజేశారు.
సర్వే కోసం ఏడాదిగా ఎదురు చూపులు
శ్రీ కేశవనాథ ఆలయ భూముల సర్వే కో సం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు పెట్టి సంవత్సర కాలం గడుస్తున్న సంబంధిత అధికారులు సర్వే చేపట్టకపోవడంతో భూములు అన్యక్రాంతం అవుతున్నాయి. దేవాదాయ శాఖకు చెందిన భూములకు కొలతలు చేప ట్టి సరిహద్దులు పెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దేవాదాయ మాన్యం కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ భూముల్లో వెలసిన ఇందిరమ్మ ఇండ్లు
ప్రభుత్వం గూడులేని నిరుపేదలకు ఇల్లు కట్టించాలని ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుంది. ఆసిఫాబాద్ మండలం గోవింద్‌పూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. గ్రామంలో దాదాపు 106 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయ గా ప్రస్తుతం పిల్లర్ దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం ద్వారా మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పలువురు దేవాదాయ శాఖకు చెందిన భూములను ఆక్రమించి నిర్మాణం చేపట్టడంతో దేవాదాయ ఆలయ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు నిర్మాణాలను బుధవారం అడ్డుకున్నారు.
ఇందిరమ్మ లబ్ధిదారులు స్థలాన్నికి సంబంధించిన డాక్యుమెంట్లు లేకున్నప్పటికీ ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం ఆస్యాస్పదంగా ఉంది. ఇట్టి నిర్మాణం నిర్మాణాలపై గ్రామస్తులను అడగగా 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, తమకు సంబంధిత అధికారులు ఎలాంటి హక్కు పత్రాలు, భూమికి హద్దులు చూపించలేదని తెలిపారు.
ఆక్రమణల వెనుక ఎవరి హస్తం?
శ్రీ కేశవనాథ ఆలయ భూములలో చేపడుతున్న అక్రమ నిర్మాణాల వెనుక ఎవరి హస్తముందనే చర్చ మొదలైంది. దళితులను అడ్డం పెట్టుకొని కొంతమంది నాయకులు, రియాల్టర్లు రంగంలో దిగి చక్రం తిప్పుతున్నట్లు బహిరంగంగా చర్చ జరుగుతుంది.
దేవాదాయ భూములు అన్యాక్రాంతం అవుతున్నప్పటికీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నా రు. భూముల ఆక్రమణలను తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.