calender_icon.png 22 October, 2024 | 8:32 AM

చందాదారుల వివరాలిచ్చేందుకు అభ్యంతరమేంటి?

22-10-2024 01:26:59 AM

మార్గదర్శికి హైకోర్టు ప్రశ్న  

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): చందాదారులకు చెల్లింపులు చేపట్టామంటూ సుప్రీంకోర్టుకు అందజేసిన 69,531 పేజీల వివరాలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటో చెప్పా లని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే ఎంపీ వద్ద పేపర్ ఫార్మాట్లో వివరాలున్నాయని, కొన్ని ఇబ్బందుల కారణంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్ (పెన్ డ్రైవ్)లో కోరుతున్నారని చెప్పింది.

అయితే, సమాధానం చెప్పేందుకు మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా తటపటాయించారు. కొంత గడువు ఇవ్వాలని ఫైనా న్సియర్స్ నుంచి సూచనలు పొంది చెబుతానని బదులిచ్చారు. దీంతో తదుపరి విచారణ ను ద్విసభ్య ధర్మాసనం నవంబర్ 4కు వాయి దా వేసింది.

4న అన్ని వివరాలతో విచారణకు హాజరు కావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), మార్గదర్శితో పాటు ఇరు రాష్ట్రా ల న్యాయవాదులను ఆదేశించింది. చందాదారుల వివరాలను పెన్‌డ్రైవ్‌లో తీసుకురావాలని ఆదేశించింది. మార్గదర్శి ఫైనార్సియర్ పిటిషన్లపై హైకోర్టు జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది.

విచారణ వర్చువల్‌గా హాజరైన ఉండవల్లి మాట్లా డుతూ.. ‘సుప్రీంకోర్టుకు మార్గదర్శి అందజేసిన 69,531 పేజీల చందాదారుల వివరాలను పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆదేశించాలి. పేపర్ ఫార్మాట్లో వివరాలు నా వద్ద ఉన్నా.. పరిశీలనకు ఇబ్బందిగా ఉంది. కొన్ని అంశాలను ఇప్పటికే పరిశీ లించాను. ఆ వివరాలన్నీ డొల్లగానే ఇచ్చారు. ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇస్తే అక్రమాలు తెలియజేస్తా.

నేను ఎవరి తరఫున వకాలత్ తీసుకో లేదు. సుప్రీంకోర్టు సూచన మేరకు హైకోర్టుకు సాయం మాత్రమే చేస్తున్నా’ అని పేర్కొన్నారు. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది లూద్రా వాదనలు వినిపిస్తూ.. చందాదారుల వివరాలు ఇవ్వాలి అని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. దీనికి ధర్మాసనం అభ్యంతరం తెలిపిం ది.

పేపర్ ఫార్మాట్లో ఉన్న వివరాలనే పెన్‌డ్రైవ్‌లో కోరుతున్నారు కదా? అని ప్రశ్నించింది. గడువిస్తూ సూచనలు పొంది చెప్తానని లూద్రా బదులిచ్చారు. తదుపరి విచారణకు పెన్‌డ్రైవ్‌లో వివరాలతో రావాలని ధర్మాసనం ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. కాగా, ఈ కేసులో పిటిషనర్ మృతిచెందారని తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్‌రావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని కూడా కోర్టు నమోదు చేసుకుంది.