calender_icon.png 8 February, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త సార్ల సర్వీస్ తేదీ ఏది?

08-02-2025 02:00:37 AM

  • 2024 టీచర్లలో అయోమయం

సర్వీస్ తేదీపై కొరవడిన స్పష్టత

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): డీఎస్సీ2024లో ఉద్యోగాలు పొందిన కొత్త టీచర్ల సర్వీస్ తేదీలపై అయోమయం నెలకొంది. తమ సర్వీస్ తేదీకి సంబంధించి అధికారులు స్పష్టత ఇవ్వాలని కొత్త సార్లు విజ్ఞప్తి చేస్తున్నారు. సర్వీస్ తేదీల్లో స్పష్టత లేకపోవడంతో మూడు నెలలుగా కొత్త టీచర్లు ఇంకా సర్వీస్ బుక్ ఓపెన్ చేయలేదు.

ఇటు ప్రభుత్వం, అటు విద్యాశాఖ అధికారులు తమకు ఈ విషయంలో స్పష్టత ఇవ్వడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది అక్టోబర్ 10న ఎల్బీ స్టేడియంలో 10 వేల మంది కొత్త టీచర్లకు ప్రభుత్వం నియామకపత్రాలు అందజేసింది. అదే రోజు నుంచి వేతనాలు ఇవ్వాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం ఉత్తర్వులు జారీ చేశారు.

కానీ, ఆర్థిక శాఖ మాత్రం అక్టోబర్ 10 నుంచి కాకుండా పాఠశాలల్లో చేరిన అక్టోబర్ 16 నుంచి వేతనాలు మంజూరు చేసింది. ఉద్యోగి తన సర్వీస్ బుక్ ఓపెన్ చేయాలంటే నియామక తేదీ, ఉద్యోగంలో చేరిన తేదీని పొందుపరచాల్సి ఉంటుంది.

అయితే అక్టోబర్ 16 నుంచి వేతనాలు ఇవ్వడంతో సర్వీస్ తేదీని అక్టోబర్ 10 లేదా 16 తేదీల్లో దేన్ని పరిగణనలోకి తీసుకోవాలో స్పష్టత రావడం లేదు. ఈ విషయమై అధికారులు క్లారిటీ ఇవ్వాలని కొత్త టీచర్లు కోరుతున్నారు. 

గతంలో ఎప్పుడూ లేదు..

గత డీఎస్సీల్లో ఈ పరిస్థితి ఎప్పుడు రాలేదు. కానీ, కొత్త టీచర్ల విషయంలో రెండు వేర్వేరు తేదీలు ఇవ్వడంతో వారిలో అయోమయం నెలకొంది. ఇతర ఉద్యోగాలు చేస్తూ 2024 డీఎస్సీలో టీచర్ ఉద్యోగాలు పొందిన అనేకమందికి కూడా పాత సర్వీస్, కొత్త సర్వీస్ జత చేసే సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది.

భవిష్యత్తులో ఏ పదోన్నతి ప్రక్రియ చేపట్టినా అందులో సీనియారిటీ జాబితాల్లో కూడా సర్వీస్ తేదీ కీలకం కానుంది. దీంతో టీచర్ల నియామక తేదీపై వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది.