రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వాసుపత్రులల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఆసుపత్రి అభివృద్ధి కమిటీ’ల ఊసు కనిపించడం లేదు. జిల్లా ఆసుపత్రులకు జడ్పీ చైర్మన్లు, పీ.హెచ్‌సీలకు ఎంపీపీలు ఛైర్మన్లుగా వ్యవహరిస్తారు. ఈ అభివృద్ధి కమిటీల్లో స్థానికంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. చాలా రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రులలో అభివృద్ధి కమిటీల కార్యాచరణ లేక ఆస్పత్రుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన కమిటీల సమావేశాలను నిర్వహించడం లేదు. మరోవైపు ఆస్పత్రులకు అరకొరగా నిధులు వస్తుండటంతో అభివృద్ధి పనులు మందగిస్తున్నాయి.
దీంతో సర్కారు దవాఖానలకు ప్రభుత్వం నుంచి సరిపడా నిధులు మంజూరు కాక పలు సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో లేక రోగులు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల తాగునీటి వసతి కూడా సరిగ్గా లేదు. పలు చోట్ల ఫ్యాన్లు, ట్యూబ్ లైట్‌లు సైతం పని చేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రధాన వార్డుల్లో పరిసరాలు అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.
ఈ రకంగా ఆస్పత్రుల అభివృద్ధి కుంటుపడుతుండటంతో వచ్చే పోయే పేషెంట్లకు తీవ్ర అసౌకర్యంగా ఉంటున్నది. అభివృద్ధి కమిటీల సమావేశాలకు ఎమ్మెల్యేలు, కలెక్టర్, జడ్పీ ఛైర్మన్లు అధ్యక్షత వహిస్తారు. ఏటా రెండు పర్యాయాలు కలిపి గరిష్టంగా రూ.1.70 లక్షల వరకు నిధులు మంజూరవుతాయి. అభివృద్ధి కమిటీ ఆమోదం మేరకు ఈ నిధులు వసతుల కల్పనకు వినియోగించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రులలో అభివృద్ధి కమిటీలను చురుగ్గా పనిచేసేలా ఏర్పాట్లు చేయాలి.
రాజశేఖర్ వావిలాల