calender_icon.png 23 December, 2024 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యతరగతి మాటేమిటి!?

28-08-2024 12:00:00 AM

దేశానికి ప్రధాన చోదక శక్తి మధ్యతరగతి ప్రజలే. స్వాతంత్య్రం వచ్చి నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా, ఇటు కేంద్రం కానీ, అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకోని సుమారు 45 శాతం జనాభా ఉన్న పెద్ద సమూహం ఈ మధ్యతరగతి ప్రజలు. పేదలకు పథకాలు, ధనవంతులకు రాయితీలు కుమ్మరించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యతరగతి వారికి చేసే పనులు ఏమిటో, చేపట్టిన చర్యలు ఏమిటో ఇకనైనా స్పష్టంగా చెప్పాలి. ఓట్లు రాబట్టుకునే విధంగా కులాల వారీగా పథకాలు ప్రకటించడం తప్ప, వాస్తవానికి ఈ వర్గ ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు ఉదాసీనత ప్రదర్శిస్తున్నాయి.

నేటి భారతీయ సమాజంలో పేదవాళ్లమని చెప్పుకోలేక, అలాగని ధనికులుగా లేక త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్న కోట్లాదిమంది మధ్యతరగతి ప్రజల సాధక బాధకాలు చెప్పుకోలేనివి. సగటున నెలకు 15 వేల నుంచి 60 వేల రూపాయలు సంపాదించే వర్గాన్ని మధ్యతరగతి ప్రజలుగా పరిగణిస్తే వీరి ఆదాయంతో కేవలం నలుగురు సభ్యులు సాధారణ జీవితాన్ని గడపవచ్చు. కానీ, 1990 తరువాత దేశంలో అమలులోకి వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాల వల్ల ఈ మధ్యతరగతి ప్రజలు తమ సంపాదనలో నూటికి 60 శాతం పైబడి కేవలం విద్య, వైద్యం కోసమే వెచ్చించవలసి వస్తున్నది. దీంతో అనేకమంది అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు.

ముఖ్యంగా రైతులు, సామాన్య కార్మికులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంఘటిత కార్మికులు వంటివారు ఈ కోవలోకి వస్తారు. జీవితాంతం తరతరాలుగా ప్రభుత్వాలకు పన్నులు చెల్లించే వర్గం కూడా ఈ మధ్యతరగతి ప్రజలే. అంతేకాక, పన్నుపోటుకు (ఆదాయం పన్ను, జీఎస్‌టీ) గురయ్యేవారు కూడా వీరే. అదే సమయంలో దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక తదితర రంగాల్లో పనిచేస్తూ దేశ స్థూల జాతీయోత్పత్తిలో కీలక భాగస్వాములు వీరే. ఎంతో శ్రమించి పిల్లలను చదివించి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించి దేశానికి మంచి పౌరులను అందించే వర్గం వీరు. ఆ మాటకొస్తే ఇతర దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొంది మన దేశానికి రెమిటెన్స్ రూపంలో ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం సమకూర్చే వారు కూడా ఈ మధ్యతరగతి వారే.

దేశంలో అత్యధిక కొనుగోలు శక్తిని కలిగిన సమూహం కూడా మధ్యతరగతి ప్రజలే. సెల్‌ఫోన్లు, మోటార్ సైకిల్, కార్లు వంటివి, ఏసీలు, ఫ్రిజ్‌లు, టీవీలు, కంప్యూటర్ల వంటివి అప్పులు చేసి మరీ కొనేవారిలో ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు ఉంటారు. ప్రపంచంలో ఎక్కువ దేశాలు భారత్‌తో వర్తక, వాణిజ్య ఆర్థిక సంబంధాలు పెట్టుకోవడానికి తహతహలాడటానికి ప్రధాన కారణం ఎక్కువ శాతంలో ఉన్న మధ్యతరగతి ప్రజలే.  ఈ వర్గంలోని చదువుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలి. పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగాలి. బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి.

భారత్ త్వరలో అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నదని పాలకులు చెబుతున్నా సెన్సెక్స్, నిఫ్టీ సూచికలు లక్ష పాయింట్లు చేరినా మన అభివృద్ధి మాత్రం ‘నేతి బీరకాయలో నెయ్యి’ చందంగానే ఉంటున్నది. దీనికి నిదర్శనం ప్రస్తుతం మనం ‘మానవాభివృద్ధి సూచీ’లో 134వ స్థానంలో ఉండటమే ప్రత్యక్ష సాక్ష్యం. ఒక్కమాటలో చెప్పాలంటే మధ్యతరగతి ప్రజల అభివృద్ధిపైనే దేశ వాస్తవ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని అందరూ గ్రహించాలి.

ముఖ్యంగా 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధించాలంటే ఈ వర్గం ప్రజలు విధిగా ముందడుగు వేయాలి. దీనిని పాలకులు గ్రహించాలి. వారి సామాజిక ఆర్థిక రాజకీయ అభివృద్ధికి ఇకనైనా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా ధరలు పెరుగుదల, పన్నుపోట్లు, విద్య, వైద్య ఖర్చులు వంటివి తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి. అదే సమయంలో మన ప్రభుత్వాలు రుణాలు ఎగ్గొట్టే బడాబాబులపై సానుభూతి తగ్గించే చర్యలు చేపట్టాలి. 

- ఐ.ప్రసాదరావు