calender_icon.png 12 February, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిఫ్ట్‌డీడ్ ఆక్రమణలో.. ఆంతర్యమేంటి?

12-02-2025 12:00:00 AM

  • మున్సిపాలిటీ స్థలాన్ని అక్రమించిన ‘స్లోక కన్వెన్షన్‘ నిర్వాహకులు
  • అన్యాక్రాంతమైన 668.31 గజాల స్థలం రూ.3 కోట్లు విలువచేసే భూమికి ఎసరు
  • పట్టించుకోని మున్సిపల్ అధికారులు

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోనే రిచెస్ట్ మున్సిపాలిటీల్లో ఒకటైన ఆదిభట్ల మున్సిపాలిటీలో భూముల ధరలు ఆకాశాన్నంటడంతో అక్రమార్కుల కన్ను ప్రభుత్వ భూములు, పార్క్ స్థలాలపై పడి అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇదే తరహాలో ఆదిభట్ల మున్సిపాలిటీ గిఫ్ట్ డీడ్ స్థలాన్ని సైతం  కొంగరకలాన్ లోని శ్లోక కన్వెన్షన్ నిర్వాహకులు ఆక్రమించి ప్రహారి గోడను నిర్మించారు.

అయితే ఇదంతా గతంలో స్లోక కన్వెన్షన్ హాల్ నిర్మించే క్రమంలో హెచ్‌ఎండీఏ ప్లాన్ లో భాగంగా రోడ్లు, పార్కింగ్ ఏరియాలను ఆదిభట్ల మున్సిపాలిటీకి 2021 డిసెంబర్ 24న 668.31 గజాల స్థలాన్ని గిఫ్ట్ డీడ్ చేసి అప్పగించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారుల చేత ధృవీకరించిన (డాక్యుమెంట్ నెం.20644-2021) పత్రాలను కూడా అప్పగించారు. ఆ ప్రాంతంలో గజం ధర రూ.50 నుంచి 60 వేల వరకు పలుకుతోంది.

అంటే 668.31 గజాలకు గాను రూ.3 కోట్ల పైమాటే. అయితే ఈ కన్వెన్షన్ హాల్ నిర్మాణం పూర్తి అయ్యి, ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా 388, 389, 390 గల సర్వే నంబర్లోని 668.31 గజాల స్థలాన్ని కబ్జా చేసి సుమారు 500 మీటర్ల పొడవు, 6 ఫీట్ల ఎత్తులో రోడ్డు నిర్మించారు. అంతే కాకుండా అక్రమంగా ప్రహారి గోడను నిర్మించి అది కనిపించకుండా చెట్లను నాటి, ఎవరి కంటపడకుండా దృష్టిమళ్లించే విధంగా చేశారు.

గతంలో ఈ విషయంపై స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన్పటి ఏలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. అసలు స్లోక కన్వెన్షన్ నిర్వాహకులకు, మున్సిపల్ అధికారులకు మధ్య జరిగిన రహస్య ఒప్పందం ఏమిటీ ? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైన మునిసిపల్ అధికారులు స్పందించి, మున్సిపాలిటీకి సంబందించిన అత్యంత విలువైన స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. 

చట్టాలు.. చుట్టాలేనా..? 

ఇలాంటివి చూసినపుడు చట్టాలు ఎవరికి చుట్టాలు కావు అనేది అవాస్తవం అనిపిస్తుంది. ప్రభుత్వ స్థలాల్లో గోడలు నిర్మించడం చట్ట ప్రకారం నేరమైనప్పటికీ అక్రమార్కులకు అడ్డేది అన్నట్లుగా కొందరి అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో యథేశ్చగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఒకవేళ అధికారులకు ఫిర్యాదులు అందినా చూసిచూడనట్లుగా వ్యవహరించడం కొందరి అధికారులకు పరిపాటిగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి దృష్టిసారిస్తే తప్పా, ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలియదు.. కనుక్కుంటా!

మున్సిపాలిటీ గిఫ్ట్ డీడ్ స్థలం ఆక్రమణకు గురైన విషయంపై మున్సిపల్ కమిషనర్ ని వివరణ కోరగా తెలియదు, కనుక్కుంటాను అంటూ సమాధానం ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత ఇదే విషయం పై మున్సిపల్ కమిషనర్, టిపిఓ లను సంప్రదించిన అందుబాటులోకి రాలేదు. సమాధానం ఇవ్వడంలో అధికారులు ముందుకు రాకపోవడం, పలు అనుమానాలకు తావిస్తోంది.