calender_icon.png 28 February, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూలధనం కిం కర్తవ్యం?

28-02-2025 01:56:17 AM

  1. రూ.58 వేల కోట్ల సమీకరణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
  2. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడి ప్రణాళికలు
  3. భూమి ఆధారిత రుణాల వైపు సర్కారు చూపు..
  4. టీజీఐఐసీ భూముల అమ్మకంతో రూ. 20 వేల కోట్లు..
  5. ‘హడ్కో’ నుంచి రూ.10 వేల కోట్లు
  6. మిగతా నిధులను ఇతర ఏజెన్సీల నుంచి రాబట్టేందుకు ప్రతిపాదనలు

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడి 2025 ---26 ఆర్థిక సంవత్సరం లో మౌలిక సదుపాయాలు, సామాజిక ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు రూ.58 వేల కోట్ల మూలధనం సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. అందుకు వీలైనన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నది. అవసరమైతే ఆర్థిక సలహాదారులు, మర్చంట్లను ప్రత్యేకంగా నియమించేందుకు సిద్ధమైంది.

వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజా నా తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నది. గడిచిన పది నెలల్లో ప్రభుత్వ అంచనాల్లో 37శాతం లోటు రాబడి నమోదైంది. పరిస్థితి ఇలా ఉండగానే మరోవైపు సర్కార్ 2025--26 బడ్జెట్‌ను సిద్ధం చేస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనైనా ఆర్థిక స్థిరత్వం సాధించే విధంగా రాష్ట్ర ఆర్థికశాఖ కసరత్తు చేస్తున్నది. 

టీజీఐఐసీ నుంచి 20వేల కోట్లు

ప్రభుత్వం మొదట విడతగా రూ.38 వేల కోట్ల రుణ సమీకరణకు సన్నద్ధమవుతున్నది. అత్యధికంగా టీజీఐఐసీ నుంచి రూ.20 వేల కోట్లు సమీకరించాలని టార్గెట్ నిర్దేశించుకున్నది. 2024- -25లో ఇప్పటికే టీజీఐఐసీ నుంచి రూ. 10 వేల కోట్లు సమీకరించిన విషయం తెలిసిందే. ఇవికాక వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రూ.20 వేల కోట్లకు ప్రణా ళికలు రచిస్తుందన్నమాట. మరోవైపు రంగారెడ్డి జిల్లా పరిధిలోని 400 ఎకరాల సర్కార్ భూమిని విక్రయించి, ఒక్కో ఎకరానికి రూ.75 కోట్ల చొప్పున రాబట్టాలని చూస్తున్నదని తెలిసింది.

ఇందిరమ్మ ఇళ్లకు రూ.10 వేల కోట్లు.. 

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసేందుకు సర్కార్ హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) నుంచి రూ.10 వేల కోట్ల రుణం తీసుకునే యోచనలో ఉంది. అలాగే, ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు కింద రూ.2 వేల కోట్లను హడ్కో నుంచి రుణంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేగాక.. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం కింద మరికొంత అప్పు తీసుకునే యోచనలోనూ ఉంది. 

ఆర్‌ఆర్‌ఆర్, మూసీ, విద్యాలయాలకు..

ప్రభుత్వం రూ.5 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా విద్యాలయాలు నిర్మించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఒక్కో విద్యాలయానికి 25 ఎకరాలు కేటాయించింది. ఆయా స్థలాలను పూచీకత్తుగా చూపి రూ.5000 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు ఆసియాన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీతో చర్చలు జరుపుతున్నది.

అలాగే, మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ పనులకు రూ.4,100 కోట్ల నిధులు సమీకరించేందుకు ఇప్పటికే ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణకు అదనంగా రూ.3,000 కోట్లు సమీకరించేందుకు వరల్డ్ బ్యాంక్‌కు ప్రతిపాదనలు పంపించాలన్న యోచనలో ఉన్నది. 

హెఎండీఏ ద్వారా మరో రూ.20వేల కోట్లు..

హైదరాబాద్‌ను గ్లోబల్‌వ్యాప్తంగా నంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దాలంటే మౌలిక సదుపాయాల కల్పన అత్యంత కీలకం. దీనిలో భాగంగానే హెఎండీఏ ద్వారా రూ.20 వేల కోట్ల రుణం తీసుకోవాలని, అందుకు అనుగుణంగానే ఆర్థిక సలహాదారులు, మర్చంట్ బ్యాంకర్లను నియమించే యోచనలో ప్రభుత్వం ఉంది.