calender_icon.png 7 January, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాండూరు కందిపప్పుకు సాయమేది?

06-01-2025 01:21:47 AM

వికారాబాద్ జిల్లాలోని తాండూరు, యేలాల్, పెద్దేముల్, బషీరాబాద్ మండలాల్లో కందిపంటను విస్తృతంగా సాగు చేస్తారు. ఏడాదికి దాదాపు 4 నుంచి 5 లక్షల క్వింటాళ్ల వరకు రైతులు దిగుబడిని తీస్తారు. ఈ ఉత్పత్తి విలువ ఏడాదికి రూ.500 కోట్లు ఉంటుంది. నాణ్యతకు, పోషకాలకు నెలవైన తాండూరు కందులకు విశేషమైన గుర్తింపు ఉంది. తాండూరు కందిపప్పులోని గొప్పతనానికి నిదర్శనమే భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ రావడమని చెప్పొచ్చు. 

తాండూరు కందికప్పు.. ఈ బ్రాండ్‌కు ప్రపంచస్థాయి  గుర్తింపు ఉంది. నాపరాతికి తాండూరు ఎంత ప్రత్యేకమో, కంది పంట కూడా అంతకుమించిన ప్రసిద్ధి పొందింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాండూరు కందిపప్పును ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవస రం ఉంది. అలాగే, కందిపప్పును పండించే రైతులు, దీనిపై ఆధారపడిన పరిశ్రమలపై కూడా దృష్టిసారిస్తే బాగుంటుంది.

దేశీయ  మార్కెట్‌తో పాటు ప్రపంచస్థాయిలో నాణ్యత గల ఈ పప్పుకు విస్తృత డిమాండ్ ఉంది. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన పప్పుకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా గిరాకీ ఉంది. కానీ మధ్యవర్తుల ప్రమేయం వల్ల వాస్తవ ప్రయోజనాలు రైతులకు అందడం లేదు. జీఐ ట్యాగ్ ద్వారా గుర్తింపు పొందిన ఈ పప్పు ఉత్పత్తికి రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తే వారికి మేలు జరుగుతుంది.

అలాగే, విద్యుత్ రాయితీలు, పరిశ్రమల ప్రోత్సాహకాలతో పాటు ఎగుమతుల విషయంలో సబ్సిడీలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. ఎగుమతులు కూడా వృద్ధి అవుతా యి. తాండూరు ప్రాంతంలో దాదాపు 63,500 కుటుంబాలకు కందిపంటనే జీవనాధారం. ఇందులో రైతులు, కౌలుదారులు, వ్యవసాయ కార్మికులు, వ్యాపారులు ఉన్నారు.

ఏటా రూ.500 కోట్ల ఉత్పత్తి

వికారాబాద్ జిల్లాలోని తాండూరు, యేలా ల్, పెద్దేముల్, బషీరాబాద్ మండలాల్లో కందిపంటను విస్తృతంగా సాగు చేస్తారు. ఏడాదికి దాదాపు 4 నుంచి 5 లక్షల క్వింటాళ్ల వరకు రైతులు దిగుబడిని తీస్తారు. ఈ ఉత్పత్తి విలు వ ఏడాదికి రూ.500కోట్లు ఉంటుంది. నాణ్యతకు, పోషకాలకు నెలవైన తాండూరు కందు లకు విశేషమైన గుర్తింపు ఉంది.

తాండూరు కందిపప్పులోని గొప్పతనానికి నిదర్శనమే భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ రావడమని చెప్పొచ్చు. తెలంగాణ నుంచి జీఐ ట్యాగ్ పొందిన 16వ ఉత్పత్తి తాండూరు కందిపప్పు. ఇక్కడి భూమిలోల ఉన్న తేమ, సహజసిద్ధమైన పోషకాలకు తోడు రైతుల శ్రమ తోడవడంతో అత్యుత్తమ పంట దిగుబడి అవుతోంది.

అక్కడి భౌగోళిక పరిస్థితులు కూడా కందిపంట సాగుకు సరిపోయేలా ఉంటాయి. సాధారణంగా కంది యాసంగి సీజనల్ పంట. కానీ తాండూరు వాతావరణ పరిస్థితులు అందుకు భిన్నం. తాండూరులో కందిపంటను సాగు చేయడానికి ఏ సీజన్ అయినా అనుకూలం కావడం అక్కడి ప్రత్యేకత.

వాస్తవానికి తాండూరు వర్షాధారంపైన ఆధార పడే ప్రాంతం. ఈ అవరోధాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ఆ ప్రాంతానికి అనువైన వాణిజ్య పంట కందిని సాగుచేస్తూ అక్కడి రైతులు ఇతర కరువు ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

3,400 ఏళ్ల చరిత్ర

కందిపప్పు సాగుకు భారత ద్వీపకల్పంలో 3,500 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు కొన్ని పరిశోధనలు తేల్చాయి. తొలుత ఉష్ణమండల ప్రాంతాల్లో కందులను సాగు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత 3400 ఏళ్ల క్రితం అంటే కొత్త రాతియుగపు కాలంలోనే దక్కన్ పీఠభూమిలో కొన్ని ప్రదేశాల్లో కంది పంటను సాగు చేసినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు పురావస్తు పరిశోధనలు చెబుతున్నాయి.

ఆ ప్రదేశాల్లో తాండూరు కూడా ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. ఆ తర్వాత ఈ పంట భారత్ నుంచి తూర్పు ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికాకు దేశాలకు విస్తరించింది. అక్కడ ఈ పంటను మొదటి యూరోపియన్లు గుర్తించారు. యూరోపియన్లు కనిపెట్టడంతో ఈ పంటకు కాంగో పీ అనే పేరు వచ్చింది. 17వ శతాబ్దంలో ఈ పంట అమెరికా ఖండానికి వెళ్లినట్లు పరిశోధనలు తేల్చాయి. 

ప్రయోజనాలు బోలెడు..

సాధారణంగా ఏ ఆహార పదార్థమైనా రుచిగా ఆస్వాదించేలా ఉండాలి. పోషకాల మిళితమై ఉండాలి. ఆరోగ్యానికి హాని కలిగించేది అయి ఉండకూడదు. అన్నింటికి మించి నాణ్యత అనేది ముఖ్యం. ఈ లక్షణాలన్నీ తాండూరు కందిపప్పులో ఉన్నాయి. అందుకే ఈ పప్పుకు మార్కెట్‌లో విపరీతమైన ఆదరణ ఉంది. కందులు అనేవి సంప్రదాయ పంటమాత్రమే కాదు.. పోషకాహారం కూడా.

కందిపప్పును సమతుల్య ఆహారంగా నిపుణులు కూడా చెబుతుంటారు. తాండూరు ప్రాంతంలో సారవంతమైన, లోతైన నల్ల నేలలు విస్తృతంగా ఉన్నాయి. ఈ నేలలో మెగ్నీషియం, అల్యూమినియం, ఫిలో సిటికేట్, పొటాషియం, నైట్రోజన్ వంటి మినరల్స్ ఉండటం వల్లే ఇక్కడ పండే పప్పుకు అంత ప్రత్యేకత, ప్రాముఖ్యత సంతరించుకొన్నది.

పప్పు మిల్లింగ్ పరిశ్రమపై మోయలేని భారం

కందులను మిల్లుల్లో ప్రాసెస్ చేసి ఆ పప్పును అమ్ముతుంటారు. తాండురులో పండి ప్రాసెస్ చేసిన పప్పుకు విశేషమైన ఆదరణ ఉంది. ఈ పప్పు ను రాష్ర్టంలోని హెచ్‌ఏసీఐ, ఏడబ్ల్యూఎస్, మధ్యాహ్న భోజనాలతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేస్తారు. అంతేకాకుండా మార్కెట్‌కు తరలిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిల్లుల్లో కందులను ప్రాసెస్ చేయడం నిర్వాహకులకు భారంగా మారింది.

ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లేకపోవడం, విద్యుత్ వినియోగ పరిమితిని పెంచకపోవడం వంటి కారణా ల వల్ల కందుల ప్రాసెస్ ప్రక్రియ డిమాండ్‌కు తగ్గట్ట జరగడం లేదు. ఫలితంగా మిల్లర్లు సకాలంలో సరఫరా చేయని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మిల్లర్లు ప్రభుత్వానికి తమ గోడును చెప్పుకొన్నారు. ఐటీ, పరిశ్రమల మంత్రికి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వెల్లబుచ్చుకున్నారు.

ఇంతకీ వారు అడుగుతు న్నది ఏమిటి.. పప్పు మిల్లుల విద్యుత్ వినియోగ పరిమితిని 100హెచ్‌పీ నుంచి 200హెచ్‌పీకి పెం చాలని నిర్వాహకులు ప్రధానంగా కోరుతు న్నారు. మన రాష్ర్టంలో దాదాపు 400 దాల్ మిల్లులు ఉన్నాయి. అవన్నీ చిన్న మిల్లులే.  చిన్న మిల్లులో ప్రాసెస్ చేయడం వల్ల విద్యుత్ వినియోగం మోయలేనంత పెరిగి ఆర్థిక భారం పడుతున్నది.

మిల్లర్లు గతంలో విద్యుత్ చార్జీలకు రూ.5000 చెల్లిస్తే, ఇప్పుడు రూ.50,000- వరకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో మిల్లర్లు భారీ చార్జీలు చెల్లించలేకపోతున్నారు. అందుకే విద్యు త్ వినియోగ పరిమితి పెంచితే.. అధునాతన మిషనరీని ఏర్పాటు చేసుకొని నిర్దేశిత గడువులో డెలివరీలు చేస్తామని మిల్లర్లు చెబుతున్నారు.

పొరుగు రాష్ట్రాలలో విద్యుత్ పరిమితిని 100హెచ్‌పీ నుంచి 150 హెచ్‌పీకి పెంచారు. తెలంగాణలో కూడా ఇటీవల రైస్ మిల్లుల విషయం లో 100హెచ్‌పీగా ఉన్న పరిమితిని 150హెచ్‌పీకి పెంచుతూ నిర్ణ యం తీసుకున్నారు. అత్యుత్తమ పప్పును పొందాలంటే ఆధునిక యంత్రాలు అనివార్యమని, తమకు పరిమితిని పెంచాలని మిల్లర్లు అంటున్నారు. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించాలి.  

దాల్ బోర్డును ఏర్పాటు చేయాలి

తాండూరులో కందుల దిగుబడి జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా కాస్త లాభదాయకంగా ఉండటంతో.. దశాబ్దాలుగా ఇక్కడి రైతులు ఈ పంటనే నమ్ముకున్నారు. ఇదిలా ఉండగా.. కంది రైతుల కోసం 2017లో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పసుపు బోర్డు వంటి దాల్ బోర్డును ఏర్పాటుచేస్తానని ప్రకటించారు.

కానీ ఆయన మరిచిపోయారు. ప్రకటన చేసిన ఆరేళ్లు సీఎంగా ఉన్న ఆయన దాల్ బోర్డును ఏర్పాటు చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వమైనా ఉత్పత్తితో  ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలను పెంచడానికి దాల్ బోర్డును ఏర్పాటు చేస్తే రైతులు, పరిశ్రమలు, సర్కారుకు బహుళ ప్రయోజనంగా ఉంటుంది.

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి