02-02-2025 01:43:18 AM
మనం అడిగింది ఒక్కటీ ఇవ్వలేదు
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్ 2025-26పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రంచేసిన విజ్ఞప్తుల్లో కేంద్రం ఒక్కటి కూడా పరిగణలోకి తీసుకోకపోవడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. శనివారం కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ మేరకు నిధులు వస్తాయా? ఆ నిధుల ఆధారంగా స్టేట్ బడ్జెట్‌లో ఏ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఇలా పలు అంశాలపై ఆయన రాష్ట్ర ఫైనాన్స్ ముఖ్య కార్య దర్శి రామకృష్ణరావును వివరాలు అడిగారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగి న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, కొండాసురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్‌తో.. రాష్ట్రంలో ఆయా శాఖలకు ఏమైనా ఫాయిదా ఉందా? అన్న వివరాలను సీఎం, మంత్రు లు అడిగి తెలుసుకున్నారు. ఆశించిన రంగాల్లో కేంద్రం నిధులు విదిల్చకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన సీఎం.. రాష్ట్ర పద్దుపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. కేంద్ర కేటాయింపులకు అనుగుణం గా రాష్ట్ర బడ్జెట్‌ను సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిసింది.
అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ముఖ్యమంత్రి ఆరా తీసినట్లు సమాచారం. ఆదాయం ఎలా ఉంది? అని అడిగి తెలుసుకున్నారు. జీఎస్టీ, మైనింగ్, ఆబ్కారీతో పాటు ఆదాయం తెచ్చే శాఖలు అంచనాలను అందుకోలేకపోతున్నాయి.
ఈ క్రమంలో ఆయా విభాగాల్లో రా బడిని పెంచుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై కూడా చర్చించారు. ఇప్పుడున్న రాబడులకు అనుగుణం గా రానున్న బడ్జెట్‌లో అంచనాలు పెంచడానికి అవకాశం ఉందా? ఒకవేళ పెంచితే ఏ విభాగాల్లో పెంచొచ్చు, ఎంతమేరకు పెంచొచ్చు అనేది చర్చించినట్లు తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం వివరణ
త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఇప్పటికే ఆర్థిక శాఖ కసరత్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్థిక మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి ఇప్పటికే అన్ని శాఖల మంత్రులు, అధికారులతో సమావేశాలను నిర్వహించి వారి అంచనాలపై నివేదికను తయారుచేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆ వివరాలను తెలిపారు. అలాగే, ఆదాయం పెంచుకోవాడానికి ఉన్న మార్గాలను కూడా సీఎంకు భట్టి వెల్లడించినట్లు సమాచారం.
బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ
ఆదివారం బీసీ డెడికేడెట్ కమిషన్ క్యాబినెట్ కమిటీ నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో ఆ అంశంపై సుదీర్ఘంగా మంత్రులతో సీఎం చర్చించారు. క్యాబినెట్ మీటింగ్, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహణ అంశాలపై మంత్రులతో చర్చించి.. రెండు 5వ తేదీనే నిర్వహించేందుకు ఈ భేటీలో నిర్ణయించారు. అలాగే, సోమవారం వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ క్యాబినెట్ సబ్ కమిటీకి నివేదికను అందజేయనుంది. ఈ క్రమంలో ఈ అంశంపై కూడా సీఎం చర్చించారు.
పంచాయతీ ఎన్నికలపై..
పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించారు. ఎన్నికలను ఎప్పుడు నిర్వహిద్దాం? కేంద్రానికి బీసీ రిజర్వేషన్ నివేదికను పంపిన తర్వాత ఎన్ని రోజులు వేచి చూద్దాం. వచ్చే నెల నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఈనెలలో ఎన్నికలకు పోవడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. కేంద్రం రిజర్వేషన్లపై ఆలస్యం చేస్తే ఏం చేయాలన్న దానిపై కూడా చర్చించారు.