- నిమిషానికో ట్వీట్ చేసే కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదు?
- సర్వేపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎందుకు నోరు విప్పరు?
- కులగణన వ్యతిరేకుల కుట్రలో బీసీలు పావులు కావొద్దు
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందన ఏది?
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న కులగణనపై బీఆర్‌ఎస్, బీజేపీ తమ వైఖరి ఏంటో ప్రజలకు చెప్పా ల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
బీసీలను చైతన్యపరిచేందుకు రచయిత కోదాడ శ్రీను రాసిన పాటను శుక్రవారం ఆయ న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిమిషానికి ఒక ట్వీట్ చేసే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కులగణన అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
సర్వేపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మౌనంగా ఉండడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కులగణన ద్వారా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. కులగణనను వ్యతిరేకించే పార్టీలు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలని దుయ్యబట్టారు.
రాహుల్ కులం ఏంటని అడగడం సిగ్గుచేటు
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇప్పటివరకు కులగణనపై స్పందించకపోవ డం శోచనీయమని జాజుల అన్నారు. గౌరవ కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్, పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ కులగణనపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం దారు ణమన్నారు. కులగణనకు మద్దతు పలికిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ కులం ఏమిటో చెప్పాలని బీజేపీ నేతలు అడగడం సిగ్గుచేటన్నారు.
కులగణనను అడ్డుకునేందుకు కుట్ర
కులగణనను అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని జాజుల మండిపడ్డారు. కుల గణనను సామాజిక ఉద్యమంలా భావించి బీసీలు కులగణనలో పాల్గొనాలని పిలుపునిచ్చా రు. బీసీల లెక్కలు తేలితే వారి వర్గాల వారి ఉద్యోగాలు, పదవులు పోతాయన్న భయంతోనే కొందరు కులాల లెక్కలు తేలకుండా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
కులగణనపై వైఖరి చెప్పని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. కులం పేరుతో సర్వే చేయొద్దని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సర్కార్ సామాజిక, రాజకీయ, ఆర్థిక, కులం, ఉపాధి అంశాల పేరిట సర్వే చేస్తున్నదన్నారు. సర్వే ముఖ్య ఉద్దేశం మాత్రం కులాల లెక్కలు తేల్చడమేనని స్పష్టం చేశారు.
సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కుర్మ, నాయకులు ఐలి వెంకన్న గౌడ్, జాజుల లింగం, సింగం నగేష్, బూడిద మల్లి కార్జున యాదవ్, టి.తారకేశ్వరి, సమత పాల్గొన్నారు.