calender_icon.png 31 October, 2024 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనపై బీఆర్‌ఎస్, బీజేపీల వైఖరేంటి?

31-10-2024 01:27:21 AM

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా15 రోజులపాటు యాత్ర 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): బీసీల పట్ల బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీ లకు చిత్తశుద్ధి ఉంటే కులగణనపై వెంటనే తమ వైఖరి వెల్లడించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాజుల మాట్లాడుతూ కులగణనపై కాంగ్రెస్ పార్టీ స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చూపుతున్న చొరవకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో రాజకీయ పార్టీలన్ని భాగస్వామ్యం కావాలని పిలుపుని చ్చారు.

కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలేవీ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణన విజయవంతం కావాలంటే అందరి సహకారం అవసరమని సూచించారు. సర్వే గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు తమ కార్యకర్తలు సూచించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో మీకు మనుగడ లేకుండా చేస్తామని హెచ్చరించారు. కులగణనతో కేవలం పాక్షిక విజయం మాత్రమే సాధించామని, బీసీ రిజర్వేషన్ సాధించినప్పుడే లక్ష్యం నెరవేరు తుందని స్పష్టం చేశారు.

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులపాటు యాత్ర నిర్వహిస్తామని వెల్లడించారు. యాత్రలో భాగంగా ‘ఓ బీసీ మేలుకో లెక్క తెలుసుకో’ అని అవగాహన కల్పించనున్నట్టు పేర్కొన్నారు. నవంబర్ 3వ తేదీన బీసీ కుల సంఘాల నాయకులతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యమ స్ఫూర్తితో బీసీల్లో చైతన్యం నింపుతూ ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వరంగల్‌కు చెందిన నాయకుడు తీగల ప్రదీప్‌ను బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధిగా నియమించారు.