calender_icon.png 5 February, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ఊసేది?

05-02-2025 02:17:27 AM

  • సీపీఎం నేతల మండిపాటు

బీజేపీకి వ్యతిరేకంగా నిరసన

మహబూబాబాద్, ఫిబ్రవరి 4(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు వ్యతిరేకంగా సీపీఎం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్‌లో తెలంగాణ ఉసే లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మండిపడ్డారు.

ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం వివేకానంద సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం  సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేతన జీవులను పెద్ద ఎత్తున సంతోష పరుస్తామని చెప్పి ముష్టి వేసినట్టు ఊరట కల్పించారన్నారు. దేశ ప్రజల బడ్జెట్ అంటూ  ప్రధాని మోదీ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురు ఎంపీలున్నప్పటికీ రాష్ట్రానికి ఎలాంటి నిధులను రాబట్టలేక పోయారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన హామీలను గాలికొదిలేశారని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీలు, రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐఐఎం హైస్పీడ్ రైల్వే ట్రాక్‌లకు నిధుల ఊసే లేదని విమర్శించారు.

ప్రస్తుతం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్  కేవలం ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలనుద్దేశించి ఉందని దుయ్యాబట్టారు. వలసలను, ఆత్మహత్యలను నిరోధించే విధంగా బడ్జెట్‌ను రూపొందించాలని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.