calender_icon.png 27 November, 2024 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెప్పిందే తూకం.. ఇచ్చిందే పైకం

23-11-2024 12:00:00 AM

  1. కామారెడ్డిలోని జిన్నింగ్ మిల్లుల్లో కన్నింగ్ మాఫియా
  2. దూదితోపాటు గింజలకూ ఫీజు వసూలు 
  3. బయట మార్కెట్ కంటే తక్కువ రేటుకే కొనుగోళ్లు 
  4. పత్తి రైతులను నిండా ముంచుతున్న వైనం 
  5. ప్రశ్నిస్తే ఇచ్చిన అప్పు చెల్లించాలని మెలిక
  6. సత్ఫలితాలివ్వని అధికారుల సమీక్షలు

కామారెడ్డి, నవంబర్ 2౨ (విజయక్రాంతి) : సీడ్ పత్తి రైతులను జిన్నింగ్ మిల్లర్లు, సీడ్ ఆర్గనైజర్లు నిండా ముంచుతున్నారు. ఫౌండేషన్ సీడ్ ఇచ్చింది మొదలు పంట చేతికొచ్చి డబ్బులు చెల్లించే వరకు వారి దోపిడీ పర్వం కొనసాగుతున్నది. ఎప్పుడూ రైతులను దోచుకోవడానికి కొత్త ఎత్తులు వేసే ఆర్గనైజర్లు ఇప్పుడు జిన్నింగ్ మిల్లుల్లో తరుగు పేరిట రైతులను ముంచుతున్నారు.

సాధారణంగా కాటన్ సీడ్‌లో తరుగు తీయొద్దు. ఒకవేళ తీసినా పత్తి క్వాలిటీ కోసం కొంత తీయాలి. కానీ మిల్లర్లు క్వింటాల్‌కు ఏకంగా ౭ నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తున్న సందర్భాలున్నాయి. తరుగు ప్రాసెసింగ్ ఫీజు, మిల్లు బీమాను సైతం రైతుల నెత్తిపైనే మోపుతున్నారు.

ఒకవేళ ఇదంతా తెలిసి రైతు వారికి విక్రయించనని చెబితే తమ అప్పు తిరిగి చెల్లించాలని మెలిక పెడుడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో చాలా మంది ఆర్గనైజర్లు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదంతా అధికారులు గమనిస్తున్నా.. వారిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడం లేదు.

జిల్లాలోని గాంధారి, మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం మండలాల్లోని పత్తి రైతులకు ఆర్గనైజర్లు విత్తనాలు ఇచ్చి పంట కూడా తమకే అమ్మాలని అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. పంట చేతికొచ్చాక పత్తి రైతులనుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. అధికారులు ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించినా రైతులకు న్యాయం జరగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రాసెసింగ్ ఫీజు దోపిడీ

సాధారణంగా ఫౌండేషన్ సీడ్ ఇచ్చి పంట సాగుకు సహకరించిన ఆర్గనైజర్.. కంపెనీకి సదరు సీడ్ రైతు పత్తిని విక్రయిస్తారు. అయితే ఎక్కువమంది ఆర్గనైజర్లు ప్రైవేట్ జిన్నింగ్ మిల్లర్లతో కుమ్మక్కై తెచ్చిన మొత్తం పత్తిని తూకం వేసి దాన్ని డిలింటింగ్ చేస్తారు.

సీసీఐ నిబంధనల ప్రకారం ఒక్కో కేజీకి రూ.7 వరకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా కేజీకి రూ.13 వరకు వసూలు చేస్తున్నారు. గింజలు పోను కేవలం దూది తూకానికి వసూలు చేయాల్సిన ఫీజును గింజలతో కలిపి వసూలు చేస్తున్నారు. 

దూదిని కూడా తమ సమక్షంలో తూకం వేయడం లేదని పలువురు రైతులు చెప్పడం గమనార్హం. బహిరంగ మార్కెట్‌లో వచ్చే రేటు కంటే తక్కువ ధరే రైతులకు చెల్లిస్తున్నారు. ఒకవేళ రైతు ఆ దూదిని తీసుకెళ్లి బయట విక్రయించాలన్నా.. రవాణా భారం అవుతుండటంతో వారు చెప్పిన తూకం.. ఇచ్చిన పైకానికే ఒప్పుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. 

బీమా సొమ్ము రైతు నుంచే..

సాధారణంగా మిల్లుల యజమానులు తమ మిల్లులోని నిల్వలకు ప్రమాదం వల్ల నష్టం జరిగితే దాన్ని బీమా చెల్లించిన కంపెనీ నుంచి తిరిగి రాబట్టుకుంటారు. అయితే రైతు పంట విక్రయించిన తర్వాత అతడికి ఆ పంటపై ఎలాంటి బాధ్యత ఉండదు కానీ.. కొందరు మిల్లుల నిర్వాహకులు క్వింటాల్ చొప్పున బీమా పేరుతో రైతుల నుంచే వసూ ళ్లు చేస్తున్నారు.

కాగా ఫౌండేషన్ సీడ్ 400 గ్రాములు ఇస్తే దానికి రూ.1,500 వరకు తీసుకుంటారు. సీడ్‌ను జీవోటీ(గ్రో ఔట్ టెస్టు)కి పంపించే సమయంలో రైతుల నుంచి మూడు ప్యాకెట్లు తీసుకోగా.. ఒక్కో ప్యాకెట్‌లో కిలో విత్తనాలు ఉంటాయి. ఒక ప్యాకెట్ రైతు, ఒక ప్యాకెట్ ఆర్గనైజర్, ఇంకో ప్యాకెట్‌ను కంపెనీ తీసుకుంటుంది. ఒకవేళ జీవోటీలో విత్తనాలు ఫెయిల్ అయితే తీసుకున్న రెండు శ్యాంపిల్ ప్యాకెట్లను తిరిగి ఇవ్వాలి.

పాస్ అయితే శ్యాంపిళ్లతో సహా మొత్తం విత్తనాలకు ధర చెల్లించాల్సి ఉంటుంది కానీ.. ఆ ప్యాకెట్లను తిరిగి ఇవ్వడం లేదు. ఒక్కరి వద్ద 2 కిలోలు అనుకున్నా.. ఒక్కో ఆర్గనైజర్ వద్ద వందలాది రైతులు ఉంటారు. ఈ రకంగానూ సీడ్ రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. 

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

జిల్లాలోని ప్రైవేట్ జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు రైతులను మోసం చేస్తున్న ట్లు ఫిర్యాదులు వస్తే విచారణ జరి పి చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు మాకు రైతుల నుంచి ఎలాం టి ఫిర్యాదులు రాలేదు. ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసమే సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిన్నింగ్ మిల్లులకు బదులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని అమ్ముకొని రైతులు మద్దతు ధర పొందవచ్చు. 

రమ్య, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి, కామారెడ్డి