తెలంగాణలో ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో డ్రగ్స్ దందా భారీగా పెరిగిపోయింది. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట భారీ మొత్తంలో డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి. కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు లక్ష్యంగా ఈ డ్రగ్స్ దందా సాగుతున్నది. గోవా, ముంబయి, బెంగళూరు వంటి నగరాల నుంచి ఈ డ్రగ్స్‌ను దొంగచాటుగా తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా నగరంలోని పబ్స్ ఈ డ్రగ్స్‌కు అడ్డాగా మారుతున్నాయి. రెండు రోజలు క్రితం ఖాజాగూడాలోని ఓ పబ్‌లో కొందరు డ్రగ్స్ తీసుకొంటున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు అర్ధరాత్రి దానిపై దాడి చేసి 55 మందిని పట్టుకొన్నారు. వీరిలో 24 మంది డ్రగ్స్ తీసుకొన్నట్లు నిర్ధారణ అయిందని పోలీసు అధికారులు విలేఖరుల సమావేశంలో వెల్లడిం చారు.
పట్టుబడిన వారిలో ఎక్కువమంది టెకీలుసహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులూ ఉన్నట్లు చెబుతున్నారు. పట్టుబడిన వారిలో ఓ కాలేజి విద్యార్థి ఉండడం గమనార్హం. పోలీసు దర్యాప్తులో విస్తుబోయే వాస్తవాలు వెలుగు చూశాయి. పబ్‌లలో పార్టీకి హాజరయిన వారందరికీ నిర్వాహకుల నుంచి ముందే ఇన్‌స్టాగ్రాం ద్వారా ఆహ్వానం అందుతుందని, అందుకు నిర్వాహకులు కోడ్ భాష వాడతారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అంతేకాదు, పార్టీకి వచ్చే వారంతా బయటి నుంచే డ్రగ్స్ తీసుకుని రావాల్సి ఉంటుందని నిర్వాహకులు సూచిస్తారని తెలిపారు. తెల్లవారు జాము దాకా చెవులు చిల్లులు పడే శబ్దంతో పార్టీలో ఎలక్ట్రిక్ మ్యూజిక్ ఉంటుందని, డ్రగ్స్ మత్తులో ఉండే వాళ్లు మాత్రమే ఈ శబ్దాన్ని భరించగలుగుతారని పోలీసులు చెబుతున్నారు.
జనావాసాల మధ్య ఉండే పబ్ లలో ఇలాంటి పెడధోరణులు ఎవరైనా ఎలా భరిస్తారు? గతంలో కూడా నగరంలోని పలు పబ్‌లపై పోలీసులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ వరసగా దాడులు జరిపి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పబ్‌ల నిర్వాహకులపై కేసులు పెట్టారు. ఆ తర్వాత డ్రగ్స్ తీసుకున్న వారికి శిక్షలు పడ్డాయా? పబ్‌ల నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే విషయాలేవీ జనానికి తెలియదు. వారికి తెలిసిందల్లా నగరంలో మరిన్ని పబ్‌లు ఇష్టారాజ్యంగా తమ వ్యాపారాల్ని కొనసాగిస్తున్నాయనేది మాత్రమే.
ఒక్క బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధులోనే 45కి పైగా పబ్‌లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవి కాకుండా ఇతర ప్రాంతాల్లో చాలాచోట్ల బార్ల ముసుగులో అనధికారికంగా పబ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తు న్నది. ఇవన్నీ తెల్లవారు జాము 3 గంటల వరకు తెరిచే ఉంటాయి. అసలు రాత్రి పది గంటల తర్వాతే వీటి వ్యాపారం మొదలవుతుంది. తెల్లవారు జాముదాకా డ్రగ్స్ తీసుకున్న, పీకల్దాకా తాగిన బడా బాబులు ఆ మత్తులోనే వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఒక్కోసారి తమ ప్రాణాలమీదికి తెచ్చుకొంటున్నారు. కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులు, టీనేజర్లన్లు కూడా పబ్‌లలోకి అనుమతిస్తుండడం తాజాగా మొదలైన ప్రమాదకర పరిణామం. ఇదో స్టేటస్ సింబల్‌గా గొప్పింటి పిల్లలు భావిస్తున్నారని, పబ్‌లు కూడా తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి వీరిని చట్టానికి విరుద్ధంగా అనుమతిస్తున్నాయని చెబుతున్నారు.
కొద్ది రోజలు క్రితం పూనేలో ఓ బడా బాబు మైనర్ కుమారుడు పబ్‌లో పూటుగా తాగి నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసి ఇద్దరి ప్రాణాలు తీయడంపై ఇప్పటికీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే ముంబయిలో ఇలాంటిదే మరో ఘటనలో శివసేన నాయకుడి కుమారుడు మద్యం మత్తులో కారు నడుపుతూ స్కూటర్‌పై వెళ్తున్న దంపతులను ఢీ కొట్టడంతో భార్య మృతి చెందగా, భర్త గాయపడ్డాడు. నిందితుడు పరారీలో ఉండగా, అతని తండ్రితోపాటు ప్రమాదం జరిగినప్పుడు కారులోనే ఉన్న డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసి కేసు పెట్టారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న పబ్‌లను సీజ్ చేస్తామని నగర పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో పోలీసులు వీటిపై ఏం చర్యలు తీసుకొంటారో వేచి చూడాలి.