calender_icon.png 4 October, 2024 | 1:04 PM

పంట భూముల్లో ఫార్మా ఏంటి!

04-10-2024 02:22:54 AM

రైతుల ఉసురుపోసుకుంటున్నరు

భూములు గుంజుకుంటే చూస్తూ ఊరుకోం: ఎమ్మెల్యే హరీశ్‌రావు 

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలోని డప్పూర్‌లో ఫార్మా సిటీ బాధిత రైతులతో సమావేశం

సంగారెడ్డి, అక్టోబర్ 3 (విజయక్రాంతి)/జహీరాబాద్: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఆ రాయి ఇప్పుడు జహీరాబాద్ రైతుల నెత్తిన పడిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మా సిటీకి వ్యతిరేకంగా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్‌కల్ మండలంలోని డప్పూర్ గ్రామంలో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలో గురువారం హరీశ్‌రావు పాల్గొ న్నారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు అప్పటి సీఎం కేసీఆర్ హైదరా బాద్‌కు సమీపంలో కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాల భూమి సిద్ధం చేశారని, దీనికి పర్యావరణ, అటవీ సహా అన్ని అనుమతులు వచ్చినట్లు తెలిపారు. న్యాల్‌కల్ మండలంలో భూము లు ఎంతో బాగున్నాయని, పచ్చని పంటలు పండుతున్నాయన్నారు.

డప్పూర్‌లో ఉన్న భూముల్లో రైతులు మూడు పంటలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. బంగారం పంటలు పండే భూము ల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. డప్పూర్‌లో సేకరించే భూమిలో మూడు, నాలుగు వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేసి, మిగతా భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్లాన్‌లో ప్రభుత్వం ఉందని ఆరోపించారు.

హైదరాబాద్‌లో 15 వేల ఎకరాల భూమి ఉండగా ఇక్కడ ఎందుకు ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని విమర్శించారు. డప్పూర్‌లో 2 వేల ఎకరాలు గుంజుకుంటే బీఆర్ ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. జేసీబీలు, పొక్లెయిన్లు వస్తే మీ ఎమ్మెల్యే, నేను అడ్డంగా నిలబడతామని రైతులతో పేర్కొన్నారు. ఈ విషయమై గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టులో కేసులు వేస్తామని వెల్లడించారు.

ఇళ్లు కూలగొట్టుడు.. భూములు కొల్లగొట్టుడేనా ఇందిరమ్మ పాలన?

హైదరాబాద్‌లోని మూసీ నది పక్కన నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూలగొట్టుడు.. భూములు కొల్లగొట్టుడేనా ఇందిరమ్మ పాలన అంటే అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇందిరమ్మ గరీబీ హఠావో అంటే.. సీఎం రేవంత్‌రెడ్డి కిసాన్ హఠావో, గరీబీకో హఠావో అంటున్నారని ఆరోపించారు. వరంగల్ డిక్లరేషన్‌లో ప్రభుత్వ భూములకు పట్టాలు ఇస్తా అన్నావు.. ఇప్పుడు భూములు గుంజుకుంటున్నావని అన్నారు.

రేవంత్ తీరుపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందించాలని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతుబంధు ఇవ్వలేదని.. రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదని.. రాష్ట్రంలో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయలేదన్నారు. దేవుల మీద ఒట్టు పెట్టి ఆగస్ట్ వరకు రుణమాఫీ చేస్తామన్నారని.. ప్రజలను, దేవుళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.  

ప్రాణాలైనా ఇస్తాం.. భూములు ఇవ్వం 

కాగా, తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ బంగారు పంటలు పండే భూములు ఫార్మా సిటీకి ఇవ్వమని డప్పూర్ గ్రామ ప్రజలు, రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వం భూము లు తీసుకునే ప్రయత్నం చేస్తే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్, సంగారెడ్డి ఎమ్మెల్యే లు మాణిక్‌రావు, చింత ప్రభాకర్, ఎమ్మెల్సీ యాదవ్‌రెడ్డి, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, దేవిప్రసాద్‌రావు, బీఆర్‌ఎస్ నాయకులు బాల్‌రెడ్డి రవీందర్, ఫరీద్, డప్పూర్ మాజీ సర్పంచ్ రవికుమార్, రైతులు రవిగౌడ్, సుభాశ్ పాల్గొన్నారు.

మా భూమిలో అడుగుపెట్టనివ్వం 

మాకు అత్తామామలు ఇచ్చిన భూమి ఉంది. మాకున్న భూమి లో పంటలు సా గు చేసి ఏడాదికి రూ.3 లక్షల వరకు సంపా దిస్తు న్నాం. ప్రభుత్వం ఫార్మాసిటీకి భూములు తీసుకుంటే మా కొడుకులకు ఏమివ్వాలి. ఉన్న రెండెకరాలు తీసుకుంటే ఏం చేయాలి. మా భూమిలోకి అడుగు పెట్టనివ్వం. రైతులను మోసం చేసేందుకే ఫార్మా సిటీ అంటున్నారు.  

 శరణమ్మ, 

మహిళా రైతు, డప్పూర్

మా భూ తల్లికి ఎసరు పెట్టిండు

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి వచ్చిండో కానీ మా భూ తల్లికి ఎసరు పెట్టిండు. మాకు రెండెకరాల భూమి ఉంది. భూమి తీసుకొని ప్రభుత్వం మాకు ఇచ్చే డబ్బులతో కొందామన్నా ఎక్కడా భూమి రాదు. మమ్మల్ని మోసం చేసేందుకు సర్కార్ ప్రయ త్నం చేస్తోంది. చావనైనా చస్తాం కానీ మా భూములు మాత్రం ఇవ్వం.   

 లలితమ్మ, 

మహిళా రైతు, డప్పూర్