14-02-2025 01:52:37 AM
* భారతదేశంలో అడుగుపెట్టిన బ్రిటీష్ వాళ్లు తమ వలసవాద వ్యూహం కోసం మన సమాజంలో ఉన్న విభేదాలను అద్భుతంగా ఉపయోగించుకున్నారు. వాళ్లు కులగణనలను నిర్వహించారు. అవేవీ రికార్డు కాలేదు సరికదా కుల వ్యవస్థ దేశ పరిపాలన, సామాజిక వ్యవస్థలోకి మరింతగా చొరబడేలా చేశారు. ‘విభజించి పాలించు’ అన్న వారి విస్తృత విధానంలో ఇది ఒక భాగమే. ఈ విధానం హిందువులు, ముస్లింల మధ్య మతపరమైన విభజనలు మరింత బలపడి చివరికి భారతదేశం విభజనకు, పాకిస్థాన్ ఏర్పాటుకు దారితీసింది.
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేత్వత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కులగణనను పూర్తి చేసింది. ఈ పరిణామం పట్ల సంతోషపడడానికి బదులు చాలా కులసంఘాలు తమ జనాభా బలాన్ని సరిగా అంచ నా వేయలేదని, తమకు మరింత ఎక్కువ రిజర్వేషన్లు లభించాలంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
వాటి అసంతృప్తిలో తప్పేమీ లేకపోవచ్చు. అయితే ఈ సందర్భంగా కుల ఆధా రిత రిజర్వేషన్ల విధానంపైనే ప్రజల్లో విస్తృతమైన చర్చ మొదలైంది. ఈ అంశాన్ని లోతు గా పరిశీలించినట్లయితే పురాతన కాలంనుంచి ఉన్న సంక్లిష్టమైన కులవ్యవస్థనుంచి దేశంలో ఇప్పుడున్న పరిస్థితి దాకా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
సుసంపన్నమైన భారతీయ సాంస్కృతిక చరిత్రలో కుల వ్యవస్థ అనేది వివాదాస్పదమైనదే కాక శాశ్వతమైనదిగా బలంగా పాతుకుపోయింది. ప్రాచీన కాలంలో తాము చేసే వృత్తుల ఆధారంగా మొదలైన ప్రజల వర్గ్గీకరణ చివరికి బలమైన కుల వ్యవస్థగా రూపాంతరం చెందింది.
ప్రాచీన మూలాలు మొదలుకొని దాని ఆధునిక రాజకీయ రూపాంతరాలదాకా వేళ్లూనుకుని పోయిన ఈ సామాజిక సమస్యను పరిష్కరించడానికి సమూల మార్పు తీసుకు వచ్చే చర్య అవసరమనే విషయాన్ని హైలెట్ చేస్తూ భారతదేశంలో కులంయొక్క చారిత్రక పథాన్ని లోతుగా విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం.
వర్ణం నుంచి కులందాకా..
ప్రాచీన భారతంలో సమాజం వర్ణం (అంటే రంగు అని అర్థం) భావనతో పాటుగా వారు చేసే వృత్తి, పని ఆధారంగా నిర్మితమైం ది. బ్రాహ్మణులు అనే వారు పూజారులు, పండితులు. క్షత్రియులు అంటే యోధులు, పాలకులు, వైశ్యులు అంటే వ్యాపారులు, రైతులు, శూద్రులు అంటే సేవలందించే వారుగా ఉండే వారు. కాలక్రమంలో ఈ వ్యవస్థ మరింత బలమైనదిగా మార్పు చెందింది.
కులాలు లేదా జాతులు అనేవి వారసత్వంగా మార్పు చెందడం, ఫలితంగా సామాజిక, ఆర్థిక పాత్రలు పుట్టుక ఆధారిత గుర్తింపులుగా మారిపోయాయి. మొగలుల కాలంలో ఆసక్తికరమైన పరిణామా లు చోటు చేసుకున్నాయి. పాలకులు ఈ కుల వ్యవస్థను కూల్చివేయడానికి బదులు ప్రజలపై పట్టు సాగించడం కోసం కొన్ని సమయాల్లో దానిని బలవంతంగా అమలు చేశారు.
హిందువుల్లో కుల పద్ధతులను వారు సమర్థించారు. లేదా కనీసం నిరుత్సాహపరచలేదు. దేశంలో అడుగుపెట్టిన బ్రిటీష్ వాళ్లు తమ వలసవాద వ్యూహం కోసం సమాజంలో ఉన్న ఈ విభేదాలను అద్భుతంగా ఉపయోగించుకున్నారు. వాళ్లు కులగణనలను నిర్వహించారు.
అవేవీ రికార్డు కాలేదు సరికదా కుల వ్యవస్థ దేశ పరిపాలన, సామాజిక వ్యవస్థలోకి మరింతగా చొరబడేలా చేశారు. ‘విభజించి పాలించు’ అన్న వారి విస్తృత విధానంలో ఇది ఒక భాగమే. ఈ విధానం హిందువులు, ముస్లింల మధ్య మతపరమైన విభజనలు మరింత బలపడి చివరికి భారతదేశం విభజనకు, పాకిస్థాన్ ఏర్పాటుకు దారితీసింది.
స్వాతంత్య్రం తర్వాత..
స్వాతంత్యానంతరం కులవ్యవస్థ రద్దు కాలేదు సరికదా రాజకీయ రంగు పులుముకుంది. శతాబ్దాల వివక్షను పరిష్కరించడానికి రాజ్యాంగ నిర్మాతల్లో కీలకమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీలు),ఆ తర్వాత ఇతర వెనుకబడిన కులాలకు(ఓబీసీలు) రిజర్వేషన్లు అనే సకారాత్మక చర్య కల్పించారు. ఇది కేవలం తాత్కాలిక చర్య అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని కొనసాగించడమే కాకుండా సామాజిక న్యాయానికి బదులు రాజకీయ లబ్ధి కోసం ఈ రిజర్వేషన్లను మరింత విస్తరించారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితి
ప్రస్తుతం కులరాకీయాలు గతంలో కంటే ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓట్లను రాబట్టుకోవడానికి కులాలతో ముడిపెట్టడానికి అన్ని రాజకీయ పార్టీలు సిగ్గుపడడం లేదు. పార్టీలు ఉపకులాలను ప్రోత్సహించడం, ఫలితంగా సమాజంలో మరిన్ని చీలికలు రావడంతో సమాజం మరింత ముక్కలు చెక్కలువుతోంది.
సముద్ధరణకు ఓ సాధనం కావడానికి బదులు రిజర్వేషన్ వ్యవస్థ ఒక వివాదాస్పద రణస్థలిగా మారింది. కులాల్లో చీలికలను పోగొట్టడానికి బదులు మరింతగా రెచ్చగొడుతోందన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి.
కులం రాజకీయ వ్యూహాన్ని నిర్ణయించే ప్రస్తుత వ్యవస్థ కారణంగా సమాజంలోని వివిధ వర్గాల్లో నివురుగప్పిన నిప్పులా అసంతృప్తికి దారితీసింది.రిజర్వేషన్ల నిబద్ధత, సమర్థత పట్ల భయం లోలోపల పెరిగిపోతోంది. దీన్ని చెప్పుకోదగ్గ రీతిలో ప్రక్షాళన చేయని పక్షంలో సమాజం మరింత ముక్కలు చెక్కలు కావడమే కాక పౌర అశాంతికి దారితీసే ప్రమాదం ఉందనేది సుస్పష్టం.
ఐక్యతను ప్రోత్సహించాలి
రాజకీయ పార్టీలు కులాలకు అతీతంగా పెళ్లి చేసుకున్న జంటలకు పన్ను ప్రయోజనాలు, ఇండ్లు, లేదా విద్యాగ్రాంట్లు ఇవ్వడం ద్వారా కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. క్షేత్రస్థాయిలో సామాజిక ఏకీకరణకు ఇది దారితీస్తుంది.
ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లు
కుల ఆధారిత రిజర్వేషన్లకు బదులుగా ఆర్థిక గీటురాయిగా రిజర్వేషన్లు కల్పించడం వల్ల కులంతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన అందరికీ సమానంగా ప్రభుత్వ సాయం అందుతుంది.
విద్య, అవగాహన
కులం చారిత్రక నేపథ్యంతో పాటుగా సమానత్వం, యోగ్యత విలువల గురించి బోధించడం ద్వారా సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించే విద్య వైపు నిర్దిష్ట కృషి జరగాలి.
చట్టపరమైన చర్యలు
కుల ఆధారిత వివక్షను మరింత తీవ్రంగా శిక్షించే విధంగా కొత్త చట్టాలను చేయడం, లేదా ఇప్పటికే ఉన్న చట్టాలను పటిష్ఠం చేయడం ద్వారా కుల వివక్ష సామాజికంగానే కాక, న్యాయపరంగా కూడా భారమైన వ్యవహారంగా చేయాలి.
రాజకీయ సంకల్పం
అన్నిటికన్నా మించి కుల ఆధారిత రాజకీయాలకు దూరంగా జరిగే నిజమైన రాజకీయ సంకల్పం అవసరం. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాలిక సామాజిక సంస్కరణలకు కట్టుబడిన నాయకులు దీనికి అవసరం.
గతానికి చెందిన సామాజిక విభేదాలు మరింత బలపడేలా చూడడమా లేక సమైక్యత, సమానత్వాన్ని సాధించే కొత్త బాటలను ఎన్నుకోవడమా అనే కూడలిలో ప్రస్తుతం భారతదేశం నిలిచిఉంది. రాజకీయ అధికారం కోసం కులాన్ని వాడుకున్న చరిత్ర సవాలునే కాదు, అవకాశాన్ని కూడా అందించే వారసత్వాన్ని అందించింది. కులం దేశ ప్రజలను నిర్ణయించే, చీల్చే అంశంగా కాక నిజమైన ప్రజాస్వామిక, నిష్పక్షపాత సమాజ విజన్‌ను పరిరక్షించే దిశగా దేశ నాయకత్వం నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకోవాలి.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి