calender_icon.png 24 January, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే లేఖ రాయడమేమిటి?

16-07-2024 01:11:36 AM

హనుమకొండ బీఆర్‌ఎస్ భవన నిర్మాణ కేసులో హైకోర్టు వ్యాఖ్య

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): హనుమకొండలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణ నిమిత్తం స్థల కేటాయింపును రద్దు చేయాలంటూ ఎమ్మె ల్యే నాయిని రాజేందర్‌రెడ్డి లేఖ రాస్తే దాని ఆధారంగా ఆర్డీవో చర్యలకు ఉపక్రమించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఎమ్యెల్యే చెప్తే ఏదైనా ఆదేశాలు జారీ చేస్తారా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. జిల్లా కలెక్టర్‌కు ఎమ్మెల్యే రాసిన లేఖను సమర్పించాలని ఉత్తర్వులు జారీచేసింది.

స్థల కేటాయింపు ఉత్తర్వులు, నిర్మాణ అనుమతులను మూడు రోజుల్లో సమర్పించా లంటూ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జూన్ 25న జారీచేసిన నోటీసును సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు డీ వినయ్‌భాస్కర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సోమవారం జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యే రాసిన లేఖ ఆధారంగా చర్యలకు అధికారులు ఉపక్రమించడం అన్యాయమన్నారు. ఎమ్మెల్యే లేఖ ఆధారంగా కలెక్టర్ గత నెల ఒకటిన ఆర్డీవోకు ఆదేశాలిచ్చారని చెప్పారు. 2018లో ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్ 167 ప్రకారం బీఆర్‌ఎస్‌కు ఎకరం స్థలం కేటాయించిందని తెలిపారు. ఆ భూమికి బీఆర్‌ఎస్ పార్టీ రూ.4.84 లక్షలను ప్రభుత్వానికి చెల్లించిందని చెప్పారు.

కాంపౌండ్ వాల్ మాత్రమే నిర్మాణం జరిగిందని, తాత్కాలికంగా షెడ్డును ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యాకలాపాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. అనుమతులు రాకముందే నిర్మాణాలు ఎలా చేపట్టారని అడిగారు. ఇదే సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి కల్పించుకుని, ఆ పిటిషన్ను ఆదిలోనే కొట్టేయాలని, పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పారు. కేటాయించిన స్థలం ఓ ప్రాంతంలో ఉంటే నిర్మాణాలు ఇంకోచోట చేపట్టారని అన్నారు. స్పందించిన న్యాయమూర్తి.. అవన్నీ సరేగాని, ఎమ్మెల్యే రాసిన లేఖ ఆధారంగా అధికారులు చర్యలు ఎలా చేపడతారని ప్రశ్నించారు. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేశారు.