calender_icon.png 20 October, 2024 | 4:26 PM

మీటర్ల మాటేమిటి?

28-07-2024 05:46:48 AM

  1. సూరత్ నుంచి కిలోల లెక్కన చీరలు తెచ్చి.. బతుకమ్మ చీరల పేరుతో ఆడబిడ్డలకు పంచారు
  2. ఓఆర్‌ఆర్‌ను పల్లీ బఠానీల్లా అమ్ముకున్నరు
  3. కేసీఆర్ కిట్, గొర్రెల స్కీమ్‌పై విచారణకు సిద్ధమా?
  4. పార్లమెంట్ ఎన్నికల్లో ఉరితీసినా మారరా?
  5. బీఆర్‌ఎస్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలు
  6. ప్రధాని మోదీని పెద్దన్న అంటే తప్పేంటని ప్రశ్న
  7. రూ.20 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ప్రాజెక్టులు పూర్తికావు

బీఆర్‌ఎస్ పదేళ్లలో పాలమూరుకు అన్యాయం చేసింది. పాలమూరోళ్లం కేసీఆర్‌కు ఏం అన్యాయం చేసినం? 2009లో కరీంనగర్‌లో ఓడగొడుతారని భయపడి, పాలమూరులో కేసీఆర్ నిలబబడ్డారు. అక్కడ వలసలు పోయే ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకొని గెలిపించారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా ఎంత నిర్లక్ష్యానికి గురైందో.. గత పదేళ్లలో అంతకంటే దారుణంగా నిర్లక్ష్యానికి గురైంది. భీమా, కల్వకుర్తి, నెట్టంపాడు, జూరాల, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో ఏదీ పూర్తికాలేదు. రూ. 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా మా ప్రాజెక్టులు పూర్తి కావు. దీనికి బీఆర్‌ఎస్ చేసిన దుర్మార్గం కారణం కాదా? అని ప్రశ్నించారు.     సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ పథకంపై విచారణకు బీఆర్‌ఎస్ సిద్ధమా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి చెప్పిన బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు.. వాళ్లు అమ్ముకున్న ఆస్తుల గురించి ఎందుకు చెప్పట్లేదని నిలదీశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు శిక్షించిన తర్వాత కూడా బీఆర్‌ఎస్ నేతలు ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. గత అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలుంటే, ఐదారుమంది ఉన్నారని హరీశ్‌రావు ఎలా చెబుతారని మండిపడ్డారు. వార్షిక బడ్జెట్‌పై అసెంబ్లీలో శనివారం చర్చ జరిగింది. బీఆర్‌ఎస్ తరఫున హరీశ్‌రావు మాట్లాడుతూ తమ సర్కారు హయాంలో చేసిన సంక్షేమం, అభివృద్ధి అంశాలను వివరించారు.

హరీశ్‌రావు ప్రసంగానికి సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత అసెంబ్లీ సమావేశాల్లో తొండి లెక్కలు చెబితే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు గుండుసున్నా ఇచ్చారని, అయినా ఆ పార్టీ నేతల ఆలోచన మారలేదని విమర్శించారు. అర్థవంతమైన చర్చకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. రూ.లక్షల కోట్ల విలువైన ఓఆర్‌ఆర్‌ను పల్లీబఠానీలకు అమ్ముకున్నట్లు రూ.700 కోట్లకు తెగనమ్మారని బీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తారు. గొర్రెల పథకం కింద ఎన్ని జీవాలు ఇచ్చారు? అనేది లెక్కలు తేలాయని, ఏసీబీ అధికారులు పైపైన విచారణ చేస్తేనే రూ.700 కోట్లు దిగమింగినట్లు తేలిందని, ఈడీ కూడా దీనిపై రంగంలోకి దిగినట్లు గుర్తుచేశారు.

కేసీఆర్ కిట్‌లో అవినీతిపై కూడా విచారణ జరిపిస్తామని ప్రకటించారు. బతుకమ్మ చీరల పథకంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నామని చెప్పి, సూరత్‌లో కిలోల లెక్కన కొని ఇక్కడి ఆడబిడ్డలకు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆ చీరలను కట్టుకోలేక, వ్యవసాయ పొలాల్లో పిట్టలను బెదిరించడానికి కడుతున్నారని తెలిపారు. బతుకమ్మ అనేది తెలంగాణ ఆడబిడ్డలకు ఒక సెంటిమెంట్ అని, దాన్ని కూడా దోపిడీకి ఉపయోగించుకున్నారని విమర్శించారు.

రంగారెడ్డి జిల్లా భూములను తెగనమ్మారు

కాళేశ్వరంపై జరుగుతున్న విచారణపై కూడా రేవంత్‌రెడ్డి స్పందించారు. కాళేశ్వరానికి తాము రూ.80 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశామని, మరి రూ.లక్షల కోట్ల అవినీతి ఎలా జరిగిందని బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నించారని, ఇప్పుడేమో రూ.94 వేల కోట్ల ఖర్చు చేసినట్లు వాళ్లే చెబుతున్నారని సీఎం మండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎన్నో తప్పిదాలు చేశారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలో అనేక భూములను బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెగనమ్మిందని ఆరోపించారు. ఆ భూములు అమ్మి అక్కడ కనీసం రోడ్లు కూడా వేయలేదని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎన్ని వేల కోట్ల భూములు అమ్మారో లెక్క తీస్తామని చెప్పారు. తాము అది కట్టినం, ఇది కట్టినం అని చెబుతున్న హరీష్‌రావు.. ఎన్ని అమ్ముకున్నారో వాటి  లెక్కలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.

‘రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటరు, అక్కడి ఆస్తులు అమ్ముకుంటరు. చేవెళ్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. ప్రాజెక్టుల డిజైన్లు మార్చి గోదావరి జలాలలను మెదక్ వరకు పరిమితం చేసి.. రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చారు. రంగారెడ్డి, చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, కొడంగల్‌కు గోదావరి జాలాలు రాకుండా కుట్రపన్నారు. రంగారెడ్డి జిల్లా ఏం పాపం చేసింది?’ అని ధ్వజమెత్తారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాళ్లు చేతులు ఇరగ్గొట్టారు. అయినా మారకపోతే.. పార్లమెంట్ ఎన్నికల్లో ఉరితీశారు. గండు సున్నా ఇచ్చినా ఇలా మాట్లాడటం కరెక్టు కాదు’ అని సీఎం ఫైర్ అయ్యారు.

పెద్దాయనకు ‘ఫుల్’ నాలెడ్జ్

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హాఫ్ నాలెడ్జ్ అంటూ హరీష్ అనడంపై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హాఫ్ నాలెడ్జ్ అయితే.. పెద్దాయన (కేసీఆర్)కు ‘ఫుల్’ నాలెడ్జ్ అంటూ.. ఫుల్ బాటిల్ సిగ్నల్ చూపించారు. 

మోటర్లకు మీటర్లపై  కేసీఆర్ ప్రభుత్వం సంతకాలు

కేంద్రం రూ.30 వేల కోట్ల నిధులు ఇస్తామన్నా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడానికి తాము ఒప్పుకోలేదని హరీష్‌రావు అన్న మాటలకు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోటర్లకు మీటర్లు పెట్టడానికి 2017, జనవరి 4వ తేదీన కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నదని వివరించారు. అందుకు సంబంధించిన పత్రాలను సభలో చూపించారు. ఈ అగ్రిమెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాటి విద్యుత్తు శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా, పవర్ సదరమ్ కంపెనీ నుంచి రఘుమారెడ్డి, నార్త్ పవర్ నుంచి ఏ గోపాల్‌రావు సంతకాలు చేశారని వెల్లడించారు. నాడు మోదీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని ఈ అగ్రిమెంట్ ద్వారా బట్టబయలైందని రేవంత్ చెప్పుకొచ్చారు.