calender_icon.png 19 March, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక సదుపాయాల మాటేమిటి?

15-02-2025 12:00:00 AM

హైదరాబాద్ రాష్ట్రరాజధాని నగరం. 430 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ నగరం దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటి. బలమైన ఐటీ రంగం, అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్, సాంస్కృతిక వారసత్వంతో కళకళలాడుతున్న నగరం. దీని అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలు ప్రణాళికలు సిద్ధం చేసింది. పలు ఫ్లువర్లు రానున్నాయి. ఇప్పటికే జూపార్క్‌నుంచి ఆరాంఘర్ దాకా ఫైఓవర్ అందుబాటులోకి వచ్చింది. అయినా  మరికొన్ని ఫైఓవర్ బ్రిడ్జిల పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఉప్పల్ మేడిపల్లి , రామంతాపూర్, సంతోష్‌నగర్‌మలక్‌పేట బ్రిడ్జిలు, సుచిత్ర కొంపల్లి బ్రిడ్జిలను పేర్కొనవచ్చు.

ఆరు సంత్సరాల క్రితం పనులు ప్రారంభమైనా ఇప్పటికీ  ఇవి పూర్తికాలేదు. నగరాన్ని పాదచారులకు అనుకూలంగా మార్చడంలో భాగంగా దాదాపు 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 8 ప్రారంభం కాగా, మిగతా పనులు సాగుతున్నాయి. అయితే ఈ ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలను సరైన సదుపాయాలతో ఏర్పాటు చేయకపోతే వాటిని ఉపయోగించే వారు త క్కువే ఉంటారనేది మనకు గత అనుభవాలు చెబుతున్నాయి. నగరంలో అనేక రోడ్లు డ్రైనేజి నీటితో తడిసి ముద్దవుతున్నాయి. చాలా రోడ్లు గుంతమయంగా మారిపోయాయి. చివరికి పోష్ కాలనీలు గా చెప్పుకునే ప్రాంతాల్ల్లో కూడా ఇదే పరిస్థితి. మ్యాన్‌హోళ్లకయితే అసలు మూతలే ఉండవు. హెచ్చరిక బోర్డులయినా పెడతారా అంటే అదీ లేదు. కొన్ని చోట్ల పెట్టినా వాటిని మరమ్మతు చేయడానికి నెలలు పడుతోంది. అప్పటిదాకా జనాలకు ఇబ్బందులే. 

ఇక తాగునీరు, బస్సు షెల్టర్లు లాంటి కనీస సదుపాయాల గురించి పట్టించుకునే అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ కనిపించరు. బస్సులకోసం జనం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిలబడాల్సిందే తప్ప తలదాచునే నీడ కూడా కరువవవుతోంది. రాబోయే వేసవి ఎండలకు ఈ కష్టాలు మరింతగా పెరుగుతాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తేనే మనది విశ్వనగరమని గర్వంగా చెప్పుకోగలం. ముఖ్యమైన ప్రాంతాల్లో రోడ్లను చూసి ఇదే అభివృద్ధి అని ఎలా భావించగలం. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఆలోచన స్థానిక కార్పొరేట్లకు లేకుండా పోతోంది. రాజకీయాలే వాళ్లకు ముఖ్యమయిపోయింది.

 డా. ఎం. సురేష్ బాబు