- కిలో రూ.29కే అందిస్తామన్న కేంద్ర ప్రభుత్వం
- పేదలకు అందుబాటులోకి రాని సన్నబియ్యం
- జిల్లాలో తెరుచుకోని బియ్యం విక్రయ కేంద్రాలు
- రేషన్ షాపుల ద్వారా అందించాలంటున్న ప్రజలు
సూర్యాపేట, జూలై24 (విజయక్రాంతి): పెరుగుతున్న బియ్యం ధరలకు కళ్లెం వేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరపై కిలో రూ.29కే భారత్ రైస్ విక్రయించాలని నిర్ణయించింది. పేదలకు, మధ్య తర గతి ప్రజలకు అందుబాటు ధరలతో 5 కేజీ లు, 10 కేజీల బస్తాలను అందుబాటులోకి తెస్తూ గత ఫిబ్రవరి 7 నుంచి దేశ వ్యాప్తంగా బహిరంగ మార్కెట్‌లో అమ్మకాలు ప్రారంభించింది. ఆరు నెలలు గడుస్తున్నా జిల్లాలో మాత్రం ఈ బియ్యం ఎక్కడా లభించడం లేదు. విక్రయాలకు సంబంధించిన వివరాలేవీ పౌరసరఫరాల శాఖ అధికారుల వద్ద అందుబాటులో లేవు.
అందుబాటులో లేని విక్రయ కేంద్రాలు
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో సన్నబియ్యం నాణ్యతను బట్టీ కిలో రూ.52 నుం చి రూ.75 వరకు పలుకుతున్నాయి. భారత్ రైస్ పేరుతో కేంద్రం కేవలం రూ.29కే కిలో బియ్యాన్ని విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నా.. జిల్లాలో విక్రయ కేంద్రాల జాడ ఎక్కడా కనిపించడం లేదు. భారత్ రైస్ విక్రయించడానికి నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా), ఎన్‌సీసీఎఫ్ ( నేషనల్ కో ఆపరేటివ్ కన్జూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్రీయ బండార్ రిటైల్ అవుట్‌లెట్ లాంటి ఈ కామర్స్ సంస్థలకు అప్పగించింది.
ఈ సంస్థలు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసుకోని ప్రజకు భారత్‌రైస్‌ను అందుబాటులోకి తీసుకరావాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ఎక్కడా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసిన దాఖలాలు లేదు. మరో వైపు భారత్ రైస్ విక్రయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతో రాయితీ బియ్యం అందడం లేదనే వాదన కూడా వినబడుతోంది.
ఆన్‌లైన్‌లోనే అందుబాటులో..
భారత్ రైస్ విక్రయాలను ఈ కామర్స్ సంస్థలకు అప్పగించడంతో సామాన్యులకు ఈ బియ్యం అందుబాటులోకి రావడం లేదు. జియో మార్ట్, అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థల్లో ఆన్‌లైన్‌లో ఈ బియ్యం అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో అందుబా టులో లేక పోవడం, ఈ కామర్స్ సంస్థలపై గ్రామీణ ప్రాంతాల్లో అంతగా అవగా హన లేకపోవడంతో ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తున్నా ఉపయోగం లేకుండా పోతుంది.
చౌకధరల దుకాణాలే మేలు
భారత్ రైస్‌ను కేంద్ర ప్రభుత్వం ఈ కామర్స్ సంస్థల ద్వారా విక్రయించాలని తీసుకున్న నిర్ణయంపై సామాన్యులు పెదవి విరుస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉం డే చౌకధరల దుకాణాల ద్వారా భారత్ రైస్ విక్రయించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తెల్లరే షన్ కార్డులు కలిగిన లబ్ధిదారులకు చౌక ధరల దుకాణాల్లో ఉచితంగా దొడ్డుబియ్యం పంపిణీ చేస్తున్నది. ఇదే మాది రిగానే రాయితీతో అందిస్తున్న భారత్‌రైస్ కూడా నిత్యావసర సరకులతో పాటు అందించాలని ప్రజలు కోరుతున్నారు.