calender_icon.png 13 November, 2024 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గులాబీలో గుర్తింపేది?

11-11-2024 01:12:13 AM

  1. పార్టీ కోసం శ్రమిస్తున్నా జాడలేని పదవులు
  2. గతంలో లబ్ధిపొందిన వారికే సమావేశాల్లో మర్యాదలు
  3. ఇప్పటికీ ఉద్యమ నేతలు జెండా మోసుడే
  4. ప్రతిపక్షంలో ఉన్నా తీరు మార్చుకోని పార్టీ పెద్దలు 
  5. నేటికీ చురుకైన కార్యకర్తలను గుర్తించని సీనియర్లు 
  6. నిర్లక్ష్యం చేస్తే ‘స్థానిక’ంలో ఓటమి తప్పదంటున్న శ్రేణులు

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లో సెకండ్ క్యాడర్ కమిటీలు ఏర్పాటు చేయకపోవడంపై అసంతృప్తితో గులాబీ శ్రేణులు రగిలిపోతున్నారు. అధికారం కోల్పోయి సుమారు ఏడాది కావస్తున్నా పార్టీ నిర్మాణంపై పెద్దలు దృష్టి సారించకపోవడంపై విమర్శలు చేస్తున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు కమిటీలపై నిర్లక్ష్యం చేసి పార్టీ ఓటమి తరువాత బలోపేతంపై ఎందుకు ఫోకస్ చేయడంలేదని ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పంచన చేరడంతో ఆ నియోజకవర్గానికి బాధ్యులను నియమించకపోవడంతో అక్కడ కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకోవడానికి దిక్కులేకుండా పోయింది.

అదే విధంగా జిల్లా, మండల, రాష్ట్ర కమిటీలో చోటు కోసం చాలామంది నాయకులు తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సమావేశాలు నిర్వహించే సమయంలో తమ అనుచరులతో కలిసి వచ్చి హంగామా చేస్తున్నారు. తమను గుర్తించి పార్టీ కమిటీలో చోటు కల్పిస్తారనే ఆశతో వస్తే పార్టీ కమిటీల గురించి పట్టించుకునే నాయకుడే లేడని వాపోతున్నారు.

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వలసవాదులకు పెద్ద పీట వేయగా, గెలుపు కోసం శ్రమించిన నేతలంతా జెండా మోసే కార్యకర్తలుగానే మిగిలారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా తమ శ్రమను గుర్తించి పార్టీ పదవులు ఇస్తారని భావిస్తే వాటి గురించి ప్రస్తావించే వారు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వలస నేతలకే గౌరవం 

 అధికారంలో ఉన్నపుడు ఇతర పార్టీల నుంచి రాత్రి రాత్రికి వచ్చిన నేతలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ పెద్దలు, పార్టీ ఓటమి కారణం వారేనని తెలిసినా ఎందుకు వారికి ఎనలేని గౌరవం ఇస్తున్నారని శ్రేణు లు ప్రశ్నిస్తున్నారు. పార్టీ సమావేశాలు నిర్వహిస్తే వేదికపై కండువా మార్చిన నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రభుత్వంపై విమర్శలు చేసే అంశాలపై ఉద్యమ నేతలను పిలుస్తున్నారని, పార్టీ కీలక సమావేశాలకు, కొత్త నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కనీసం సంప్రదించడం లేదని వాపోతున్నా రు. 2014లో మొదటిసారిగా పార్టీని విజయతీరాలకు చేర్చింది పదేళ్ల పాటు ఉద్యమ చేసిన నేతలేనని పేర్కొంటున్నారు.

అధికారం చేపట్టిన తరువాత చేరికల పేరుతో కాంగ్రెస్, టీడీపీ నేతలకు కండువాలు కప్పి అసలైన నేతలను దూరం పెట్టారని, కనీసం ఇప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు గౌరవం దక్కుతుందని భావిస్తే పార్టీ పెద్దల తీరు మారడం లేదని మండిపడుతున్నారు. 

కాలయాపన చేస్తే స్థానికంలో ఓటమి 

పార్టీ నిర్మాణంపై దృష్టిసారించకపోతే త్వరలో వచ్చే స్థానిక పోరులో కూడా పార్లమెంటు ఫలితాలే చవిచూడాల్సి వస్తుందని మండలస్థాయి నేతలు హెచ్చరిస్తున్నారు. గాలిలో దీపం పెట్టినట్లు పార్టీ బాధ్యతలు లేకపోవడంతో ఓటర్లను మచ్చిక చేసుకునే నాయకుడు ఉండరని చెబుతున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు గ్రూపుల పేరుతో కమి టీలు వేయకుండా నిర్లక్ష్యం చేశారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదేతీరుగా వ్యవ హరిస్తే పార్టీ తరుఫున పోటీ చేసే నేతలకు ఓటమి తప్పదని చురకలు వేస్తున్నారు. గ్రామ, మండలస్థాయిలో కమిటీలు వేసి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బలోపేతం చేసేందుకు అవకాశం ఉంటుందని, ఎవరికి బాధ్య త లేకుంటే నామమాత్రంగా ప్రచారం చేసి చేతులు దులుపుకుంటారని వెల్లడించారు. 

హస్తం వైపు చూపులు..

 రెండు పర్యాయాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వలస వచ్చిన నేతలంతా కబ్జాలు, లంచాలు తీసుకుని ఆర్థికంగా ఎదిగి కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత పార్టీ కార్యకలపాలకు అంటిముట్టనట్లుగా ఉ న్నారు. త్వరలో జరిగే పంచాయతీ పోరులో హస్తం వైపు అడుగులు వేసేందుకు ఎత్తులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక తోడ్పాటు దొరకలేదని, ప్రతిపక్షంలో పార్టీ కార్యక్రమాలకు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.