calender_icon.png 30 November, 2024 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాయుతిలో ఏం జరుగుతోంది?

30-11-2024 03:49:59 AM

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్

అమిత్ షాతో భేటీ తర్వాత కూడా వీడని ఉత్కంఠ

డిప్యూటీగా ఉండేందుకు అంగీకరించని షిండే!

సమావేశం తర్వాత సొంతూరుకు ఆపద్ధర్మ సీఎం 

ఫలితంగా ముంబైలో కూటమి కీలక సమావేశం రద్దు

మరిన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం

ముంబై, నవంబర్ 29: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. మహారాష్ట్ర ఫలితాలు వెలువడి ఆరు రోజులు కావస్తున్నా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రావడంలేదు. ఈ పరిస్థితి మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినా సమస్య కొలిక్కి రావడంలేదు. కూటమిలో ఏం జరుగుతుందో కూడా బయటికి రావడంలేదు.

భాగస్వామ్య పక్షాల అధినేతలు అంతా బాగున్నట్టే చెప్తున్నప్పటికీ ఇంకా చర్చలు కొలిక్కి రాకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉండేందుకు ఏక్‌నాథ్ షిండే అంగీకరించడం లేదని ఆయన సన్నిహితుడు చెప్పడం ఇందుకు బలం చేకూరుస్తోంది. అంతేకాకుండా మహాయుతి కూటమి కీలక సమావేశం శుక్రవారం సాయం త్రం జరగాల్సి ఉండగా హఠాత్తుగా రద్దయింది. ఫలితంగా ముఖ్యమంత్రి ఎంపిక మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  

హోంశాఖపైనా బీజేపీ, సేన పట్టు!

ఢిల్లీకి వెళ్లిన దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్‌షిండే, అజిత్‌పవార్ గురువారం రాత్రి అమిత్ షాతో వేర్వేరుగా సుదీర్గంగా చర్చలు జరిపారు. ఇందులో బీజేపీ నుంచి సీఎం, శివసేన, ఎన్సీపీ నుంచి డిప్యూటీ సీఎంల ఉంటారని ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా బీజేపీకి 22, శివసేనకు 12, ఎన్సీపీకి 9 మంత్రిత్వ శాఖలు దక్కనున్నాయి. ఈ ప్రతిపాదనకు షిండే అంగీకరించలేదని, తన కుమారుడి భవిష్యత్తును పరిష్కరించాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా కీలకమైన హోంశాఖ, పట్టణాభివృద్ధి, ప్రజాపనుల శాఖలతో పాటు మరిన్ని కీలక పోర్ట్‌ఫోలియోలు అడిగినట్లు సమాచారం. కానీ హోంశాఖను వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని, ఈ అంశంలోనే చర్చల్లో గందరగోళం ఏర్పడినట్లు తెలుస్తోంది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌కే బీజేపీ మొగ్గు చూపగా డిప్యూటీగా షిండేను ఒప్పిస్తున్నారు. కానీ ఆయన మెట్టు దిగేందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. 

కీలక సమావేశం రద్దు

భేటీ అనంతరం షిండే మాట్లాడుతూ.. సీఎం పదవిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తు త చర్చలు సానుకూలంగా జరగగా, మరోసారి ముంబైలో చర్చించి నిర్ణ యం ప్రకటిస్తాం. మిత్రపక్షాల మధ్య సమన్వయం బాగానే ఉంది. ప్రజల తీర్పుపై మాకు గౌరవం ఉంది. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని వెల్లడించారు. అంటే ముంబైలో మరో కీలకభేటీ శుక్రవారం జరగాల్సి ఉండేది. కానీ అది రద్దయినట్లు తెలుస్తోంది.

శివసేన అంతర్గత సమావేశం కూడా రద్దయిందని, ఢిల్లీ నుంచి రా గానే షిండే తన సొంతూరు సతారాకు వెళ్లారు. ఆయన మళ్లీ ముంబైకి వచ్చిన తర్వాతే ఈ సమావేశాలు జరిగే అవకాశముంది. మరోవైపు రెండ్రోజుల్లో బీజే పీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఇందులో ఏదొక నిర్ణయం తీసుకునే అవకాశముంది. డిసెంబర్ 2 లేదా 5న ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఫడ్నవీస్ రేసులో ముందున్నా సామాజిక సమీకరణాల కోణంలోనూ బీజేపీ మరో ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.