దీనికి బాధ్యులెవరు?.. కాగ్ నివేదికతో ఏకీభవిస్తారా..
ఖజానాపై అంత భారం పడుతుంటే పట్టింపు లేదా!
కాళేశ్వరంపై అధికారులను ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్
ప్రశ్నలకు సమాధానాలు దాటవేసిన చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మ
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబం ధించి ఆర్థిక వైఫల్యానికి బాధ్యులెవరని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అధికారులను ప్రశ్నించింది. బుధవారం బీఆర్‌కే భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ విచారణ కొనసాగింది.
ఈ విచారణకు కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ అధికారులు వెంకట అప్పారావు, పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్ చీఫ్ ఫణిభూషణ్ శర్మ హాజరయ్యారు. వీరు ఇంతకుముందే కమిషన్‌కు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా పీసీ ఘోష్ వారిని విచారించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపులు, కార్పొరేషన్ ఏర్పాటు, సిబ్బంది, ఉద్యోగుల జీతాలు, చెల్లింపుల గురించి ప్రశ్నిం చారు.
కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొని బిల్లులు వెంటనే చెల్లించకుండా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లు వెంకట అప్పారావు కమిషన్‌కు వివరించారు. దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని కార్పొరేషన్ నిర్వహణ కోసం వాడినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి రుణాల ద్వారా వచ్చే వడ్డీ నిధులను జీతాలుగా ఎలా తీసుకుంటారని కమిషన్ ప్రశ్నించింది.
కాళేశ్వరం కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్, డిఫ్యుటేషన్‌పై వచ్చినవారు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నట్లు కమిషన్‌కు అధికారులు తెలిపారు. కార్పొరేషన్ ట్రేడింగ్ బ్యాలెన్స్ అకౌంట్స్ ఏటా తనిఖీ చేస్తారా.. ఎవరి ఆదేశాల మేరకు రుణాలు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు, కార్పొరేషన్ బోర్డు ఆమోదం తర్వాతే రుణాలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.
కాళేశ్వరం కార్పొరేషన్‌కు రుణాలు తీసుకున్న తర్వాత ఏమైనా ఆస్తులు వచ్చాయా అని కమిషన్ ప్రశ్నించింది. ప్రస్తుతం కార్పొరేషన్‌కు ఆదాయ మేదీ లేదని తెలిపారు. బిల్లుల చెల్లింపులు మాత్రం నిబంధనల ప్రకారమే జరిగాయని వెల్లడించారు. కాగ్ నివేదిక గురించి కూడా అకౌంట్స్ అధికారులను జస్టిస్ పీసీ ఘోష్ ఆరా తీశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ బిల్లుల చెల్లింపు విషయంలో కాగ్ నివేదికతో అంగీకరిస్తారా అని ప్రశ్నించగా, ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా కాగ్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఆర్థిక స్థోమత, క్రమశిక్షణా వైఫల్యం విషయంలో తాము స్పందించలేమని అధికారులు తెలిపారు. చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటేశారు.
ఆమె పలు ప్రశ్నలకు తనకు సంబంధం లేదని, తెలియదని, చెప్పలేనంటూ సమాధానమిచ్చారు. చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అయి ఉండి తెలియదంటే ఎలా అని జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ఖజానాపై అంత భారం పడుతుంటే పట్టించుకోరా అంటూ ఆయన ప్రశ్నించారు.
రూ.1,597.12 కోట్లు కాదు రూ.159.712 కోట్లే
రూ.1,597.12 కోట్ల బ్యాంకు గ్యారెంటీలను కనీసం ఈఎన్‌సీకి కూడా చెప్పకుండా ఈఈ తిరుపతిరావు కాంట్రాక్టర్ అయిన ఎల్‌అండ్ టీకి ఇచ్చినట్లు మంగళవారం నాటి విచారణలో డిఫ్యూటీ సీఈ మహ్మద్ అజ్మల్ ఖాన్ కమిషన్ ముందు అంగీకరించిన సంగతి తెలిసిందే.
అయితే బ్యాంక్ గ్యారెంటీ నిధులు రూ.159.712 కోట్లు మాత్రమేనని సిబ్బంది టైపింగ్ మిస్టేక్ కారణంగా రూ.1,597.12 కోట్లుగా రికార్డు చేసినట్లు సమాచారం. బ్యాంక్ గ్యారెంటీ లు రూ. 1,597.12 కోట్లు ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు తెలియకుం డానే గుత్తేదారు అయిన ఎల్‌అండ్‌టీకి ఈఈ స్థాయి అధికారి రిలీజ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై ఇంజినీరింగ్ అధికారులు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.