మన దేశంలో బిలియనీర్లు పెరగడమంటే వ్యక్తుల అభివృద్దికి సూచిక. లక్షాధికారులూ, కోటీశ్వరులు పెరగటం దేశాభివృద్దికి సాక్షం. ధనవంతులు మితిమీరిన సంపదను పోగేసుకునే సంస్కృతి ఉన్నంత కాలమూ దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది. అయితే, ఒకరిపై మరొకరు ఆధిపత్యాన్ని సాధించాలన్న మనస్తత్వం సహజాతంగా ఉంటుంది. దానిని అధిగమించే సమానత్వ శాస్త్రీయ ధృక్పథం సామాజిక నేతృత్వమైన రాజకీయాల్లోనే ఉన్నదని గుర్తించాలి.
భారతదేశంలో గత సంవత్సరం 169 మంది శత కోటీశ్వరులు ఉంటే అది ఈ సంవత్సరానికి 200కు చేరింది. ఈ వివరాలను ప్రపంచ ప్రఖ్యాత ‘ఫోర్బ్స్’ పత్రిక ప్రకటించింది. వారి ఆదాయం ఒక సంవత్సరంలో 41 శాతం పెరిగి, 954 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నది. గత సంవత్సరం ఈ శత కోటీశ్వరుల ఆదాయం 675 బిలియన్ డాలర్లు గా ఉండింది. భారతదేశ నుండి అత్యధిక ధనవంతుల జాబితాలో ముకేష్ అంబానీ 116 బిలియన్ డాలర్లతో ముందు వరుసలో ఉంటే, 84 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదాని రెండవ స్థానంలో ఉన్నారు. 36.9 బిలియన్ డాలర్లతో శివనాడార్, 33.5 బిలియన్ డాలర్లతో జిందా ల్ కుటుంబం తరువాతి స్థానాల్లోస్థానాల్లో ఉన్నారు. ప్రపంచ పదిమంది దిగ్గజ కుబేరుల్లో ముకేశ్ అంబానీ 9వ స్థానంలో నిలిచారు.
వెలిగిపోతున్నది ఎవరు?
‘ఫోర్బ్స్’ పత్రిక 2024 సంవత్సరానికి విడుదల చేస్తూ, ‘బిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు’ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,781 మంది బిలియనీర్లు ఉన్నారు. గత ఒకే ఒక సంవత్సరంలో రెండు లక్షల కోట్ల అమెరికన్ డాలర్ల పెంపుదలతో వీరి సరాసరి ఆదా యం 14.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. 2౦౦ మంది బిలియనీర్లతో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానాన్ని దక్కించుకున్నది. 100 బిలియన్ డాలర్ల ఆదాయం తో ముకేష్ అంబానీ ఆసియాలో ఏకైక వ్యక్తిగా నమోదయ్యారు. 33.5 బిలియన్ డాలర్లతో సావిత్రి జిందాల్ భారతదేశంలో ని అత్యంత మహిళా సంపన్నురాలుగా గుర్తింపు పొందారు. ‘భారతదేశంలో అభివృద్ధి నమోదు అవుతున్నది కానీ, అది కొందరి చేతుల్లో కేంద్రీకృతమవుతున్నదని ‘ఫోర్బ్స్’ అభిప్రాయపడింది.
బిలియనీర్ల సంఖ్య పెరుగుతుంది అం టే చాలామంది సంబరపడిపోతారు. దీని ని ‘దేశానికి గర్వకారణం’గా కూడా భావిస్తారు. సాటి పౌరులు ధనవంతులు కావ డం ఆశించదగిందే కానీ, ధనవంతులయ్యే క్రమంలో వారు ఎంతమంది ప్రజలను దీనులను చేస్తున్నారన్నదే గుర్తించవలసిన అసలు వాస్తవం. ఎందరో కొవ్వొత్తిలా కరిగిపోతేనే కొంతమంది వెలిగిపోతున్నారన్న ది వాస్తవం. ఈ దేశ తలసరి ఆదాయం రూ.1 లక్ష 73 వేలు. నిజానికి లక్షాధికారికి ఇప్పుడంత ప్రాధాన్యం లేదు. అందువల్ల దేశంలో ప్రథమంగా పెరగవలసింది లక్ష ల్లో సంపాదన కలిగిన వారు.
వ్యక్తిగత ఆదాయ పన్ను గణాంకాలనుబట్టి ఈ దేశంలో రెండున్నర లక్షలకు పైగా ఆదా యం కలిగిన వాళ్లు కేవలం 7 కోట్ల 39 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఇందులోనే కోటీశ్వరులు, శత కోటీశ్వరులూ ఉన్నారు. ఇంకా 130 కోట్ల మంది సాలీనా 10 లక్షల ఆదాయానికి చేరుకోవాలంటే చాలా సమయం పట్టొచ్చు. ఏ దేశంలోనైనా క్రమమైన అభివృద్ధికి సూచిక ఏమం టే, లక్ష కోటీశ్వరులు, దశ కోటీశ్వరుల సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరగాలి. బిలియనీర్ల సంఖ్య ఎక్కువగా ఉండి లక్షాధికారులు, కోటీశ్వరుల సంఖ్య నామ మాత్రంగా ఉన్న దేశాన్ని ‘బలిష్టమైన సైన్యాధిపతులు కలిగిన అత్యంత బలహీనమైన సైన్యం ఉన్న దేశం’తో పోల్చవచ్చు.
ఉచితాలతో ఉద్ధరించేదేమీ లేదు
‘సంపద పునః పంపిణీ జరగాలి’ అని వినబడే భావనను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ‘సంపద పంపిణీ చేయడం’ అంటే ఉచిత పథకాల ద్వారా కాసిన్ని మెతుకులను విదిలించడమో లేదా సమాజంలోని కొందరు వెనుకబడిన వారి ని గుర్తించి కొన్ని రకాల పథకాల ద్వారా మేలు చేకూర్చడమో కాదు. సంపద పంపిణీ (రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్) అంటే, దోపిడీ (ఎక్స్‌ప్లాయిటేషన్)ని అరికట్టడమే. ఇంకా వివరంగా చెప్పాలంటే, సేవలు అందించే వారైనా, వస్తువులను విక్రయించే వారైనా. వ్యవహారాలను చక్కబెట్టే వారైనా తమ లాభాలను కాస్తంత తగ్గించుకోవాలి. లాభాపేక్ష ప్రధానమై దానిని మరిన్ని రెట్లు పెంచుకునే క్రమంలో మనుషుల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిద్వారా సంపద సృష్టించి, దానిని తామే పోగేసుకోవడంతోనే ఈ బిలియనీర్ల సంఖ్య పెరుగుతున్నది.
ఉదాహరణకు రిలయన్స్ జియో కంపెనీ దాదాపు 40 కోట్ల కస్టమర్లను కలిగి ఉన్నది. కోటాను కోట్ల పేదల దగ్గర కూడా రిలయన్స్ జియో కనెక్షన్లు ఉన్నవి. రిలయన్స్ పెట్రోలియం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేక ప్రాంతాలలో విస్తరించి కోటాను కోట్ల మందికి సేవలను అందిస్తున్నాయి. తాము వసూలు చేసే ఛార్జీలను ప్రతి కస్టమర్ దగ్గర ఓ 10 శాతం తగ్గించుకుంటే అట్లాంటి వారందరూ తమ జీవితాలలో వెలుగు నింపుకోకపోవచ్చు కానీ, పేదరికానికి సమాధానం చెబుతారు. రిలయన్స్ కేంద్ర సంస్థల నుంచి నడిచే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ప్రతి స్థాయిలో ఈ రకమైన వెసులుబాటు (లాభంలో వాటా తగ్గించుకోవడం ద్వారా మిగిలే ధనాన్ని వారికి చేకూర్చడం) కలిగిస్తే కోటీశ్వరుల సంఖ్య కచ్చితంగా పెరుగుతుంది.
ప్రణాళికా లోపమే కారణం
పని చేసుకోకపోవడం వల్ల, సోమరిగా ఉండడం వల్ల, ప్రభుత్వ పథకాలపై ఆధార పడటం వల్ల ప్రజలు పేదలుగా ఉంటున్నారని చాలామంది అభిప్రాయ పడుతుంటా రు. కానీ, అది వాస్తవం కాదు. పేదరికం తగ్గక పోవడానికి లేదా మధ్యతరగతి నుండి ఓ మోస్తరు ధనవంతంలోకి ప్రజ లు అడుగు పెట్టక పోవడానికి కారణం, వారి కష్టార్జితానికి తగిన ప్రతిఫలం ఇవ్వక పోవడం. ఇది ఒక కారణమైతే వారికి అందించే వస్తు సేవలపై అధిక ధరలను వేయడం రెండవ కారణం. ఇక మూడవది అత్యంత ప్రధానమైంది పన్నుల విధానం. ఏ దేశంలో లేనంతగా భారతదేశంలో పరోక్ష పన్ను 60 శాతం పైగా వసూలు చేయబడుతున్నది. ఇంతలా పరోక్ష పన్ను ఎందుకు విధించబడుతున్నదంటే ప్రత్యక్ష పన్ను పరిధిలోకి ఆదాయం గల వారినందరిని తీసుకువచ్చే సరైన ప్రణాళిక లేకపో వడం వల్ల!
‘ఈ దేశంలో వ్యవసాయంపై పన్ను లేదుగా’ అంటూ చాలామంది పెదవి విరుస్తారు. అసలు వ్యవసాయం స్థూల జాతీయోత్పత్తిలో కేవలం 15 నుండి 17 శాతం మాత్రమే ఉన్నదని మరిచిపోతారు. ఐదు లక్షల పైబడి అనంత సంపాదన కలిగిన వారందరూ 30% ఆదాయ పన్నునే కడుతున్నారు. ఇలాంటి పన్ను విధానం సరైంది కాదు. అత్యంత ధనికులపై, ఆస్తిపాస్తులు ఒకరి నుండి మరొకరికి జరిగే బదలాయింపుపై కనీసం ఒక శాతం పన్ను విధించినా కిందిస్థాయి ప్రజలపై తక్కువ పన్ను విధించే అవకాశం ఉన్నదని ప్రఖ్యా త ఆర్థికవేత్త థామస్ పీకేట్టీ చేసిన సూచనలను కొందరు ప్రముఖ ఆర్థిక వేత్తలు, మీడియా సంస్థలు ఎద్దేవా చేస్తుంటారు. నిజానికి భారతదేశంలో వారసత్వం ద్వారా సంక్రమించిన ఆస్తిపాస్తుల బదలాయింపులపై ఒక శాతం పన్ను విధించినా దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు సాలీ నా సమీకరించవచ్చని అనేక సందర్భాల్లో సదరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.
స్వతంత్ర భారతదేశాన్ని నిర్మించడానికి చిన్న మొత్తాలలో పొదుపులను ప్రోత్సహించడం, కొంతమేర పన్నులు విధిం చడం, మరికొన్ని అప్పులు సేకరించడం ద్వారా ప్రణాళిక రచించారు. పొదుపు సేకరించడానికి పన్ను రాయితీలు కల్పించడం ఒక ఆనవాయితీగా వస్తుండేది. కానీ, ఇప్పుడది పూర్తిగా విస్మరణకు గురవుతున్నది. 2024 ఏప్రిల్ 1 నుండి మొదలయ్యే నూ తన వ్యక్తిగత ఆదాయ పన్ను విధానంలో ఏ రకమైన పొదుపులకు పన్ను మినహాయింపులు లేవు. దేశంలో 100% గృహ వసతి లేదు కాబట్టి, ఎవరు గృహాలు నిర్మించినా ఇళ్ళు లేని వారికి అద్దెకైనా ఇల్లు దొరుకుతుందని గృహరుణాలపై చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపు లభించేది.
ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్, పెన్ష న్లలో ప్రజలు పొదుపును దాచుకోవడం ద్వారా వృద్ధాప్యంలో సక్రమ జీవితాన్ని గడపడానికి అవకాశం ఉండాలని, ఆ పొదుపులపై పన్ను మినహాయింపు ఉండే ది. ఇప్పుడు వీటన్నింటినీ రద్దు చేశారు. దీని పర్యవసానంగా గృహ రుణాలు పిఎఫ్ కాంట్రిబ్యూషన్లు, పెన్షన్ కాంట్రిబ్యూషన్లు తగ్గిపోతున్నాయి. నూతన పెన్ష న్ విధానానికి జమ చేసే మొత్తాలకు పన్ను మినహాయింపు ఉండేది. ఇప్పుడా వెసులుబాటు కూడా లేకపోయేసరికి అరకొరగానే ఉపయోగపడే నూతన పెన్షన్ విధానానికి కూడా మొగ్గు చూపడానికి ఎవరూ ముం దుకు రావడం లేదు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎన్పీఎస్ ఖాతాదారుల సంఖ్య చాలావరకు తగ్గింది. ఈ తగ్గిం పునకు నూతన ఆదాయ పన్ను విధానమే కారణమని కూడా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
దేశ భద్రతకు నిర్దేశించిన ఒక సైనిక విమానాశ్రయాన్ని కూతురి పెళ్ళికి తాత్కాలిక అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దగల దిగ్గజం ఉన్నాడని గర్వించడం లో, గాంధీ ఆసుపత్రిలో పడకలు దొరకని పసి బాలింతలూ, కడు క్యాన్సర్ రోగులూ ఉండటంలో దేనికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఎంత మంది తమ రక్తాన్ని ధారపోస్తే కొందరి నుదుటన కుంకుమ తిలకమవుతుందో తెలియని పాలకులేమీ కాదు. ఆనందం పొందే క్రమంలో ఆర్తనాదాలు వినపడనం త దూరంలో, సదరు ఆనందానికి సహకరించే వారికి అతి చేరువలో వారున్నారు.
వ్యాసకర్త సెల్: 99513 00016
జి.తిరుపతయ్య