17-12-2024 01:22:02 AM
కరీంనగర్, డిసెంబరు 16 (విజయక్రాంతి): కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు పాలకవర్గం ఎన్నికలు జరగక ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరుగగా, 2017లో పదవీకాలం ముగిసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ కమిటీలతోనే నెట్టుకు వస్తున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన నామినేటెడ్ కమిటీ పదవీకాలం అక్టోబర్‌తో ముగిసింది.
ఎన్నికలపై హైకోర్టు స్టే వెకేట్ కూడా అయింది. ఈసారైనా ఎన్నికలు జరపాలని సభ్యులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఆదిశగా ఆలోచించడం లేదు. పొరుగుననే ఉన్న సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికలు జరుగగా, కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికలపై నీలినీడలు కమ్ముకున్నాయి. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకులో కరీంనగర్, జగిత్యాల, గంగాధర బ్రాంచిలలో కలిపి 14 వేల మంది సభ్యులు ఉన్నారు. పాలకవర్గం లేక బ్యాంకు అభివృద్ధి కుంటుపడుతున్నది.
2017లో ముగిసిన పదవీకాలం
అర్బన్ బ్యాంకు పదవీకాలం 2017 ఏప్రిల్‌తో ముగిసింది. అప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత సహకారశాఖ నిబంధనల మేరకు ఓటర్ల జాబితాను సిద్ధం చేయగా, కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. అప్పుడు మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ బ్యాంకు నిర్వహణ కోసం అదనపు కలెక్టర్, జిల్లా సహకార అధికారితోపాటు మరో ఆరుగురితో పర్సన్ ఇన్‌చార్జి కమిటీని నియమించారు.
ఈ నామినేటెడ్ కమిటీ పదవీకాలం 2024 వరకు కొనసాగగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వం ఆరు నెలల కోసం కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ పదవీకాలం కూడా పూర్తయింది. ఎన్నికలు జరుగుతాయా లేక మళ్లీ కమిటీని నియమిస్తారా అన్నది తేలాల్సి ఉన్నది. గత పాలకవర్గ సభ్యులతోపాటు కాంగ్రెస్ నాయకులు ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి ఎన్నికలు జరిగేలా చూడాలని వినతిపత్రం సమర్పించారు.
కరీంనగర్ బ్యాంకుకు 44 ఏళ్ల చరిత్ర
కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1980లో కొంతమంది కలిసి సహకార అర్బన్ బ్యాంకును ప్రారంభించారు. అంచెలంచెలుగా ఈ బ్యాంకు విస్తరించి వాణిజ్య, కార్పొరేట్ బ్యాంకులకు ధీటుగా ఖాతాదారులకు సేవలందిస్తూ వస్తున్నది. ప్రస్తుతం రూ.వంద కోట్లకు పైగా డిపాజిట్లు కలిగి ఉండి, రూ.50 కోట్ల వరకు రుణాలను అందిస్తూ ముందుకు సాగుతున్నది. ముఖ్యంగా స్వల్పకాలిక రుణాలను మంజూరు చేయడంతోపాటు డిపాజిట్లను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గతంలో ఎన్నికలకు సిద్ధమైనప్పుడు ఆధార్ అనుసంధానం చేయడంతో 14 వేల మంది సభ్యులలో ఓటుకు 9 వేల మంది మాత్రమే అర్హత సాధించారు. అయితే ప్రభుత్వం ఎన్నికలకుగనక సిద్ధమైతే తిరిగి ఓటర్ల జాబితా సవరణ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్‌కుమార్ రాజకీయం కూడా కరీంనగర్ అర్బన్ నుంచే ప్రారంభమయింది. ఆయన అర్బన్ బ్యాంకు డైరెక్టర్‌గా ఆయన రెండు పర్యాయాలు సేవలందించారు. బ్యాంకు అభివృద్ధిపై ఆయన దృష్టి సారిస్తే రేటింగ్ పెరిగే అవకాశాలు లేకపోలేదు.
ఆర్బీఐ అసంతృప్తి!
పర్సన్ ఇన్‌చార్జిగా ఉంటున్న అధికారులు ఇతరత్రా పనుల్లో బిజీలో ఉం డటంతో అర్బన్ బ్యాంకును పట్టించుకునేవారు లేకుండా పోయారు. బ్యాంకు రేటింగ్ పడిపోతుండటంతో గత సంవత్సరం క్రితమే ఆర్‌బీఐ అసంతృప్తిని వ్యక్తం చేసింది. సహకారశాఖ నిబంధనల మేరకు సభ్యులతో ఎన్నికైన పాలకవర్గం పదవీకాలం ముగిసిన వెంటనే తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
అయితే 2017లో కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పుడు ఎన్నికలకు బ్రేక్ పడింది. స్టే వెకేట్ చేయించడంలో గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎట్టకేలకు కోర్టు స్టే వెకేట్ అయింది. ఈసారైనా ఎన్నికలు జరిపి బ్యాంకును ముందుకు నడిపించాలని సభ్యులు కోరుతున్నారు.
మంత్రికి విజ్ఞప్తి చేశాం
కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికలు నిర్వహించాలని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరాం. మా పదవీకాలంలో అర్బన్ బ్యాంకుకు గుర్తింపు తీసుకువచ్చాం. పాలకవర్గం లేకుండా కమిటీలను నియమిస్తే అంతగా సభ్యులు శ్రద్ధ వహించే అవకాశం ఉండదు. పాలకవర్గం ఉంటేనే పాలకవర్గ సమావేశాలు, సర్వసభ్య సమావేశాలు సకాలంలో నిర్వహించి సభ్యుల సూచనలతో అభివృద్ధిపరచవచ్చు.
కర్ర రాజశేఖర్, మాజీ చైర్మన్