- రికార్డు స్థాయికి కర్బన ఉద్గారాలు
- 2024లో భారీగా పెరుగుదల గతేడాదితో పోలిస్తే 0.8 శాతం అధికం
- కాప్ సదస్సులో వివరాలు బహిర్గతం
న్యూఢిల్లీ, నవంబర్ 14: పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. స్వచ్ఛంద సంస్థలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. మానవాళికి పెను ముప్పుగా మారిన కర్బన ఉద్గారాలు ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. సమస్త విశ్వాన్ని కొత్త ఊబిలోకి నెడుతూనే వస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం ఈ ఏడు ఇప్పటివరకు వెలువడిన కర్బన ఉద్గారాల స్థాయి గత సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.
కర్బన ఉద్గారాలు ప్రధానంగా శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల నుంచి వెలువడుతున్నాయి. ఏటికేడు భూమ్మీద వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ఈ కర్బన ఉద్గారాల సంఖ్య కూడా పెరుగుతోంది. పర్యావరణ సహితంగా నడిచే వాహనాలు ఎన్ని వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు.
‘కాప్’లో బహిర్గతం
మానవాళికి పెను ముప్పుగా పరిగణించే కర్బన ఉద్గారాల స్థాయి ఈ ఏడాది రికార్డు స్థాయిలో పెరిగిందని అజర్‌బైజాన్ రాజధాని బాకులో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్‌లో బహిర్గతమైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు శిలాజ ఇంధనాల ద్వారా 37.4 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ వెలువడినట్లు తెలిసింది.
గతేడాదితో పోల్చుకుంటే ఇది 0.8 శాతం ఎక్కువ. ఇంకా ఏడాది పూర్తి కాకముందే ఇలా ఉంటే పూర్తి సంవత్సరం తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈవీలు భేష్..
ప్రస్తుతం ప్రపంచంలో పేరు గాంచిన ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల కోసం తాపత్రయపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈవీలను మార్కెట్లోకి విడుదల చేయగా.. మరికొన్ని కంపెనీలు అదే బాటలో ఉన్నాయి. ఈవీల వాడకం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోంది. ఈ ఈవీల వల్ల 22 దేశాల్లో కర్బన ఉద్గారాల స్థాయి తగ్గినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కర్బన ఉద్గారాల కట్టడికి నడుం బిగించాయి. కానీ ఇంకా ఎన్నో దేశాలు ఈ కార్యక్రమంలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. అసలు పర్యావరణంతో మాకెంటి సంబంధం అనేలా ఉన్న ఆ దేశాల వైఖరితో ఎప్పటికైనా ఇబ్బందికరమే. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కొన్ని దేశాలు అనేక పద్ధతులను అవలంబిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ఈ ఉద్గారాల కట్టడికి కృషి చేసినపుడే ఫలితం వస్తుంది. కర్బన ఉద్గారాలు తగ్గిన దేశాల జాబితాను పరిశీలిస్తే ఎక్కువ భాగం యురోపియన్ యూనియన్ దేశాలే ఉండడం గమనార్హం.
ప్రకృతి ప్రళయాలు..
కర్బన ఉద్గారాల వల్ల ప్రకృతి నాశనం అవుతుందన్న మాటను ఎవరూ కాదనలేరు. 19వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా 16 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ వ్యర్థాలు మాత్రమే వెలువడేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఈ కర్బన ఉద్గారాల వల్ల ఎన్నో ప్రకృతి విళయాలు సంభవిస్తున్నాయి. ఇన్ని విపత్తులు ఎదురవుతున్నా మానవుడు మాత్రం కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేయడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.