calender_icon.png 4 October, 2024 | 6:56 AM

జైళ్లలో ఇంకా కులమేంది?

04-10-2024 01:37:51 AM

కులం ఆధారంగా ఉద్యోగాల రూల్ దారుణం

76 ఏండ్ల తర్వాత కూడా కుల వివక్షేనా?

దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: దేశంలోని జైళ్లలో కొన్ని ఉద్యోగాలను కులం ఆధారంగా కేటాయించే విధానాన్ని సుప్రీంకోర్టు రద్దుచేసిం ది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన తర్వాత కూడా సమాజంలో ఇం కా కుల వివక్ష కొనసాగుతుండటంపై ఆవేదన వ్యక్తంచేసింది.

చాలా రాష్ట్రాల్లోని జైలు మాన్యువల్స్ కుల వివక్షను పెంచేలా ఉన్నాయని ఆరోపిస్తూ ప్రముఖ జర్నలిస్టు సుకన్య శాంత దాఖలుచేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారిం చింది. కులం ఆధారంగా జైళ్లలో పనులు విభజించటాన్ని వెంటనే రద్దుచేయాలని కేంద్రప్రభుత్వంతోపాటు రాష్ట్రాలను ఆదేశించింది. 

మూడు నెలలే సమయం

మూడు నెలల్లోగా జైలు మాన్యువల్స్‌ను మార్చేసి కులంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలవారు అన్ని పనులు చేసేలా అవకాశం కల్పించాలని ధర్మాసనం ఆదేశించింది. దేశంలోని జైళ్లలో ఇప్పటికీ భోజ నాలు వండే పనిలో అగ్రకులాలవారిని మా త్రమే నియమిస్తున్నారు. పాయఖానాలు కడగటం, జైళ్లను ఊడవటం వంటి పనులును కింది కులాల వారికి కేటాయించారు.

ఈ విధానంపై కోర్టు తీవ్ర నిరసన తెలిపింది. జైళ్లకు వచ్చే ఖైదీల వివరాలు నమోదు చేసే రిజిస్టర్ పుస్తకాల్లో కూడా కులం నమోదుచేసే కాలం ఉంటుంది. ఈ  కాలంతోపాటు జైలు మాన్యువల్స్ మొత్తం మార్చేయాలని, ఇందుకు మూడు నెలల గడువు మాత్రమే ఇస్తున్నామని స్పష్టంచేసింది. ‘ఆర్టికల్ 15 ప్రకారం కుల వివక్షను చూపేలా ఉన్నవి అన్ని ప్రొవిజన్స్ రాజ్యాంగ విరుద్ధం.

ఈ తీర్పును అనుసరించి జైలు మాన్యువల్స్‌ను మార్చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశిస్తు న్నాం. మూడు నెలల్లోగా ఈ పనిని పూర్తిచేయాలి. కులం ఆధారంగా ఖైదీలను వేరుచే యటం కుల వివక్ష చూపటం కిందకే వస్తుం ది. ఇలా వేరుచేయటం పునరావాసం కింద కు రాదు. ఖైదీలకు విలువ ఇవ్వకపోవటం వలసవాద విధానం’ అని సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు.

వాళ్లు నేరగాళ్లు కాదు

కొన్ని కులాలను నేరాలను చేసే వర్గం గా పోలీసులు రికార్డుల్లో పేర్కొనటంపై కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. డీనోటిఫైడ్ ట్రైబ్స్‌ను హ్యాబిచ్యువ ల్ క్రైమ్ గ్రూపులుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. జైలు మాన్యువల్స్‌లో అలాంటి నియమాలు ఉండటం దారుణమని పేర్కొన్నది.