ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, వ్యక్తిగత అలవాట్లు, ఉద్యోగాల్లో ఒత్తిడులు, ఆరోగ్య సమస్యల కారణంగా రోజురోజుకూ మానసిక సమస్యల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటోంది. దీనిలో కొత్తగా చేరిందే ‘బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్’. రోజురోజుకు దీని బారిన పడేవారి సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఈ ‘బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్’ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..
పేరుకి బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్ అయినా ఈ సమస్య అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరికీ చెందినది. కానీ యువతుల్లో ఎక్కువగా ఈ బాయ్ ఫ్రెండ్ సిక్‌నెస్ లక్షణాలు కనిపిస్తున్నాయని కొలంబియా యూనివర్సిటీలోని సైకియాట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ అమీర్ లెవెన్ తెలిపారు. ముఖ్యంగా కొత్తగా ప్రేమలో పడిన వారిలో, తమకి ఇష్టమైన వారితో లైంగిక అనుబంధాన్ని కలిగి ఉన్నవారిలో ఈ బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్ లక్షణాలు ఎక్కువని ఆమె వెల్లడించారు. ఈ సమస్యతో బాధపడేవారు నిత్యం ఆ వ్యక్తితో ఉండాలని, అతడి ఆలోచనల్లోనే గడుపుతుంటారని వెల్లడించారు.
లక్షణాలు
- కొత్తగా పరిచయమైన బాయ్ ఫ్రెండ్ చుట్టే ఆలోచనలు తిరుగుతుంటాయి.
- స్వతంత్రంగా ఏ పనీ చేయలేరు. ఒంటరిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు.
- భాగస్వామి గురించే ఆలోచిస్తూ స్నేహితులు, కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయడం, వారితో చాలా తక్కువ సమయం గడపడం చేస్తుంటారు.
- ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భాగస్వామినే అడుగుతారు.
- ఇష్టపడే వ్యక్తి తప్పులు చేస్తున్నా వాటిని అడ్డుకోవడం మాని, విస్మరిస్తుంటారు.
- ఫ్రెండ్ అందుబాటులో లేనప్పుడు చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారు.
- కొత్తగా లైంగిక బంధం పెట్టుకున్న వారిలోనూ బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్ ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.
అభద్రత భావం..
- ఇష్టమైన వ్యక్తి అందుబాటులో లేకుంటే అతడికి పదే పదే ఫోన్ చేస్తూ ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతూ గడిపేస్తుంటారు.
- ఇష్టపడే వ్యక్తి సోషల్ మీడియాను నిరంతరం తనిఖీ చేస్తారు. కొన్నిసార్లు అతడి ప్రతి కదలికను అనుమానిస్తుంటారు.
- బాయ్‌ఫ్రెండ్ కాస్త దూరం పెట్టినా అభద్రతా భావం కలుగుతుంది. వారు, వేరే పనిలో ఉన్నా సరే మిమ్మల్ని పట్టించుకోవడం లేదన్న ఇన్ సెక్యూరిటీ ఏర్పడుతుంది.
- అతడి ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చినా గతంలో మాదిరిగా ఇప్పుడు రిలేషన్ ఉండట్లేదని అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ కూడా ‘బాయ్ ఫ్రెండ్ సిక్‌నెస్’ కి సంకేతం.
ఎలా బయటపడాలి?
ప్రేమలో పడిన వ్యక్తుల్లోనే ఈ బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఒక తాత్కాలిక దశ. కొన్ని రోజులకు తగ్గిపోతుంది. అయితే దీన్ని ప్రారంభదశలోనే గుర్తిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీని నుంచి బయటపడేందుకు ప్రత్యేకంగా ఎలాంటి మందులు ఉండవు. పైన పేర్కొన్న లక్షణాలు తమలో ఉన్నట్లు గుర్తిస్తే.. తమని తాము ఇతర పనుల్లో బిజీ చేసుకోవాలి. కొత్తగా పరిచయమైన వ్యక్తితో మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా సమయం గడపాలి. వారితో మాట్లాడాలి. నిత్యం కొత్త బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ గురించే ఆలోచిస్తూ ఉంటే మెదడుపై తీవ్ర ఒత్తిడిపడే అవకాశం ఉంది.
ఇవి గుర్తించుకోవాలి..
- ప్రేమలో ఉండే యువతీయువకులు బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ అభిప్రాయాలకు, ఆదర్శాలకు గౌరవం ఇవ్వొచ్చు. కానీ, ఈ ప్రయత్నంలో సొంత లక్ష్యాలను పక్కన పెట్టకూడదు. అవతలి వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తూనే పర్సనల్ గోల్స్‌పై దృష్టి పెట్టాలి.
- భవిష్యత్తుకు సంబంధించి సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా.. వేరే వ్యక్తిపై ఆధారపడుతూ ఉంటే భవిష్యత్తులో మీ ఐడెంటిటీ ప్రమాదంలో పడుతుంది.
- ఓవర్ అటాచ్‌మెంట్ ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కొందరు యువకులు దీన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని రకరకాల ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది. తర్వాత ఎదురయ్యే పరిస్థితులను అమ్మాయిలు తట్టుకోవడం కష్టంగా మారుతుంది.
- నచ్చిన వ్యక్తి కోసం మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మనకు ఎప్పుడూ అండగా నిలిచేది వారేనని గుర్తు పెట్టుకోవాలి.