calender_icon.png 24 October, 2024 | 4:47 PM

కుక్కల దాడులపై ఏం చేస్తున్నారు?

11-07-2024 01:11:11 AM

పిల్లలు చనిపోతున్నారు.. మానవత్వంతో స్పందించండి

మురికివాడలపై అధికారులు దృష్టి పెట్టండి

వారంలోగా కమిటీ ఏర్పాటు చేయాలి: హైకోర్టు 

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): వీధి కుక్కల దాడుల్లో చిన్నారులు చనిపోతున్నారని, ఈ అంశంలో అధికారులు మానవ త్వంతో స్పందించి చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. వారంలోగా వీధి కుక్కల నియంత్రణకు సలహాలు ఇచ్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీకి ఉత్తర్వులు జారీచేసింది. పూర్తి వివ రాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచి ంచింది. స్టెరిలైజేషన్ లెక్కలు అవసరంలేదని, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు తిరిగి జరగకుండా తీసుకునే చర్యలు వివరించాలని ఆదేశించింది.

వీధి కుక్కల నియంత్రణకు అధికారులు సరైన చర్యలు చేపట్టడంలేదని, వాటికి వ్యాక్సినేషన్ చేయడంలేదని, సరైన ఆహారం లేక అవి మనుషులపై దాడి చేస్తున్నాయంటూ వనస్థలిపురానికి చెందిన ఎంఈ విక్రమాదిత్య పిల్ దాఖలు చేయగా, గత ఏడాది ఫిబ్రవరి 19న హైదరాబాద్ బాగ్ అంబర్‌పేటలో పాఠశాల విద్యార్థి కుక్కల దాడిలో మరణించిన ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాలను  హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. వీటిపై చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సంపనులు ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలపైనే కాకుండా పేదలు జీవనం వెళ్లదీస్తున్న మురికివాడలు, శివారు కాలనీలపైనా దృష్టి సారిం చాలని కోర్టు చురకలంటించింది.

కుక్కల దాడులు తరచూ ఎక్కడ జరుగుతున్నాయో పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కొత్త నిబంధనలు రూపొందించామని, కమిటీ ఏర్పాటు చేయా ల్సి ఉందని, దీనికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ నిబంధనలున్నా చర్యలుండవని, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారన్న అంశాన్ని మానవత్వంతో చూడాలని అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఎవరినీ ఉపేక్షించమని తేల్చి చెప్పింది. కమిటీ ఏర్పాటుతో ఏం చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.