calender_icon.png 23 October, 2024 | 12:52 PM

వెయ్యి ఉరుల మర్రికి ఊతమేది?

17-09-2024 05:09:37 AM

  1. బ్రిటిష్, నిజాంపై రాంజీగోండు తిరుగుబాటు
  2. 1000 మందితో సహా రాంజీగొండుకు ఉరి 
  3. హామీల అమలుపై పట్టింపు లేని పాలకులు 

నిర్మల్ ,సెప్టెంబర్16.(విజయక్రాంతి): సిపాయిల తిరుగుబాటుకు ముందే నిర్మల్‌లో నిజాం, బ్రిటిష్ వారికి కంటిమీద కునుకు లేకుండా చేసిన మహావీరుడు మర్సకోల రాంజీ గోండు. నిజాం నవాబులు హైదరాబాదును సంస్థానంగా చేసుకొని బ్రిటీష్ వారి సహకారంలో ఈ ప్రాంత ప్రజలను అనేక ఇబ్బందుకు గురి చేశారు. 

రాంజీ నాయకత్వంలో..

నిర్మల్ ప్రాంతంలో నిజాం, బ్రిటీష్ ప్రభుత్వ దాడులు పెరగడంతో వారికి వ్యతిరేకంగా తమ జాతి హక్కుల కోసం రోహిళ్లాలతో కలిసి రాంజీగొండు నిర్మల్ కేంద్రంగా పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటాన్ని అణచి వేసేందుకు రాంజీగోండుకు సహకరిస్తున్న వారిని పట్టుకొని చిత్రహింసలు పెట్టడం, జైలులో పెట్టడం, చంపడం వంటివి చేసినా వీరు వెనక్కి తగ్గలేదు. రాంజీగోండు మొత్తం 73 మందికి నాయకత్వ లక్షణాలు కల్పించి ప్రజలతో కలిసి పాలకులకు చుక్కలు చూపించారు. యుద్ధానికి నాయకత్వం వహిస్తున్న రాంజీగొండును, అతని అనుచరులను పట్టుకోవడానికి మరిన్ని బలగాలనుదించారు.

అయినా రాంజీగొండు వారికి చిక్కకుండా కొండలు అడవులు చెరువులు స్థావరంగా చేసుకొని బ్రిటీష్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో అప్పటి నిర్మల్ కలెక్టర్  కర్నాటకలో ఉన్న కల్నల్ రాబర్ట్ సహకారం కోరారు. రాబర్ట్ ఆధ్వర్యంలోని సైనికులను రాంజీ రెండుసార్లు తిప్పికొట్టారు. దీంతో రాంజీకి మద్దతుగా నిలుస్తున్న వారిని వేధించి మరికొందరిని రాబర్ట్ చంపేసి రాంజీ సైన్యాన్ని బలహీన పరిచాడు. రాంజీ గోండును పట్టిస్తే నగదు, సంపద ఇస్తామని, రక్షణ కల్పిస్తామని ప్రకటించారు. నజరానాకు ఆశపడి ఒకరు సోన్ ఘాడ్ వద్ద రాంజీగోండు సమావేశం నిర్వహిస్తుండగా ఆ సమాచారం రాబర్ట్‌కు అందించారు.

దీంతో బ్రిటీష్ సైన్యం అతడిని చుట్టుముట్టడంతో పోరాడి తీవ్రగాయాలతో పట్టుబడ్డారు. అందరిని ఉరి తీసినప్పటి నుంచి మర్రి చెట్టును ఇక్కడ వెయ్యి ఉరుల మర్రిగా పిలుస్తారు. ఆ మర్రి చెట్టు 1995 వరకు చరిత్రకు దర్పణంగా నిలిచినప్పటికి గాలిదూమారం కారణంగా నేలకు ఒరిగింది. అక్కడ గుర్తింపు చిహ్నంగా రాంజీగోండు స్మారక స్తూపాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సర తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17న ఉద్యమకారులు అక్కడ నివాళులు అర్పించి స్మరించుకొంటారు. జిల్లా కేంద్రంలో వెయ్యి ఉరుల మర్రి చరిత్ర ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వమైనా పట్టించుకుంటుందేమోనని స్థానికులు ఆశిస్తున్నారు.

రాంజీగోండుతో సహా 1000 మందికి ఉరి 

రాంజీగోండుతో పాట్టు పట్టుకొన్న 1000 మందిని బ్రిటీష్ సైన్యం చిత్రహింసలకు గురిచేసింది. వారందరిని సోన్ ఘాడ్ నుంచి నిర్మల్ పట్టణంలోని కురన్నపేట్ చెరువు వరకు తాడులతో బంధించి11 కి.మీ.ఈడ్చుకు వచ్చి విచారణ చేసి ఉరిశిక్ష వేయాలని నిర్ణయించారు. ఎల్లపల్లి రోడ్డువైపు ఉన్న పెద్ద మర్రివృక్షానికి ఉరితాళ్లు వేసి రాంజీగోండుతో సహా 1000 మంది అనుచరులను ఒకేసారి ఉరి తీశారు. ఈ ఉరి శిక్షను 1860 ఏప్రిల్ 9న అమలు చేసినట్టు చరిత్రలో ఉంది.