calender_icon.png 1 February, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీజనబుల్ టైం అంటే ఎంత ?

01-02-2025 12:59:25 AM

  1. మహారాష్ట్ర స్పీకర్ చేసినట్లే.. తెలంగాణ స్పీకర్ చేయాలనుకుంటున్నారా ?
  2. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): ‘బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైం కావాలంటున్నారు. మీ దృష్టిలో ఆ రీజినబుల్ అంటే ఎంత? ఐదేళ్ల అసెంబ్లీ గడువు ముగిసే వరకా? మహారాష్ట్రలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు అలాగే వీగిపోయింది కదా.. తెలంగాణ స్పీకర్ కూడా మహారాష్ట్ర స్పీకర్ మాదిరిగానే వ్యవహరిస్తారా ?’ అంటూ సుప్రీం కోర్టు శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ తరఫు సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీని ఘాటుగా ప్రశ్నించింది.

అందుకు ముకుల్ రోహత్గీ సమాధానమిస్తూ.. రెండు వారాల గడువు ఇస్తే స్పీకర్‌ను సంప్రదించి చెప్తానని బదులిచ్చారు. అందుకు న్యాయస్థానం అభ్యంతరం చెప్తూ.. ‘స్పీకర్‌ను అడిగేందుకు మీరు హైదరాబాద్ వెళ్లి రావాల్సిన అవసరం లేదు. ఫోన్లు అందుబాటులోనే ఉన్నాయి. న్యాయస్థానం కేవలం వారం మాత్రమే గడువు ఇవ్వగలదు’ అని స్పష్టం చేసింది.

విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్‌ఎస్ నుంచి బీఫారం తీసుకుని, ఎన్నికల్లో పోటీ చేసి, ఎమ్మెల్యేలుగా గెలిచి, ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించా లంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జి మైస్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ‘ఎమ్మెల్యేల అనర్హతపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని గతేడాది మార్చిలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ స్పీకర్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణ యం తీసుకోలేదు’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మె ల్యేలకు నోటీసులు ఇచ్చామని అసెంబ్లీ సెక్రటరీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ‘

సదరు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ జనవరి 15న నోటీసులు జారీ చేశారు’ అని సమాధానమివ్వగా, ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. 2024 మార్చిలో స్పీకర్‌కు ఫిరాయింపులపై ఫిర్యాదు ఇస్తే, ఈ ఏడాది జనవరి 15న నోటీసులు ఇవ్వడమేంటని, పైగా ఇంకా స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.