చిన్నారులకు ఏది గుడ్ టచ్.. ఏది బ్యాడ్ టచ్ అనేది తల్లిదండ్రులు దినచర్యలో భాగంగా నేర్పిస్తూ పెంచాలి. ఎదుటి వ్యక్తులు ఛాతిపై తడమటం.. గట్టిగా కౌగిలించుకోవడం, అసభ్యంగా తాకడం వంటివి చేస్తే ఎలా ప్రతిఘటించాలో చిన్నారులకు అవగాహన కల్పించాలి. ఆప్యాయంగా తాకడం.. దురుద్దేశపూర్వకంగా ముట్టుకోవడం లాంటి తేడాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని అంటున్నారు నిపుణులు. పిల్లలకు మంచి ఏదో.. చెడు ఏదో చెప్పాల్సిన తల్లిదండ్రులే.. ఏ టచ్ ఎలాంటిదో.. ఎవరిని దగ్గరగా రానివ్వకూడదో.. ఎవరూ ఎక్కడ తాకకూడదో చెప్పడానికి సంకోచిస్తున్నారు. ఈ ధోరణిని త్వరగా వీడి.. పిల్లలకు ఏది మంచో, ఏది చెడో వివరించాలి అంటున్నారు నిపుణులు.
నిత్యం పిల్లల కిడ్నాప్‌లు, వారిపై లైంగిక వేధింపులు జరుగుతున్న కేసులను మనం ఎప్పటికప్పుడూ చూస్తూనే ఉంటున్నాం. అయినా సరే కొందరు తల్లిదండ్రులు పిల్లలకు కొన్ని సెన్సిటివ్ విషయాలు నేర్పేందుకు ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకు ఆ విషయాలపై అవగాహన లేకుంటే ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి అంటున్నారు నిపుణులు. చిన్నారులను రాక్షసుల నుంచి కాపాడుకోవాలి అనుకునేవారు.. కొన్ని విషయాలు చర్చించాలి. ఆలస్యం కాకముందే వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి వాటిపై అవగాహన కల్పించాలి.
తెలిసినవాళ్లే ఎక్కువ..
చాలా సందర్భాల్లో తెలిసిన వ్యక్తులే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఏం జరుగుతుందో తెలియని స్థితిలో పిల్లలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ స్థితిలో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ పల్ల పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి గుడ్ టచ్ అంటే ఏమిటి? బ్యాట్ టచ్ అంటే ఏమిటి? అనేది పిల్లలకు అర్థం చేయించాలి. ఒక స్పర్శ మీకు మంచి అనుభూతిని కలిగిస్తే.. అది గుడ్ టచ్. అది మీకు చెడుగా లేదా అసౌకర్యంగా అనిపిస్తే అది బ్యాడ్ టచ్. తెలియని వ్యక్తి మిమ్మల్ని అనుచితమైన ప్రదేశాలలో ఉద్దేశపూర్వకంగా తాకినట్లయితే అది మళ్లీ బ్యాడ్ టచ్ అవుతుంది. ఇలాంటి విషయాలను అర్థమయ్యేలా చెప్పాలి.
అవగాహన అవసరం..
* గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వారిపై లైంగిక దాడులు అధికంగా పెరుగుతున్నాయి. వారి శరీర అవయవాల గురించి అవగాహన కల్పించడం ముఖ్యం. అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశాలపై పాఠశాల యాజమాన్యం పిల్లలకు అవగాహన కల్పించాలి.
* ముఖ్యంగా యువత స్మార్ట్‌ఫోన్లు వినియోగంలో జాగ్రత్తలు అవసరం. ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల విషయంలో అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ రిక్వెస్ట్‌లు పెట్టడం, ఎవరో తెలియని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే యాక్సెఫ్ట్ చేయకుండా ఉంటే మంచిది.
* ఎవరైనా పరిచయం చేసుకుని స్నేహం పేరుతో దగ్గరవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారిని గుడ్డిగా నమ్మవద్దు. తన ప్రవర్తనలో మార్పు వస్తే మాత్రం కచ్చితంగా దూరం పెట్టండి. ఇంట్లో వారికి సమాచారం ఇవ్వాలి. ఈ విషయంలో పిల్లలు కాస్త ధైర్యంగా ఉండాలి.
* కొన్నిసార్లు బంధువులు, ఇంట్లో వారి నడవడికనూ గమనిస్తూ ఉండటం బెటర్. ఎందుకంటే అసభ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిసిన వెంటనే పోలీసులను ఆశ్రయిం చడం ఉత్తమం.
* రోడ్డు మీద వెళ్లినప్పుడు ఆకతాయిలు నిత్యం వేధింపులకు గురిచేస్తే ఆ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పాలి. ఏదో అవుతుందని భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. అలా చేయకుంటే వేధింపులు అధికమై ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం వద్దు!
సమాజంలో జరిగే నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. “పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి నేర్పించడం చాలా అవసరం. చిన్నారులపై జరిగే లైంగిక దాడులను అరికట్టడంలో ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పద్ధతి చాలా చక్కగా పని చేస్తుంది. బ్యాడ్ టచ్ సంఘటనలు తమకు ఎదురైనప్పుడు తల్లిదండ్రులకు ఆ విషయాన్ని స్వేచ్ఛగా పిల్లలు చెప్పగలుగుతారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది. దురదృష్టకరమేంటంటే.. చాలామంది తల్లి దండ్రులు తమ బిజీ లైఫ్‌లో పడి పిల్లల పెంపకంపై శ్రద్ధ చూపడం లేదు. చిన్నారులు చెప్పే విషయాలను వినే ఓపిక కూడా వారికి ఉండటం లేదు. పిల్లల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై వారికి అవగాహన కల్పించాలి”.
- టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
పిల్లలకు మాట్లాడే స్వేచ్ఛనివ్వాలి!
ఏదో సంఘటన జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి విషయాల గురించి చర్చించుకుంటున్నాం. అలా కాకుండా ఇంట్లో తల్లిదండ్రులు ప్రతిరోజు పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అని చెప్తూ పెంచాలి. ఫ్రీగా మాట్లాడే స్వేచ్ఛను, పిల్లలతో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే ఇలాంటి సమస్యలు రావు. అలాగే మగ పిల్లలను పెంచే విధానంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే అమ్మాయిలకు చిన్నప్పటి నుంచి సెల్ఫ్ డిఫెన్స్ అనేది రెగ్యులర్ పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలి. దాంతో పాటు ప్రతి స్కూల్లో ఒక సైకాలజిస్టు ఉండాలి. అలాగే పబ్లిక్ నెట్‌వర్క్ డోమైన్స్‌లో ఫోర్న్ సైట్స్‌ను, వాటికి సంబంధించిన యాడ్స్ రాకుండా బ్లాక్ చేయాలి. నిజానికి సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని మాత్రమే అనుకుంటాం. అలా కాదు చిన్నప్పటి నుంచి పిల్లలకు గుడ్ టచ్ అంటే ఏంటి? బ్యాడ్ టచ్ అంటే ఏంటి? అనేవి వివరిస్తూ పెంచాలి. అప్పుడే పిల్లల్లో కొంత అవగాహన పెరుగుతుంది.
డాక్టర్ ఎమ్.శ్వేత
హెచ్‌ఓడీ రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్‌మెంట్
సరోజినీ నాయుడు వనితా ఫార్మసీ మహా విద్యాలయం, తార్నాక