calender_icon.png 2 November, 2024 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ మారకుంటే ప్రాణగండమా?

17-07-2024 03:59:55 AM

  • బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను భయపెడుతున్న పోలీసులు 
  • ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలి 
  • సుప్రీం తీర్పు ప్రకారం ౩ నెలల్లో సభ్యత్వం రద్దు చేయాలి 
  • బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం 

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయా లని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కే తారకరామారావు కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ  ఫిరాయింపుల అంశంలో మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పార్టీ మారటానికి ఇష్టపడని తమ ఎమ్మెల్యేలకు ప్రాణగండం ఉందని పోలీస్ అధికారులు పరోక్షంగా హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు.

మంగళవారం తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి స్పీకర్‌ను కలిసిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చేరిన 10మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధిత సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల కాపీలను కూడా స్పీకర్‌కు అందించినట్లు తెలిపారు. ఫిరాయింపులకు పాల్పడిన వారి విషయంలో మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని 2020 జనవరిలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.

తెలంగాణలోనూ 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల విషయంలో ఇదే పద్దతిని అనుసరించాలని కోరినట్లు వెల్లడించారు. లేకుం టే స్పీకర్ పదవికి అగౌరవం వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఐదేండ్ల కాలపరిమితిలో ఎమ్మె ల్యే ఫిరాయింపులకు పాల్పడితే మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని, లేదంటే మణిపూర్‌లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించినట్టుగానే ఇక్కడా జరుగుతుందని స్పష్టంచేశారు. మార్చి 13న దానం నాగేందర్‌పై పిటిషన్ ఇచ్చామని, తాజాగా మరో 9 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. తమ ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. 

రేవంత్‌ది దుర్మార్గ పాలన

రేవంత్‌రెడ్డి పాలనలో దుర్మార్గమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని కేటీఆర్ విమర్శించారు. ‘పార్టీ మారేందుకు ఇష్టపడని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరికి స్థానిక డీఎస్పీలు ఫోన్ చేసి మీకు ప్రాణాపాయం ఉందని పరోక్షంగా పార్టీ మారాలని హెచ్చరించారు. బీజేపీని వాషింగ్ మెషీన్ పార్టీగా విమర్శించిన కాంగ్రెస్ అదే పనిచేస్తోంది. మా పార్టీ ఎమ్మెల్యేలు రాజశేఖర్‌రెడ్డి, మల్లారెడ్డి ఆస్తులు, భవనాలపై దాడులు జరుగు తున్నాయి. కొంతమందికి ప్రాణగండం ఉందంటూ ఒత్తిడి తెస్తూ బెదిరిస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలో రాజ్యాంగాన్ని కాపాడుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఫోజులు కొడుతున్నారని, ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలా వ్యవహరిస్తోందని 

విమర్శించారు.  ఎమ్మెల్యేల హక్కులను కాపాడాలి

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేల ప్రొటోకాల్ విషయంలో జరుగుతున్న ఉల్లంఘనలను స్పీకర్ దృష్టికి తీసుకొచ్చినట్లు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆరు నెలలుగా ప్రతి నియోజకవర్గంలో ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకే ప్రభుత్వ అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.

రెండురోజల కితం మహేశ్వరంలో ఎన్నికల్లో ఓడిపోయి మూడోస్థానంలో నిలిచిన అభ్యర్థిని స్టేజిపై కూర్చొబెట్టారని తెలిపారు. గెలిచిన ఎమ్మెల్యేల హక్కులను కాపాడాలనే తాము స్పీకర్‌ను కోరామని చెప్పారు. దేవదాయ, పోలీసు అధికారులు కూడా సర్దుకుపొమ్మని ఎమ్మెల్యేలకే చెప్పే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందన్నారు.